త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Srinivas Goud | సీఎం రేవంత్ ఎండిపోయిన‌ ప్రాజెక్టులు చూడ్డానికి వ‌స్తున్న‌డు: శ్రీ‌నివాస్ గౌడ్ ఎద్దేవా

Srinivas Goud | జూరాల ప్రాజెక్టులో నీళ్లు లేవని.. ఎండిపోయిన ప్రాజెక్ట్ లు చూసేందుకు పాలమూరుకు ముఖ్యమంత్రి వస్తున్నాడని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎద్దేవా చేశారు. శ్రీశైలం దగ్గర ఈరోజుకు నీళ్లు ఎత్తిపోసుకునే అవకాశం ఉందని, నీళ్లు లేని జూరాల దగ్గర లిఫ్ట్ పెడితే బురద తప్ప ఏం రాద‌ని విమ‌ర్శించారు.

S

Telangana | Published On Jun 4, 2026, 2.32 pm IST

Srinivas Goud | సీఎం రేవంత్ ఎండిపోయిన‌ ప్రాజెక్టులు చూడ్డానికి వ‌స్తున్న‌డు: శ్రీ‌నివాస్ గౌడ్ ఎద్దేవా
Advertisement
  • శ్రీ‌శైలం నుంచి నీళ్లు ఎత్తిపోసుకునే వీలుంది
  • నీళ్లు లేని జూరాల దగ్గ‌ర లిఫ్ట్ పెడితే బుర‌ద త‌ప్ప ఏం రాదు
  • మంత్రిగా లేని బోసు రాజు వ‌చ్చి ఏం చేస్త‌రు?
  • ఆర్టికల్చర్, పాలిటెక్నిక్ కాలేజీల‌ నిర్లక్ష్యంపై రేవంత్‌ సమాధానం చెప్పాలి
  • మాజీ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ డిమాండ్‌

Srinivas Goud | త్రినేత్ర‌.న్యూస్‌: జూరాల ప్రాజెక్టులో నీళ్లు లేవని.. ఎండిపోయిన ప్రాజెక్ట్ లు చూసేందుకు పాలమూరుకు ముఖ్యమంత్రి వస్తున్నాడని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎద్దేవా చేశారు. ఈ పర్యటనలో కర్ణాటక మంత్రి బోసు రాజు వస్తున్నారని అంటున్నార‌ని.. ఇప్పుడు మంత్రిగా లేని ఆయ‌న వ‌చ్చి ఏం చేస్తార‌ని ప్ర‌శ్నించారు. తెలంగాణ ప్ర‌జ‌ల చెవుల్లో పూలు పెడుతున్నారా? అని నిల‌దీశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ సీఎం ప‌ర్య‌ట‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

శ్రీశైలం దగ్గర ఈరోజుకు నీళ్లు ఎత్తిపోసుకునే అవకాశం ఉంది. నీళ్లు లేని జూరాల దగ్గర లిఫ్ట్ పెడితే బురద తప్ప ఏం ఉండదు. ముఖ్యమంత్రి పాలమూరు పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. అక్రమ అరెస్ట్ లతో భ‌యపెట్టిస్తే భయపడే వాళ్లం కాదు. అక్రమ అరెస్ట్ లు వెంటనే ఆపేసి, రైతులు పండించిన ధ్యానం వెంటనే కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాం. తడిచిన ధ్యానంకు నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి. కోటి మెట్రిక్ టన్నుల‌ ధాన్యం ఉత్ప‌త్తి జ‌రిగితే రాష్ట్ర ప్రభుత్వం ఎంతమేర కొనుగోలు చేసిందో స్పష్టత లేదు. ధాన్యం కొనుగోలు చేయ‌డంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది అని మాజీ మంత్రి వివ‌మ‌ర్శించారు.

పాద‌యాత్ర చేస్తామంటేనే క‌దిలిండ్రు..

పాలమూరు రంగారెడ్డి పై ముఖ్యమంత్రి రివ్యూపై క్లారిటీ వచ్చిన తరువాత బీఆర్ఎస్ స్పందిస్తుంది. మేం పాదయాత్ర చేస్తామంటేనే ప్రభుత్వంలో చలనం వచ్చింది. పాలమూరులో ప్రాజెక్ట్ లు కట్టింది కేసీఆర్. కట్టిన ప్రాజక్ట్ ల పనులు 80 నుంచి 90 శాతం పూర్త‌య్యాయి. మిగిలిన పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం అని శ్రీ‌నివాస్‌గౌడ్ అన్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న ప్రాజెక్ట్ ల సందర్శన పేరుతో ముఖ్యమంత్రి హెలికాప్టర్ తో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈ పర్యటనలో కర్ణాటక మంత్రి బోసు రాజు వస్తున్నారుని అధికారిక షెడ్యూల్ లో పొందుపరిచారు. బోసురాజు ఇప్పుడు మంత్రిగా లేనేలేరు, మంత్రిగా లేని వ్యక్తి వచ్చి ఏం చేస్తాడు? పాలమూరుపై బీఆర్ఎస్ ఉద్యమబాట పట్టగానే ప్రభుత్వంలో చలనం వచ్చింది.

మామిడి రైతుల‌ను ప‌ట్టించ‌కోలేదు..

కొల్లాపూర్ ప్రజల తరుఫున ముఖ్యమంత్రికి ఒక్కటే డిమాండ్ చేస్తున్నం. ఆర్టికల్చర్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్ నిర్లక్ష్యం పై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. కొల్లాపూర్ లో మామిడి ప్రసిద్ధి. అటువంటిది మామిడి రైతులకు మేలు చేయ‌లేక పోతున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో లష్కర్ ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రి మాట తప్పాడు. శ్రీధర్ రెడ్డి హత్య జరిగి రెండు యేండ్లు అవుతుంది. ఇంతవరకు నిందితులను పట్టుకోలేక పోతున్నారు అని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు.

విహార‌యాత్ర‌లా కాకుండా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి..

పాలమూరు రైతుల గోసను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా స్థానిక బీఆర్ఎస్ నేతలను అక్రమ అరెస్ట్ లు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. విహార యాత్రలా మిగిలిపోకుండా పాలమూరు సమస్యలను ముఖ్యమంత్రి పరిష్కరించాలి. రామన్నగట్టు రిజర్వాయర్ పై రివ్యూ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అని శ్రీ‌నివాస్‌గౌడ్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement