త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | తెలంగాణ‌కు ఇచ్చింది గాడిద గుడ్డే.. బీజేపీపై రేవంత్ ధ్వ‌జం

CM Revanth Reddy | కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి 12 ఏళ్లు అవుతున్నా.. తెలంగాణ‌లోని ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వ‌లేదు.. మెట్రో రైలుకు, మూసీకి నిధులు ఇవ్వ‌లేదు అని సీఎం రేవంత్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. నిన్న బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బీన్ తెలంగాణ‌కు గాడిద గుడ్డును తీసుకొచ్చార‌ని రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు.

S

Telangana | Published On Feb 5, 2026, 6.52 pm IST

CM Revanth Reddy | తెలంగాణ‌కు ఇచ్చింది గాడిద గుడ్డే.. బీజేపీపై రేవంత్ ధ్వ‌జం
Advertisement

12 ఏళ్లు అధికారంలో ఉండి.. ఒక్క పైసా ఇవ్వ‌లేదు..
సాగునీటి ప్రాజెక్టుల‌కు జాతీయ హోదా లేదు..
మెట్రోకు, మూసీకి నిధులు లేవు..
బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్ బంధం..
కాంగ్రెస్‌ను ఓడించేందుకు గూడుపుఠాణీ..
ద‌మ్ముంటే కేసీఆర్, హ‌రీశ్‌రావు, కేటీఆర్‌ను బొక్క‌లో వేయించండి..
బండి సంజ‌య్‌కు రేవంత్ రెడ్డి స‌వాల్

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి 12 ఏళ్లు అవుతున్నా.. తెలంగాణ‌లోని ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వ‌లేదు.. మెట్రో రైలుకు, మూసీకి నిధులు ఇవ్వ‌లేదు అని సీఎం రేవంత్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. నిన్న బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బీన్ తెలంగాణ‌కు గాడిద గుడ్డును తీసుకొచ్చార‌ని రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. ఇక బీజేపీ - బీఆర్ఎస్‌ది ఫెవికాల్ బంధ‌మ‌ని, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు గూడుపుఠాణీ చేస్తున్నార‌ని రేవంత్ ఆరోపించారు. క‌రీంన‌గ‌ర్ జిల్లా చొప్ప‌దండిలో “ప్రజా పాలన- ప్రగతి బాట” కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు.

తెలంగాణ మ‌లిద‌శ ఉద్య‌మం ఈ క‌రీంన‌గ‌ర్ జిల్లా నుంచే ప్రారంభ‌మైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఈ గ‌డ్డ అత్యంత క్రియాశీల‌క పాత్ర పోషించింది. 2004లో శ్రీధ‌ర్ బాబు, పొన్నం ప్ర‌భాక‌ర్‌తో పాటు ఇత‌ర ముఖ్య నేత‌లు క‌లిసి సోనియా గాంధీ స‌మావేశాన్ని క‌రీంన‌గ‌ర్ గ‌డ్డ మీద ఏర్పాటు చేశారు. ప్ర‌జ‌ల భావోద్వేగంతో పాటు తెలంగాణ ఉద్య‌మాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు నాయ‌కులు ప్ర‌ద‌ర్శించ‌డంతో.. సోనియా ఈ క‌రీంన‌గ‌ర్ గ‌డ్డ మీది నుంచి మాట ఇచ్చారు. మీ మ‌న‌సులో ఉన్న కోరిక‌, పోరాటం తెలుసు. తెలంగాణ‌ను త‌ప్ప‌కుండా ఏర్పాటు చేస్తామ‌ని సోనియా ఈ గ‌డ్డ మీద నుంచి మాట ఇచ్చారు. ఏపీలో స‌ర్వం కోల్పోయినా, తెలంగాణ‌లో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా.. కేంద్రంలో అధికారం కోల్పోయినా మాట‌త‌ప్ప‌ని, మ‌డ‌మ‌తిప్ప‌ని నాయ‌కురాలిగా సోనియా గాంధీ 2014లో తెలంగాణ‌ను ఏర్పాటు చేశారు అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

అడ్డంకులు సృష్టించినా అధిగ‌మించి..

ఏపీ పెట్టుబ‌డిదారులు అడ్డంకులు సృష్టించినా వాట‌న్నింటిని అధిగ‌మించి నాలుగున్న‌ర‌ కోట్ల ప్ర‌జల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చారు సోనియా. నాటి ఎంపీలు పొన్నం ప్ర‌భాక‌ర్, వివేక్, గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, అంజ‌న్ కుమార్ యాదవ్, సురేశ్ షెట్కార్, జైపాల్ రెడ్డి పార్ల‌మెంటులో నిటారుగా నిల‌బ‌డి పేప‌ర్ స్ప్రేను అడ్డుకొని తెలంగాణ‌ను సాధించారు. కానీ తెలంగాణ ప్ర‌జ‌లు బీఆర్ఎస్‌కు రెండు సార్లు వ‌రుస‌గా ప‌ట్టం క‌ట్టారు. ప్ర‌జా తీర్పులో భాగంగా ప్ర‌జాస్వామ్యాన్ని గౌర‌వించాల‌ని ప్ర‌తిప‌క్షంగా మేం బీఆర్ఎస్‌కు ప‌దేండ్లు స‌హ‌కారం అందించామ‌ని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఉచిత క‌రెంట్ కాంగ్రెస్ పార్టీ పెటేంట్..

బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని అవ‌కాశంగా మ‌లుచుకుని ఆస్తులు సంపాదించుకున్నారు. కాంట్రాక్టులు పొందారు. టీవీలు, పేప‌ర్లు పెట్టుకున్నారు. ఫామ్ హౌస్‌లు క‌ట్టుకున్నారు. చివ‌ర‌కు పేద‌వాళ్ల‌కు ఇస్తామ‌న్న డ‌బుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వ‌లేదు. ద‌ళితుల‌కు మూడు ఎక‌రాల భూమి, ఇంటికో ఉద్యోగం ఇవ్వ‌లేదు. ప‌దేండ్ల‌లో రూ. 20 ల‌క్ష‌ల కోట్లు ప‌న్నుల రూపంలో ఇస్తే డ‌బుల్ బెడ్రూం ఇండ్లు క‌ట్టించ‌లేని ప‌రిస్థితి. ప‌దేండ్ల త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చి ప్ర‌జాపాల‌న అందిస్తుంటే.. బీఆర్ఎస్ నాయ‌కులు విషం చిమ్ముతున్నారు. కుటుంబమంతా మన మీద దాడి చేస్తున్నారు. వారి ప‌రిపాల‌న‌లో ఏడాదికి 2 ల‌క్ష‌ల ఇండ్లు క‌ట్టించి ఉన్నా ప‌దేండ్ల‌లో 20 ల‌క్ష‌ల ఇండ్లు పేద‌వారికి క‌ట్టించే అవ‌కాశం ఉండే. ప‌దేండ్ల త‌ర్వాత వెన‌క్కి తిరిగి చూస్తే ఏ గ్రామంలోనైనా ఇండ్లు వ‌చ్చాయా..? ఏవైనా ఉన్నాయా అంటే 2004 నుంచి 2014 వ‌ర‌కు వైఎస్సార్, సోనియా నాయ‌క‌త్వంలో క‌ట్టించిన‌ ఇందిర‌మ్మ ఇండ్లు ఉన్నాయి. పేద‌వారి ఆత్మ‌గౌర‌వాన్ని కాంగ్రెస్ పార్టీ నిల‌బెట్టింది. ఆనాడు రైతులు ఎదుర్కొంటున్న క‌ష్టాల‌ను చూసి వైఎస్సార్ ఎల్బీ స్టేడియంలో సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన త‌ర్వాత తొలి సంత‌కం ఉచిత క‌రెంట్ ద‌స్త్రంపై పెట్టారు. రైతుల మీద ఉన్న క్రిమిన‌ల్ కేసులను ఎత్తేశారు. ఇవాళ ఉచిత క‌రెంట్ ఆదేశానికి ఆద‌ర్శ‌మైంది. ఉచిత క‌రెంట్ కాంగ్రెస్ పార్టీ పెటేంట్. ఇది కాంగ్రెస్ ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కమ‌ని రేవంత్ రెడ్డి తెలిపారు.

మా కార్య‌క‌ర్త‌ల స‌త్తా ఏంటో బీజేపీకి చూపిస్తారు..

డ‌బుల్ బెడ్రూం ఇండ్లు, స‌న్న‌బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణ‌మాఫీ, రైతు భ‌రోసా, ఉచిత బ‌స్సు ప్ర‌యాణం కావొచ్చు.. ఇవ‌న్నీ మ‌నం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలే. రెండేండ్లు ప‌రిపాల‌న పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా మున్సిప‌ల్ ఎన్నిక‌లు వ‌చ్చాయి. ఈ మున్సిప‌ల్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా నిన్న ఒకాయ‌న ఢిల్లీ నుంచి వ‌చ్చిండు.. లావు మొన‌గాడు ల‌డాయికి పోతేనంటా.. వెనుకాల ముగ్గురు నూకుడు మొన‌గాళ్లు వ‌చ్చిండ్రంటా.. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బీన్ నిన్న పాల‌మూరుకు వ‌చ్చిండు. ఆయ‌న వెనుకాల బండి సంజ‌య్, కిష‌న్ రెడ్డి, డీకే అరుణ పోయారు. నితిన్ న‌బీన్ ఒక్క‌రే కాదు.. మోదీ, అమిత్ షాతో పాటు దేశ వ్యాప్తంగా బీజేపీ నేత‌ల‌ను రాష్ట్రంలోని మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారానికి తీసుకురండి.. అభ్యంత‌రం లేదు. కానీ ఒక్క మున్సిపాలిటీ అయినా మీరు గెలుస్త‌రేమో మా కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు చూసుకుంటారు. మా కార్య‌క‌ర్త‌ల సత్తా ఏంటో బీజేపీ నేత‌ల‌కు చూపిస్త‌రు అని రేవంత్ రెడ్డి హెచ్చ‌రించారు.

ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్న‌రు..

2014లో న‌రేంద్ర మోదీ మా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌కు వ‌చ్చిన‌ప్పుడు పాల‌మూరు - రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేస్తామ‌ని హామీ ఇచ్చాడు. మూడుసార్లు మోదీ ప్ర‌ధాన‌మంత్రి అయ్యారు. 12 ఏళ్లు బీజేపీ అధికారంలో ఉంది. మీకు పాల‌మూరు - రంగారెడ్డి ఎత్తిపోత‌ల‌కు జాతీయ హోదా ఇవ్వాల‌న్న ఆలోచ‌న‌ను ఆ దేవుడు ఇవ్వ‌లేదా..? అని అడుగుతున్నాను. ఇవాళ కాళేశ్వ‌రానికి జాతీయ హోదా ఇవ్వ‌లేదు. మెట్రో రైలు ఇవ్వ‌లేదు. మూసీకి నిధులు ఇవ్వ‌లేదు. రీజిన‌ల్ రింగ్ రోడ్డు పూర్తి చేస్తామ‌ని చెప్ప‌లేదు. ఏం ఇవ్వ‌డానికి మీ జాతీయ అధ్య‌క్షుడిని తీసుకొచ్చారు. బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చింది తెలంగాణ‌కు. నితిన్ న‌బీన్ గాడిద గుడ్డు తీసుకొచ్చిండు త‌ప్ప ఒక్క రూపాయి తీసుకురాలేదు. సాగునీటి ప్రాజెక్టుల‌కు జాతీయ హోదా ఇవ్వ‌కుండా, మెట్రో రైలు రెండో విడ‌త ఇవ్వ‌కుండా, మూసీకి నిధులు ఇవ్వ‌కుండా ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడ‌గ‌డానికి వ‌చ్చారని రేవంత్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు.

బీజేపీ - బీఆర్ఎస్ బంధం ఫెవికాల్ బంధం కాదా..?

బీజేపీ - బీఆర్ఎస్ బంధం ఫెవికాల్ బంధం కాదా..? వీణ వాణి బంధం కాదా..? మీ శ‌రీరాలు వేరు అయినా మీ త‌లలు ఒక్క‌టి కాదా..? మొన్న జ‌రిగిన ఎంపీ ఎన్నిక‌ల్లో చచ్చి అవ‌య‌వ‌దానం చేసింది బీఆర్ఎస్. కానీ బీఆర్ఎస్ ద‌రిద్య్రం ఏంటో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీజేపీకి దానం చేస్తున్నామ‌ని చెప్పి 8 మందిని గెలిపించారు. ఒక్క సీటు కూడా గెల‌వ‌లేదు. డిపాజిట్లు పోయాయి. డిపాజిట్లు రాని బీఆర్ఎస్ స‌న్నాసులు మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఎట్ల గెలుస్తారు. రాష్ట్రాన్ని దోపిడీ చేశారు. వేల కోట్లు కొల్ల‌గొట్టారు. నితిన్ న‌బీన్, బండి, కిష‌న్ రెడ్డిని సూటిగా అడుగుతున్నాను.. కాళేశ్వ‌రం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చి వేల కోట్లు కొల్ల‌గొట్టార‌ని మోదీ అమిత్ షా అన్న‌మాట వాస్త‌వం కాదా..? అవినీతి లెక్క‌లు తేల్చి వీళ్ల‌ను అరెస్టు చేయండ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం శాస‌న‌స‌భ‌లో చ‌ర్చ చేసి పంపిస్తే ఈ రోజు వ‌ర‌కు సీబీఐ విచార‌ణ ఎందుకు మొద‌లుపెట్ట‌లేదు. దీనికి స‌మాధానం చెప్పాలి. కాళేశ్వ‌రం కూళేశ్వ‌రం అయింది.. శాస‌న‌స‌భ‌ సాక్షిగా నిండు స‌భ‌లో తీర్మానం చేసి.. కేసీఆర్, హ‌రీశ్ రావును బొక్క‌లో తోయండి అని కేంద్రానికి పంపిస్తే.. ఆరు నెల‌ల నుంచి అతిగ‌తి లేదు. విచార‌ణ చేయ‌మ‌ని మీకు అధికారం ఇచ్చాం.. కానీ ఎందుకు కేసు పెట్ట‌లేదు. దీని వెనుకాల ఉన్న మ‌ర్మం ఏంట‌ని బీజేపీ నేత‌ల‌ను అడుగుతున్నాను. ఫార్ములా ఈ రేసు కుంభ‌కోణంలో కేటీఆర్‌ను బీజేపీ కాపాడుతుంది అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

