త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ఫ్యూచ‌ర్ సిటీని ర‌ద్దు చేస్తామంటే.. ప్ర‌జ‌లు బండ‌కేసి కొడుతారు : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | ఫ్యూచ‌ర్ సిటీ ని ర‌ద్దు చేస్తామంటే వ‌చ్చే సారి ప్ర‌తిప‌క్ష హోదా కూడా రాదు.. ఈ ప్రాంత ప్ర‌జ‌లు బండ‌కేసి కొడ‌తారు అని బీఆర్ఎస్ పార్టీని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చ‌రించారు.

S

Telangana | Published On Jun 10, 2026, 8.22 pm IST

CM Revanth Reddy | ఫ్యూచ‌ర్ సిటీని ర‌ద్దు చేస్తామంటే.. ప్ర‌జ‌లు బండ‌కేసి కొడుతారు : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : ఫ్యూచ‌ర్ సిటీ ని ర‌ద్దు చేస్తామంటే వ‌చ్చే సారి ప్ర‌తిప‌క్ష హోదా కూడా రాదు.. ఈ ప్రాంత ప్ర‌జ‌లు బండ‌కేసి కొడ‌తారు అని బీఆర్ఎస్ పార్టీని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చ‌రించారు. ఫ్యూచ‌ర్ సిటీ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఆఫీసు బిల్డింగ్‌ను ప్రారంభించిన అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం ప్రసంగించారు.

రేప‌టి భ‌విష్య‌త్తుకు ఈనాడే పునాదులు వేసి ప్ర‌పంచానికి అద్భుత‌మైన న‌గ‌రాన్ని అందించ‌బోతున్నాం. హైద‌రాబాద్ న‌గ‌రానికి గొప్ప చ‌రిత్ర ఉంది. 200 యేళ్ల క్రితం హైద‌రాబాద్‌ను విస్తరించ‌డం వ‌ల్ల సికింద్రాబాద్‌తో క‌లిసి జంట న‌గ‌రాలుగా విల‌సిల్లుతున్నాయి. రాష్ట్రానికి 60 శాతం ఆదాయం ఇక్క‌డి నుంచి వ‌స్తోంది. బంగారం కంటే రంగారెడ్డి జిల్లా భూములకు విలువ ఎక్కువ. 1908లో తుఫాన్ వ‌చ్చి వేలాది మంది ప్రాణాలు కోల్పోతే ఆ నాటి నిజాం న‌వాబు మూసీ న‌ది పైన నిర్మాణాలు చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో యుద్ధ సామాగ్రిని ఉంచ‌డం వ‌ల్ల శత్రు దుర్భేద్యంగా మారింది. ఆనాటి పాల‌కులు సైబ‌రాబాద్‌ను నిర్మించి గొప్ప న‌గ‌రాన్ని ప్ర‌పంచానికి అందించారు. హైటెక్ సిటీ, ఔట‌ర్ రింగ్ రోడ్డు, అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం, జీనోమ్ వ్యాలీ లాంటివి వ‌ద్దే వ‌ద్ద‌న్నారు. ఆనాడు కూడా అనేక‌ కుట్ర‌లు, కుతంత్రాలు చేశారు అని రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు.

మూసీలో మురికి కంటే ఎక్కువ విషాన్ని చిమ్మారు

మూసీలో మురికి కంటే ఎక్కువ విషాన్ని చిమ్మారు. ఆనాటి పాల‌కులు హైటెక్ సీటీ, ఔట‌ర్ రింగ్ రోడ్డు, అంత‌ర్జాతీయ‌ ఎయిర్ పోర్టు, జీనోమ్ వ్యాలీ లాంటివి తీసుకురాక‌పోతే ఈనాడు 10 ల‌క్ష‌ల మందికి ఉపాధి ల‌భించేదా..? రావ‌ణాసురుడు, శుక్రాచార్యుడు, మారీచుడు, సుభావుడు ఆనాడు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఇప్పుడు శుక్రాచార్యుడు ఫామ్ హౌస్‌లో ఉండి మారీచుడు, సుభావుడిని పంపించాడు. భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీని ర‌ద్దు చేస్తామ‌ని పెద్ద రాక్ష‌సుడు, చిన్న రాక్ష‌సులు అంటున్నారని సీఎం ధ్వ‌జ‌మెత్తారు.

వాళ్లకు గ‌త‌మే త‌ప్ప‌ భ‌విష్య‌త్తు లేదు

ప్ర‌పంచానికి ఒక దిక్సూచిగా ఫ్యూచ‌ర్ సిటీని గొప్ప న‌గ‌రంగా తీర్చిద్దాల‌న్న సంకల్పంతో ప్ర‌భుత్వం ఉంది. క‌ళ్ల‌లో నిప్పులు పోసుకుని, క‌డుపులో విషం నింపుకొని అమెరికాలో కూడా ఫ్యూచ‌ర్ సిటీని ర‌ద్దు చేస్తామంటున్నారు. వాళ్ల‌ని తెలంగాణ ప్ర‌జ‌లు తిర‌స్క‌రించారు.. వాళ్లకు గ‌త‌మే త‌ప్ప‌ భ‌విష్య‌త్తు లేదు. ఫ్యూచ‌ర్ సిటీ ని ర‌ద్దు చేస్తామంటే వ‌చ్చేసారి ప్ర‌తిప‌క్ష హోదా కూడా రాదు.. ఈ ప్రాంత ప్ర‌జ‌లు బండ‌కేసి కొడ‌తారు అని సీఎం హెచ్చ‌రించారు.

మేం ఎవ‌రైనా ఇంచు భూమైనా తీసుకున్నామా..?

స‌రిగా 150 రోజుల్లో ప్యూచ‌ర్ సిటీ అథారిటీ డెవ‌ల‌ప్మెంట్ కార్యాల‌యాన్ని ప్రారంభించుకున్నాం. 2034 నాటికి వ‌న్ ట్రిలియ‌న్ డాల‌ర్ల ఎకాన‌మీకి భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ కీల‌కం కావాలి. తొల‌క‌రి వ‌ర్షం ప‌డితేనే హైద‌రాబాద్‌లో రోడ్లు ఎక్క‌డిక్క‌డ స్తంభించిపోయాయి. కిలోమీట‌ర్ దూరానికి రెండు నుంచి నాలుగు గంట‌ల స‌మ‌యం ప‌ట్టింది. 100 కోట్లకు ఎక‌రం అమ్మిన‌మ‌ని జ‌బ్బ‌లు చ‌ర‌చుకున్న వాళ్లు నిన్న‌టి వ‌ర‌ద‌ల‌కు స‌మాధానం చెప్పాలి. ప్ర‌భుత్వ భూముల‌ను ఆక్ర‌మించుకుని, కుంట‌ల‌ను చెర‌పట్ట‌డం వ‌ల్ల‌నే చెరువుల్లో ఉండాల్సిన నీళ్లు కాల‌నీలు, బ‌స్తీల‌కు వ‌చ్చాయి. ప్ర‌భుత్వ భూములు, చెరువుల‌ను , కుంటల‌ను ఆక్ర‌మించుకున్న వారి క‌ట్ట‌డాల‌ను నిర్ధాక్ష్య‌ణంగా కూలుస్తున్నాం. మేం ఎవ‌రైనా ఇంచు భూమైనా తీసుకున్నామా..? ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించి చెరువుల‌ను పున‌రుద్ద‌రిస్తున్నాం. లేక్ ఎక‌నామీ ని త‌యారు చేస్తున్నాం.. మ‌హిళా సంఘాలు వ్యాపారం చేసుకునేలా చేస్తున్నాం.. రాజేంద్ర‌న‌గ‌ర్‌లో చెరువు ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించి పునరుద్ద‌రించాం.. కూక‌ట్‌ప‌ల్లి నల్ల చెరువు, అంబ‌ర్‌పేటలో బ‌తుక‌మ్మ కుంటను పున‌రుద్దించాం. బీఆర్ఎస్ నాయ‌కుడు ఎడ్ల సుధాక‌ర్ రెడ్డి బ‌తుక‌మ్మ కుంట‌ను ఆక్ర‌మించి హెలికాఫ్ట‌ర్‌లో పూలు చ‌ల్లాడ‌ని గ‌త ప్ర‌భుత్వం ఆయ‌న‌కు రాసి ఇచ్చింది. బ‌తుక‌మ్మ కుంట‌ను దుర్మార్గులు చెర‌ప‌డితే వాళ్ల ప‌ని ప‌ట్టి పున‌రుద్దించాం. గండిపేట‌, హిమాయ‌త్ సాగ‌ర్‌ను గొప్ప వ్య‌క్తులు ఆక్ర‌మిస్తే వాళ్ల‌ను ఖాళీ చేయించ‌దానికి ప్ర‌య‌త్నం చేస్తున్నాం అని సీఎం తెలిపారు.

500 పెద్ద కంపెనీల‌ను ఫ్యూచ‌ర్ సిటీకి ర‌ప్పించ‌బోతున్నాం..

ముంబ‌యిలో వ‌ర్షం వ‌స్తే జ‌నం బ‌య‌ట‌కు రాని ప‌రిస్థితి ఉంది. చెన్నైలో వ‌ర్షం వ‌స్తే ప‌డ‌వ‌ల్లో తిరుగుతున్నారు.. కోల్‌క‌తాలో శాంతిభ‌ద్ర‌త‌లు లేవు.. బెంగ‌ళూరులో ట్రాఫిక్ జామ్‌లు ఉన్నాయి.. హైద‌రాబాద్‌లో క‌బ్జాకోరుల పని ప‌డుతున్నాం. ప్ర‌పంచం మ‌న వైపు చూస్తుంది. జూన్ 10, 2026న సువ‌ర్ణ అధ్యాయాన్ని సృష్టించాం. గ్రీన్ ఫార్మా, జీసీసీ, ఐటీ కంపెనీల‌తో పాటు ప్ర‌పంచంలోని ప్ర‌సిద్ది గాంచిన‌ 500 పెద్ద కంపెనీల‌ను ఫ్యూచ‌ర్ సిటీకి ర‌ప్పించ‌బోతున్నాం.. మ‌రో గ్లోబ‌ల్ స‌మ్మిట్ పెట్టి ప్ర‌పంచ దేశాల‌ను ఇక్క‌డికి రప్పిస్తామ‌ని సీఎం పేర్కొన్నారు.

ఫ్యూచ‌ర్ సిటీలో కొన్ని గ్రామాల‌ను ఈ రోజు క‌లిపాం..

ఫ్యూచ‌ర్ సిటీలో కొన్ని గ్రామాల‌ను ఈ రోజు క‌లిపాం.. ఫ్యూచ‌ర్ సిటీని ప్ర‌పంచానికి గొప్ప న‌గ‌రంగా రాణిస్తుంద‌న‌డంలో అనుమానం లేదు.. అడ్డుప‌డిన వాళ్లను అడ్డంగా తొక్కుకుంటు ఈ ప్రాంతం వాళ్లే వెళ్తారు.. ఈ న‌గ‌రాన్ని ఇక్క‌డి వాళ్లే కాపాడుకుంటారు.. ప్ర‌పంచానికి దిక్సూచి గా ఈ ప్రాంతం ఉంటుంది.. కాలుష్య ర‌హిత గొప్ప‌న‌గ‌రంగా తీర్చిదిద్ద‌తాం. వీలైన‌ప్పుడ‌ల్లా ఫ్యూచ‌ర్ సిటీ అథారిటీ కార్యాల‌యానికి వ‌స్తాను.. డీప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రి శ్రీధ‌ర్ బాబు వారానికోసారి ఇక్క‌డికి వ‌స్తార‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement