త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Instagram | మీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అవొద్దు అంటే.. ఈ సింపుల్ సెట్టింగ్ ను వెంటనే ఆన్ చేయండి..

Instagram | చాలా మంది తమ సోషల్ మీడియా అకౌంట్ల‌కు బలమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్ పెట్టుకుంటే చాలు, హ్యాకర్ల నుంచి రక్షణ పొందవచ్చని భావిస్తారు. అయితే సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కూడా కొత్త కొత్త మార్గాల్లో అకౌంట్లను హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

S

Technology | Published On Jun 4, 2026, 3.18 pm IST

Instagram | మీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అవొద్దు అంటే.. ఈ సింపుల్ సెట్టింగ్ ను వెంటనే ఆన్ చేయండి..
Advertisement

Instagram | చాలా మంది తమ సోషల్ మీడియా అకౌంట్ల‌కు బలమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్ పెట్టుకుంటే చాలు, హ్యాకర్ల నుంచి రక్షణ పొందవచ్చని భావిస్తారు. అయితే సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కూడా కొత్త కొత్త మార్గాల్లో అకౌంట్లను హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే అనేక మంది సెల‌బ్రిటీల సోష‌ల్ మీడియా ఖాతాలు హ్యాక‌య్యాయి. అందువ‌ల్ల ఆ ఖాతాల‌ను సుర‌క్షితంగా ఉంచుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింది.అయితే ఇందుకు గాను అనేక ప్లాట్‌ఫామ్‌లు ఇప్పటికే ప‌లు ప్ర‌త్యేక‌మైన ఫీచర్ల‌ను అందిస్తున్నాయి. వాటిల్లో టు-ఫ్యాక్ట‌ర్ అథెంటికేష‌న్ ఒక‌టి. అంటే ఖాతాలోకి ప్ర‌వేశించేందుకు సాధార‌ణంగా ఎంట‌ర్ చేసే పాస్‌వ‌ర్డ్‌తోపాటు ఫోన్ నంబ‌ర్ లేదా ఆథెంటికేట‌ర్ యాప్‌కు వ‌చ్చే 6 అంకెట ఓటీపీ లేదా టీవోటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంద‌న్న‌మాట‌. దీంతో రెండవ అంచె భ‌ద్ర‌త ల‌భిస్తుంది. ఇది ఖాతాను సుర‌క్షితంగా ఉంచుతుంది. దీన్ని చాలా కంపెనీలు ప్ర‌స్తుతం అందిస్తున్నాయి. ఇక ఫోటో, వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ కూడా తన వినియోగదారులకు టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (2FA) సదుపాయాన్ని అందిస్తోంది. ఇది అకౌంట్ భద్రతను మ‌రింత క‌ట్టుదిట్టం చేస్తుంది. దీన్ని ఆన్ లో ఉంచ‌డం వ‌ల్ల హ్యాకింగ్ నుంచి రిస్క్ చాలా వ‌ర‌కు త‌గ్గుతుంది.

కొత్త డివైస్‌లో లాగిన్ అయిన ప్ర‌తిసారీ..

టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్‌ను ఆన్ చేసిన తర్వాత, కొత్త డివైస్‌లో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో లాగిన్ అయ్యే ప్రతిసారి అదనపు ధ్రువీకరణ అవసరం అవుతుంది. దీంతో యూజర్‌నేమ్, ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ వంటి వివరాలు ఎవరి చేతికైనా వెళ్లినా, ఆథెంటికేషన్ కోడ్ లేకుండా అకౌంట్‌లోకి ప్రవేశించడం సాధ్యం కాదు. టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ సోషల్ మీడియా అకౌంట్‌కు అదనపు భద్రతా పొరగా పనిచేస్తుంది. సాధారణంగా ఈ ఫీచర్ లేకపోతే యూజర్‌నేమ్ లేదా ఈమెయిల్ ఐడీతోపాటు పాస్‌వర్డ్ నమోదు చేస్తే సరిపోతుంది. కానీ 2FA యాక్టివ్‌లో ఉన్నప్పుడు ప్రతి లాగిన్ సమయంలో ప్రత్యేకమైన ఆథెంటికేషన్ కోడ్‌ను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో పాస్‌వర్డ్ లీక్ అయినా లేదా ఎవరికైనా తెలిసినా, ఆ కోడ్ లేకుండా అకౌంట్‌ను యాక్సెస్ చేయలేరు. ఇన్‌స్టాగ్రామ్ ఈ కోడ్‌ను థర్డ్-పార్టీ ఆథెంటికేషన్ యాప్ ద్వారా లేదా ఎస్‌ఎంఎస్, వాట్సాప్ ద్వారా అందుకునే అవకాశం కల్పిస్తోంది.

టైమ్ లిమిట్ వ‌ల్ల చాలా సేఫ్టీ..

గూగుల్ ఆథెంటికేటర్, డుయో మొబైల్ వంటి థర్డ్-పార్టీ ఆథెంటికేషన్ యాప్‌లను ఉపయోగించడం మరింత సురక్షితం. ఎందుకంటే వీటిలో కోడ్‌లు ప్రతి కొన్ని సెకన్ల‌కు ఒక‌సారి ఆటోమేటిక్‌గా మారుతూ ఉంటాయి. అయితే ఎవరైనా ఫోన్‌కు రిమోట్ యాక్సెస్ పొందితే, ఎస్‌ఎంఎస్ లేదా వాట్సాప్ ద్వారా వచ్చిన కోడ్‌లను ఉపయోగించే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఇన్‌స్టాగ్రామ్ ప్రతి కొత్త లాగిన్ ప్రయత్నానికి కొత్త కోడ్‌ను పంపుతుంది. కాబట్టి పాత కోడ్ తెలిసినా అకౌంట్‌లోకి ప్రవేశించడం సాధ్యం కాదు. ఆథెంటికేష‌న్ కోడ్‌ల‌కు ఎలాగూ టైమ్ లిమిట్ ఉంటుంది. క‌నుక ఆ టైమ్‌లోగా కోడ్‌ను హ్యాక్ చేసి దాన్ని పొంద‌డం ఎవ‌రికీ సాధ్యం కాదు. అందువ‌ల్ల ఇది సుర‌క్షితంగా మార్గంగా ప‌నిచేస్తుంది.

ఆథెంటికేట‌ర్ యాప్ అయితే..

ముందుగా మీ ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసి, టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఆన్ చేయాలనుకుంటున్న అకౌంట్‌లో లాగిన్ అవ్వాలి. తర్వాత స్క్రీన్ కుడి దిగువ భాగంలో కనిపించే ప్రొఫైల్ ఫోటోపై ట్యాప్ చేసి ప్రొఫైల్ పేజీకి వెళ్లాలి. అనంతరం కుడి పైభాగంలో ఉన్న మూడు గీతల (హాంబర్గర్ మెనూ) ఐకాన్‌పై ట్యాప్ చేసి సెట్టింగ్స్ అండ్ యాక్టివిటీ మెనూను తెరవాలి. ఇక్కడ యువర్ అకౌంట్ కింద కనిపించే అకౌంట్స్ సెంటర్ పై ట్యాప్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ అన్ని మెటా అకౌంట్లను మేనేజ్ చేయ‌వ‌చ్చు. ఇప్పుడు పాస్‌వర్డ్ అండ్ సెక్యూరిటీ ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి. తర్వాత పై నుంచి రెండో స్థానంలో కనిపించే టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఏ అకౌంట్‌కు 2FA ఆన్ చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్‌ను ఎంపిక చేయాలి. ఆ అకౌంట్ యూజర్‌నేమ్‌పై ట్యాప్ చేయాలి. అక్కడ ఆథెంటికేషన్ యాప్ లేదా ఎస్‌ఎంఎస్/వాట్సాప్ ల‌లో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది.

ఆథెంటికేషన్ యాప్ ఎంపిక చేసి నెక్స్ట్ బటన్‌పై ట్యాప్ చేయాలి. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ థర్డ్-పార్టీ ఆథెంటికేషన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిస్తూ ఆథెంటికేషన్ కీని చూపిస్తుంది. మీ ఫోన్‌లో ఇప్పటికే ఆథెంటికేషన్ యాప్ ఉంటే, ఇన్‌స్టాగ్రామ్ చూపించిన కీని కాపీ చేసి ఆ యాప్‌లో పేస్ట్ చేయాలి. లేదా వ్యూ బార్‌కోడ్/క్యూఆర్ కోడ్ ఆప్షన్‌ను ఎంచుకుని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయవచ్చు. తర్వాత ఆథెంటికేషన్ యాప్ ఒక ఆరు అంకెల కోడ్‌ను రూపొందిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో లాగిన్ అయ్యేటప్పుడు ఆ కోడ్‌ను నమోదు చేయాలి. ఇలా చేస్తే మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ విజయవంతంగా యాక్టివేట్‌ అవుతుంది.

ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ అయితే..

పైన చెప్పిన దశలను అనుసరించి టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ పేజీకి వెళ్లాలి. అక్కడ ఎస్‌ఎంఎస్ లేదా వాట్సాప్ ఆప్షన్‌ను ఎంచుకుని నెక్స్ట్ బటన్‌పై ట్యాప్ చేయాలి. ఇన్‌స్టాగ్రామ్ ఆథెంటికేషన్ కోడ్ రావాల్సిన మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. తర్వాత నెక్స్ట్ బటన్‌ను ట్యాప్ చేయాలి. ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు మీ మొబైల్ నంబర్‌కు వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్‌ ద్వారా ఆరు అంకెల కోడ్‌ను పంపిస్తుంది. మీరు ఎస్‌ఎంఎస్ ద్వారా కోడ్ ను పొందాలనుకుంటే, స్క్రీన్ దిగువన కనిపించే గెట్ కోడ్ వయా ఎస్‌ఎంఎస్ ఇన్‌స్టెడ్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. వచ్చిన ఆరు అంకెల కోడ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో నమోదు చేసి నెక్స్ట్ బటన్‌పై ట్యాప్ చేయాలి. అంతే, మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ యాక్టివ్ అవుతుంది. ఇకపై ప్రతిసారి లాగిన్ సమయంలో వాట్సాప్ లేదా ఎస్‌ఎంఎస్ ద్వారా ప్రత్యేక కోడ్ అందుతుంది.

గూగుల్ ఆథెంటికేట‌ర్ యాప్ మేలు..

అయితే గూగుల్ ఆథెంటికేట‌ర్ యాప్ ను అన్నింటిక‌న్నా సుర‌క్షిత‌మైన‌దిగా చెప్ప‌వ‌చ్చు. ఇందులో కేవ‌లం కొన్ని సెక‌న్ల పాటు మాత్ర‌మే కోడ్‌ను చూపిస్తుంది. త‌రువాత అది మాయం అవుతుంది. ఆ కోడ్‌ను ఆ టైమ్ లిమిట్ లోగా అకౌంట్‌లో ఎంట‌ర్ చేయాలి. లేదంటే ప‌నిచేయ‌దు. అంత త‌క్కువ టైమ్‌లో హ్యాక‌ర్లు కోడ్‌ను తెలుసుకుని ఖాతాలో ఎంట‌ర్ చేయ‌లేరు. అది అసాధ్యం. క‌నుక గూగుల్ ఆథెంటికేట‌ర్ యాప్ అన్నింటిక‌న్నా మెరుగైన టూ-ఫ్యాక్ట‌ర్ ఆథెంటికేష‌న్ ఎక్స్‌పీరియెన్స్ ను ఇస్తుంది. ఈవిధంగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అవ‌కుండా ప‌క‌డ్బందీగా సెక్యూరిటీని అమ‌లు చేయ‌వ‌చ్చు.

Advertisement
Advertisement