కాంగ్రెస్‌ను దెబ్బ‌తీయాల‌ని గూడుపుఠాణి..

బీజేపీ - బీఆర్ఎస్ బంధం మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఉంట‌ది. ఈ ఎన్నిక‌ల్లో స‌హ‌క‌రించుకుని కాంగ్రెస్‌ను దెబ్బ‌తీయాల‌ని గూడుపుఠాణి చేస్తున్నారు. నిజంగా చిత్త‌శుద్ధి ఉంటే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లోపు కాళేశ్వ‌రం కుంభ‌కోణంలో కేసీఆర్, హ‌రీశ్‌రావు అరెస్టు చేయాలి. ఫార్ములా ఈ రేస్‌లో కేటీఆర్‌ను అరెస్టు చేయాలి. అప్పుడే బీజేపోళ్లు తెలంగాణ‌లో ఓట్లు అడ‌గాలి. మీకు కుమ్మ‌క్కు రాజ‌కీయాలు తెలంగాణ స‌మాజం గ‌మ‌నిస్త‌లేదు అంటే మీ అమాయ‌క‌త్వం అవుతుంది. బీఆర్ఎస్ నేత‌ల‌ను కాపాడుకుంటూ.. వారి నుంచి బీజేపోళ్లు ప్రొటెక్ష‌న్ మ‌నీ తీసుకుంటున్నారు. బీజేపీ ప్ర‌భుత్వం.. బీఆర్ఎస్ నేత‌ల‌ను అరెస్టు చేసే ప‌రిస్థితి లేదు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

మేం లెక్క‌లు చెబితే గుండె ప‌గిలి చ‌స‌ర్తు..

ఇవాళ బీజేపీ - బీఆర్ఎస్ చీక‌టి ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బ‌తీయాల‌ని చూస్తున్నారు. రెండున్న‌రేండ్ల‌లో మీరేం చేశార‌ని అడుగుతున్నారు. ప‌దేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, 12 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ఏం చేసిందో లెక్క చెప్పాల‌ని అడుగుతున్నాం. రెండేండ్ల‌లో మేం ఏం చేశామో శాస‌న‌స‌భ‌లో లెక్క చెబితే గుండె ప‌గిలి చ‌స్త‌రు బీజేపీ బీఆర్ఎస్ వాళ్లు. ఈ రెండేండ్ల కాలంలోనే 70 వేల ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రెటేడ్ స్కూల్‌ను మంజూరు చేసి రూ. 20 వేల కోట్ల‌తో నిర్మాణాలు చేప‌డుతున్నాం. హాస్ట‌ల్ విద్యార్థ‌లకు మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాం. త్వ‌ర‌లోనే విద్యార్థుల‌కు బ్రేక్ ఫాస్ట్ ప‌థ‌కం అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించాం. ఇక చొప్ప‌దండిలో డిగ్రీ కాలేజీ ఇచ్చాం. శాత‌వాహ‌న యూనివ‌ర్సిటీకి లా కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీ ఇచ్చాం. ఆదిలాబాద్ జిల్లాకు యూనివ‌ర్సిటీ, ఖ‌మ్మం జిల్లాకు ఎర్త్ యూనివ‌ర్సిటీ ఇచ్చాం. విద్యార్థుల క‌ష్టాలు తీర్చ‌డానికి శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement