త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Prajavani | సీఎం ప్ర‌జావాణికి రెండేళ్లు.. 47 వేల ద‌ర‌ఖాస్తులు ప‌రిష్కారం

CM Prajavani | ముఖ్యమంత్రి ప్రజావాణి ప్రజల సమస్యల పరిష్కార వేదికగా నిలుస్తోంది. సమస్యలు వేగవంతంగా పరిష్కారం అవుతుండడంతో రాష్ట్రం నలువైపుల నుంచి ప్రజలు భారీ ఎత్తున రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో నిర్వహిస్తున్న సీఎం ప్రజావాణికి తరలివస్తున్నారు.

S

Telangana | Published On Mar 1, 2026, 6.18 pm IST

CM Prajavani | సీఎం ప్ర‌జావాణికి రెండేళ్లు.. 47 వేల ద‌ర‌ఖాస్తులు ప‌రిష్కారం
Advertisement

ప్రతి శాఖ నుంచి అధికారులతో ప్రత్యేక డెస్కులు
ప‌రిష్కారం కాని ద‌ర‌ఖాస్తులు 47,687
అక్క‌డికక్క‌డే స‌మ‌స్య‌ల ప‌రిష్కారం
సీఎం ప్ర‌జావాణిపై ప్ర‌జ‌ల్లో భ‌రోసా
చిన్నారెడ్డి, దివ్యదేవరాజన్ ప్రత్యేక శ్రద్ధ

CM Prajavani | త్రినేత్ర‌.న్యూస్ : ముఖ్యమంత్రి ప్రజావాణి ప్రజల సమస్యల పరిష్కార వేదికగా నిలుస్తోంది. సమస్యలు వేగవంతంగా పరిష్కారం అవుతుండడంతో రాష్ట్రం నలువైపుల నుంచి ప్రజలు భారీ ఎత్తున రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో నిర్వహిస్తున్న సీఎం ప్రజావాణికి తరలివస్తున్నారు. రెండేళ్ల క్రితంప్రారంభమైన సీఎం ప్రజావాణి ప్రతి వారంలో మంగళ, శుక్రవారాలలో జరిగే ఈ కార్యక్రమం ఇప్పటివరకు 24 సెషన్స్ పూర్తి చేసుకుంది.

రెండేళ్ల కాలంలో సీఎం ప్రజావాణిలో మొత్తం ఒక లక్షా 12 వేల 245 దరఖాస్తులు నమోదు కాగా అందులో 64,558 దరఖాస్తులు పరిగణలోకి తీసుకొని 47,935 దరఖాస్తులు పరిష్కరించారు. మిగతా 47,687 దరఖాస్తులు ప్రభుత్వ పథకాలు, విధానపరమైన ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవాల్సినవి కావడం, ఉద్యోగాల కోసం సంబంధించినవి ఉన్నాయి. వీటిని పరిష్కరించాలని కోరుతూ సంబంధిత శాఖలకు సిఫార్సు చేశారు. సీఎం ప్రజావాణికి వచ్చే దరఖాస్తుల పరిష్కారం 74 శాతం మేరకు ఉండడంతో ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. సీఎం ప్రజావాణి పై ప్రజల్లో భరోసా పెరిగింది. దీంతో వారంలో రెండు రోజులు మంగళ, శుక్రవారాలలో సుమారు వేయి దరఖాస్తులు నమోదు అవుతున్నాయి.

చిన్నారెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టి రెండేళ్లు..

రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి సీఎం ప్రజావాణి ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టి సరిగ్గా ఆదివారానికి రెండేళ్లు పూర్తి అవుతోంది. సీఎం ప్రజావాణికి వచ్చే ప్రజల నుంచి దరఖాస్తులు స్వయంగా స్వీకరించి ఓపికతో సమస్యలు విని వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి దరఖాస్తుపై ఎండార్స్‌మెంట్ చేసి చిన్నారెడ్డి స్వయంగా స్టాంప్ వేస్తుండడం విశేషం. ఈ ప్రక్రియ ప్రజల్లో విశ్వాసాన్ని నింపుతోంది. నిరంతరం వారంలో రెండు రోజులు ఇదే తరహా ప్రక్రియతో పాటు ప్రతి దరఖాస్తు ఆన్‌లైన్ ద్వారా సంబంధిత శాఖకు సిఫార్సు చేస్తుండడం వల్ల సమస్యలు సత్వరంగా పరిష్కారం అవుతున్నాయి.

ప్రతి శాఖ నుంచి అధికారులతో ప్రత్యేక డెస్కులు

గల్ఫ్‌లోని ఏడు దేశాలు సహా ఇతర దేశాలలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం సీఎం ప్రవాసి ప్రజావాణి కేంద్రాన్ని కూడా ఈ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సీఎం ప్రజావాణిలో దరఖాస్తులు రాసి ఇచ్చేందుకు హెల్ప్ డెస్క్, ప్రతి శాఖ నుంచి అధికారులతో ప్రత్యేక డెస్కులు, వైద్య సహాయం కోసం మెడికల్ క్యాంపు, వృద్ధులు దివ్యాంగుల రవాణా కోసం బ్యాటరీ బగ్గి, వీల్ చైర్స్, అత్యవసర వైద్య సేవల కోసం అంబులెన్స్, ప్రజలకు మంచినీటి సౌకర్యం, జీహెచ్ఎంసీ ఆర్థిక సహకారంతో హరే కృష్ణ ఫౌండేషన్ ద్వారా ఐదు రూపాయల భోజనం వంటివి సీఎం ప్రజావాణిలో కల్పించారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో కీలకపాత్ర

సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ కూడా ఎంతో ఓపికతో ప్రజా సమస్యల పరిష్కారంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాల సమస్యలు పరిష్కరించడం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ గ్రూపుల పరీక్షలు, వైద్య ఆరోగ్యశాఖ, పోలీస్ రిక్రూట్‌మెంట్‌ల‌లో జాప్యం, ఫలితాల విడుదల వంటి అంశాలు, రైతుల వ్యవసాయ సంబంధిత సమస్యలు, విద్యుత్ సమస్యలు, ప్రజల ఆరోగ్య సమస్యలు, రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ళు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సమస్యలు, ఆర్టీసీ కార్మికులు, గల్ఫ్ కార్మికుల సమస్యలు వంటి అనేక అంశాలు సీఎం ప్రజావాణి, ప్రవాసి ప్రజావాణి ద్వారా పరిష్కారమవుతున్నాయి. సీఎం ప్రజావాణి సక్సెస్ కార్యమాన్ని వివిధ రాష్ట్రాలకు చెందిన ట్రైనీ ఐఏఎస్‌లు, గ్రూప్ -1 అధికారులు పరిశీలించారు.

సీఎం ప్రజావాణి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో డాక్టర్ చిన్నారెడ్డి, దివ్యదేవరాజన్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నందు వల్ల పరిష్కారం 74 శాతంగా ఉంది. రానున్న రోజుల్లో పరిష్కార శాతాన్ని మరింత మెరుగు పర్చేందుకు అన్ని చర్యలు తీసుకోనున్నట్లు చిన్నారెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement