త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad Metro Rail | క‌థ కంచికి.. మెట్రో మళ్లీ మొదటికి

Hyderabad Metro Rail | మెట్రో ఫేజ్ 1 స్వాధీనానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన 13,600 కోట్ల రూపాయల అప్పు ఇప్పట్లో రాదని తేలిపోయింది. ఈ అప్పు కోసం కొత్తగా వెతుకులాడాల్సిందే. అందుకోసం కొత్తగా ఓ కన్సల్టెన్సీని నియమించారు. ఆ సంస్థ అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిన తర్వాతే .. అప్పుడు రుణం ఎవరిస్తారో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

S

Telangana | Published On Jun 23, 2026, 5.46 pm IST

Hyderabad Metro Rail | క‌థ కంచికి.. మెట్రో మళ్లీ మొదటికి
Advertisement
  • 13,600 కోట్ల అప్పు రాదు

  • కొండెక్కిన జపాన్ రుణం

  • కొత్తగా అప్పుల కోసం వెతుకులాట

  • రాని రుణానికి 1600 కోట్లకు పైగా ఖర్చు

  • ఫేజ్ 1 స్వాధీనం కోసం కన్సల్టెన్సీ నియామకం

  • ఎస్బీఐ క్యాప్స్‌కు బాధ్యతల అప్పగింత

  • కన్సల్టెన్సీ నివేదిక ఆధారంగానే భవిష్యత్ కార్యాచరణ

  • అప్పటిదాకా మెట్రో స్వాధీనం ఆగినట్టే

  • ఫేజ్ 2 మరింత జాప్యం

  • కేంద్రంతో చర్చలు ఫలించాయంటూ

    సీఎం రేవంత్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్వీట్లు

  • మెట్రోకు రుణం మంజూరుపై ఎలాంటి ప్రకటన చేయని కేంద్రం

Hyderabad Metro Rail | త్రినేత్ర‌.న్యూస్ : మెట్రో ఫేజ్ 1 స్వాధీనానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన 13,600 కోట్ల రూపాయల అప్పు ఇప్పట్లో రాదని తేలిపోయింది. ఈ అప్పు కోసం కొత్తగా వెతుకులాడాల్సిందే. అందుకోసం కొత్తగా ఓ కన్సల్టెన్సీని నియమించారు. ఆ సంస్థ అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిన తర్వాతే .. అప్పుడు రుణం ఎవరిస్తారో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ రుణ మంజూరుపై కేంద్రంతో తాడో పేడో తేల్చుకుంటామని జూన్ 15న సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పినా.. మొత్తం ఈ వ్యవహారం అంతా మళ్లీ మొదటికే వచ్చింది. ఏతావాతా తేలిందేమిటంటే.. మెట్రో ఫేజ్ 1 స్వాధీనం వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ప్రభుత్వం చేతిలోకి రావడానికి ఇంకాస్తా సమయం పట్టనుంది.

చిక్కుముడి అంతా.. 13,600 కోట్ల వద్దే

హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణ కోసం తప్పనిసరిగా ఫేజ్ 1ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది. ఇందుకు గాను 15వేల కోట్ల రూపాయలు ఎల్ ఆండ్ టీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఇదే క్రమంలో 13,600 కోట్ల రూపాయల రుణం కోసం అన్వేషణ ప్రారంభమైంది. కాగా, జపాన్ నుంచి రుణం మంజూరైందని.. అది ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్‌సీ) ద్వారా విడుదల కావాల్సి ఉందని ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఇందులో భాగంగానే కేంద్రమంత్రి కిషన రెడ్డి చొరవ తీసుకోవాలని కోరారు. పైగా, కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌, కేంద్ర గృహ నిర్మాణ‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌ల అపాయింట్ మెంట్లు ఇప్పించాలని కిషన్ రెడ్డికి సీఎం రెండు సార్లు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో, మంగళవారం ఉదయం ఖట్టర్‌తో సంప్రదింపులు జరిపారు. అనంతరం.. చర్చలు సఫలమయ్యాయని, మెట్రో వ్యవహారంలో ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ఇదే సమయంలో.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా.. ఇద్దరు కేంద్రమంత్రులతో సమావేశాలు సానుకూల వాతావరణంలో జరిగాయని ట్వీట్ ద్వారా ప్రకటించారు.

చర్చలు.. సఫలమేనా?

మెట్రో ఫేజ్ 1కు రుణం, ఫేజ్ 2 విస్తరణపై కేంద్రంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ.. ఆయన చేసిన ప్రకటనలో పెండింగ్‌లో ఉన్న జపాన్ రుణం గురించి ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు. ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. " హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌- I వాల్యూయేష‌న్‌, స్వాధీనానికి అవ‌స‌ర‌మైన రుణ సేక‌ర‌ణ‌, రుణ సంస్థ ఎంపిక, మెట్రో ఫేజ్‌-II విస్త‌ర‌ణ‌, నిర్మాణ‌ వ్య‌యం, అందుకు అవ‌స‌ర‌మైన రుణ సేక‌ర‌ణ తదితర అంశాల‌ను అధ్య‌య‌నం చేసేందుకు క‌న్స‌ల్టెంట్‌ను నియ‌మించాల‌ని కేంద్ర మంత్రులు, ముఖ్య‌మంత్రి ఈ సమావేశంలో ఏకాభిప్రాయానికి వ‌చ్చారు. ఇందుకోసం క‌న్స‌ల్టెంట్‌గా ఎస్‌బీఐ క్యాప్స్‌ను ఎంపిక చేశారు. మెట్రో ఫేజ్‌-I వాల్యూయేష‌న్‌, ఫేజ్‌-II విస్త‌ర‌ణ‌తో పాటు ఇత‌ర అంశాల‌పై SBICAPS స‌మ‌గ్రంగా అధ్య‌య‌నం చేయ‌నుంది. ఆ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ చేపట్టనున్నారు" అని స్పష్టం చేశారు.

జపాన్ అప్పు ఏమైంది?

కేంద్రంతో చర్చలు సఫలమయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినా ఈ వ్యవహారంలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ చర్చలు సఫలమై ఉంటే.. ఐఆర్ఎఫ్‌సీ నుంచి విడుదల కావాల్సిన రుణం ఎందుకు మంజూరు కాలేదో .. అన్న ప్రశ్నకు జవాబు దొరకడం లేదు. జూన్ 15న విలేకరుల సమావేశంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. "మేం ఐఆర్ఎఫ్‌సీని లోన్‌కు ఒప్పించాం. రూ.13,600 కోట్లు 4 శాతం వడ్డీకి జపాన్ సంస్థతో అప్పు తీసుకొచ్చాం. ఇది ఐఆర్ఎఫ్‌సీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ కావాల్సి ఉంది. రూ.1400 కోట్లు మేం కట్టాల్సింది కట్టాం" అని వెల్లడించారు. ఇక రుణం విడుదలయ్యేలా చూసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైనే ఉందని కూడా చెప్పారు. కానీ కేంద్రంతో చర్చలు జరిపిన తర్వాత మాత్రం.. ఈ రుణంపై ఎలాంటి ప్రకటనా లేదు. పైగా కొత్తగా రుణం వెతుక్కునేందుకు.. కన్సల్టెన్సీని నియమించారు.

1600 కోట్లు ఖర్చు చేసినా దక్కని రుణం

మెట్రో ఫేజ్ 1 స్వాధీనాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా సరే అందుకు అవసరమైన రుణాన్ని పొందాలని అన్ని మార్గాలను అన్వేషించింది. ఇందుకోసం కొంత భారం అదనమైనా మీదేసుకున్నది. ఇందుకోసమే ఐఆర్ఎఫ్‌సీని ఆశ్రయించింది. చర్చల కోసం లక్షలు వెచ్చించారు. లోన్ కోసం చెల్లించాల్సిన ప్రాసెసింగ్ ఫీజు కోసం కోట్లు ఖర్చు పెట్టారు. రుణాలను రీఫైనాన్స్ చేయడానికి ప్రభుత్వం ఐఆర్ఎఫ్‌సీతో 13,600 కోట్ల రుణ ఒప్పందం కింద ప్రభుత్వం తన సొంత ఈక్విటీ వాటాగా రూ.1,461 కోట్లను ఎస్క్రో ఖాతాలో జమ చేసింది. ఇక, దీనికోసం బ్రోకరేజ్ చేసిన సంస్థకు 4-6 % కమీషన్‌ను ప్రభుత్వం చెల్లించింది. ఇంత చేసినా రుణం రాలేదు. సరికదా... కేంద్రం చర్చల మీద చర్చలు జరిపి ఓ కన్సల్టెన్సీ నియమించి చేతులు దులుపుకున్నది.

రుణాలిచ్చే సంస్థను.. కొత్తగా ఎంపిక చేయాల్సిందే

ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం ఆశలు పెట్టుకున్న ఐఆర్ఎఫ్‌సీ లోన్ ఇక ఆగిపోయినట్లే. మెట్రో ఫేజ్‌-I స్వాధీనం, ఫేజ్‌-II విస్త‌ర‌ణ‌ ప్రక్రియ ఇక కొత్తగా ప్రారంభం కానున్నది. మెట్రో ఫేజ్ 1 ఆస్తుల అంచనా, రుణ ప్రక్రియ, రుణ సంస్థల ఎంపిక, స్వాధీన ప్రక్రియ, మెట్రో 2 విస్తరణ, నిర్మాణ వ్యయం, రుణ సేకరణ అంశాలపై కన్సల్టెన్సీ సంస్థ ఎస్బీఐ క్యాప్స్ అధ్యయ‌నం చేసి నివేదిక అందించనుంది. ఇందుకు కొంత సమయం పట్టనుంది. ఆ నివేదిక వచ్చిన తర్వాతే.. మెట్రో ఫేజ్ 1 స్వాధీనానికి రుణాలిచ్చే సంస్థను నిర్ణయిస్తారు.

కిషన్ రెడ్డే అడ్డమంటూ...

మెట్రో వ్యవహారాన్ని సాఫీగా పరిష్కరించుకోవాల్సిన కేంద్రం, రాష్ట్రం .. సమస్యను సాగదీసి దాగుడుమూతలు ఆడాయని విమర్శలు తలెత్తుతున్నాయి. జూన్ 15న సీఎం రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశం పెట్టి.. ఈ సమస్యకు ప్రధాన అడ్డంకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డేనంటూ నేరుగా ఆరోపించారు. మెట్రో విస్తరణలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు బాధ్యత తీసుకోరు? వరంగల్ ఎయిర్‌పోర్టు స్పీడ్ అయ్యాక వెళ్లి రామ్మోహన్ నాయుడిని కలిశాడు. ఆ పనులు స్లో అయ్యాయి. మెట్రో ఫేజ్ 1 రుణం కోసం జపాన్ సంస్థ ఇప్పటికే నిధులను ఐఆర్ఎఫ్‌సీకి విడుదల చేసింది. కానీ ఐఆర్ఎఫ్‌సీ రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయడం లేదు. ఆ డబ్బులకు వడ్డీ ఎవరు కట్టాలి. కిషన్ రెడ్డి ఇందుకు సమాధానం చెప్పాలి. రిజర్వు బ్యాంకును ఒప్పించిన లెటర్ కూడా తీసుకెళ్లి ఇచ్చాం. అయినా లోన్ ట్రాన్స్‌ఫ‌ర్ కాకుండా అడ్డుకున్నారు. దీనిపై కిషన్ రెడ్డి బాధ్యత తీసుకుంటారా లేదా? లేకపోతే ఎన్‌వోసీ ఇచ్చి మీ భాగస్వామ్యం వదులుకుంటారా? " అని ఘాటుగా విమర్శించారు. ఇందుకు ప్రతిస్పందనగా .. కిషన్ రెడ్డి స్పందిస్తూ.. కేంద్రం పెట్టిన షరతులకు రాష్ట్రం ఒప్పుకోనందునే రుణం ఆగిపోయిందని వివరణ ఇచ్చారు.

అపాయింట్‌మెంట్‌కు లేఖలెందుకు?

కాగా ఈ మొత్తం వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యవహరించిన తీరుపై కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నేరుగా కలవగలిగే సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రులైన అశ్వినీ వైష్ణవ్, ఖట్టర్‌ల అపాయింట్‌మెంట్ దొరకడం పెద్ద కష్టమేం కాదు కదా? అని రాజకీయ విశ్లేషకులు సందేహం లేవనెత్తారు. పైగా వారిద్దరి అపాయింట్‌మెంట్ కోసం అవసరమైన ప్రొటోకాల్‌ను పాటించకుండా .. అందుకోసం మరో కేంద్రమంత్రైన కిషన్ రెడ్డికి రెండు సార్లు లేఖ రాయడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. తనకు సీఎం రెండు సార్లు లేఖ రాశారనే విషయాన్ని కూడా కిషన్ రెడ్డి తన ట్వీట్‌లో ధ్రువపరిచారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా అత్యంత సులువుగా లభించే కేంద్రమంత్రుల‌ అపాయింట్‌మెంట్ల కోసం.. సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అభ్యర్థించడ .. ఇద్దరి మధ్య ఉన్న రాజకీయ అవగాహనేనని విశ్లేషకులు ఓ అంచనాకు వచ్చారు.

Advertisement
Advertisement