త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | సింగ‌రేణి టెండ‌ర్ల కుంభ‌కోణంపై సీబీఐ విచార‌ణ జ‌రిపించాలి: హ‌రీశ్‌రావు

Harish Rao | సింగ‌రేణి (Singareni) టెండ‌ర్ల కుంభ‌కోణంపై సీబీఐ విచార‌ణ‌ (CBI Enquiry)కు ఆదేశించాల‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) శాస‌న‌స‌భాప‌క్ష ఉప‌నేత హ‌రీశ్‌రావు (Harish Rao) డిమాండ్ చేశారు. చీటికి మాటికి సిట్ (CIT) అంటున్నార‌ని, ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy)కి నిజాయితీ, దమ్ముంటే సీబీఐ విచారణకు అనుమతించాల‌ని సూచించారు. అన్ని వివరాలు అందించేందుకు తాను సిద్దంగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు.

A

Telangana | Published On Jan 19, 2026, 2.48 pm IST

Harish Rao | సింగ‌రేణి టెండ‌ర్ల కుంభ‌కోణంపై సీబీఐ విచార‌ణ జ‌రిపించాలి: హ‌రీశ్‌రావు
Advertisement

దేశంలో ఎక్క‌డా లేని సైట్ విజిట్ విధానాన్ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోంది
ఈ విధానంలో మొద‌టి ల‌బ్దిదారు రేవంత్ బామ్మ‌ర్దే
ప్ర‌భుత్వ విధానంతో సింగ‌రేణికి న‌ష్టం
మంత్రివ‌ర్గంలో వాటాల వివాదం న‌డుస్తోంది
బీఆర్ఎస్ జెండా గ‌ద్దెల జోలికి వ‌స్తే రేవంత్ గ‌ద్దె కూలుతుంది
విలేక‌రుల స‌మావేశంలో మాజీ మంత్రి ఫైర్‌

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌ : సింగ‌రేణి (Singareni) టెండ‌ర్ల కుంభ‌కోణంపై సీబీఐ విచార‌ణ‌ (CBI Enquiry)కు ఆదేశించాల‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) శాస‌న‌స‌భాప‌క్ష ఉప‌నేత హ‌రీశ్‌రావు (Harish Rao) డిమాండ్ చేశారు. చీటికి మాటికి సిట్ (CIT) అంటున్నార‌ని, ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy)కి నిజాయితీ, దమ్ముంటే సీబీఐ విచారణకు అనుమతించాల‌ని సూచించారు. అన్ని వివరాలు అందించేందుకు తాను సిద్దంగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు. రేవంత్ రెడ్డి, బీజేపీ అక్రమ సంబంధం, చీకటి ఒప్పందం లేకుంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని కేంద్ర‌మంత్రి కిషన్ రెడ్డిని డిమాండ్ చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో హ‌రీశ్‌రావు మాట్లాడుతూ సింగరేణి టెండర్ల కుంభకోణం, సీఎం, మంత్రుల వాటాల పంచాయతీలు చూస్తున్నామ‌ని, కానీ మరికొన్ని దిమ్మతిరిగే విషయాలు బయట పెడుతున్నాన‌ని చెప్పారు. నైనీ బ్లాక్‌లో కాంట్రాక్ట్ సైట్ విజిట్ ప‌ద్ద‌తిని పెట్టార‌ని, అందువ‌ల్ల ఆ టెండ‌ర్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌క‌టించార‌ని గుర్తు చేశారు. కానీ కాంట్రాక్టు సైట్ విజిట్ పద్దతి మన రాష్ట్రంలో లేదని, దేశంలో కూడా లేద‌ని అన్నారు. వెస్టన్ కోల్ ఫీల్డ్, కోల్ ఇండియాలో కూడా ఈ విధానం లేద‌ని చెప్పారు. కాంగ్రెస్ బొగ్గు కుంభ‌కోణంపై న్యాయస్థానంలో పోరాడుతామ‌ని ప్ర‌క‌టించారు.

కాంట్రాక్టుల కోస‌మే నూత‌న విధానం

కాంట్రాక్టుల‌ను త‌న‌కు న‌చ్చిన వారికి క‌ట్ట‌బెట్టేందుకే సైట్ విజిట్ విధానాన్ని తీసుకువ‌చ్చార‌ని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత‌ 2024లో సైట్ విజిట్ విధానం తెచ్చారని, దాంతో మొద‌టి ల‌బ్ధిదారు రేవంత్ బామ్మర్ది సుజన్ రెడ్డి అని సంచ‌ల‌న విష‌యం బ‌య‌ట‌పెట్టారు. ఆయన కంపెనీ శోదా క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌కే ఈ సర్టిఫికేట్ వచ్చాక మొదటి టెండర్ దక్కిందని తెలిపారు. ఈ విధానం అమ‌లులోకి వ‌చ్చిన త‌రువాత సింగరేణిలో ఆరు టెండర్లు కూడా ప్లస్ 7 పర్సంటేజ్ కు వారి అనుయాయులకు కట్టబెట్టార‌ని ఆరోపించారు. సాధార‌ణంగా మ‌న దేశంలో ఓబీ కోల్ బ్లాక్ టెండ‌ర్ ఎక్క‌డ జ‌రిగినా మైనస్ 10 నుంచి మైనస్ 22 శాతానికి సొంతం చేసుకుంటార‌ని వివ‌రించారు. గతంలో సింగరేణి మైనస్ 7, మైనస్ 8, మైనస్ 10, మైనస్ 20 శాతాల‌కు టెండ‌ర్లు ద‌క్కించుకునేవార‌ని, మైనస్ 10 నుంచి మైనస్ 20 ఎక్కడైనా ఉంటుందని అన్నారు. రేవంత్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అన్ని టెండర్లు ప్లస్ 7 నుంచి ప్లస్ 10 శాతానికి పోతున్నాయని చెప్పారు. నైనీ టెండ‌ర్ల‌ను ర‌ద్దు చేస్తామ‌ని ఉప‌ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించార‌ని, కానీ మిగిలిన వాటి సంగ‌తి ఏంట‌ని ప్ర‌శ్నించారు.
ఆన్ లైన్ ద్వారా దేశంలో ఎవరైనా టెండ‌ర్లు వేయొచ్చని, కానీ సైట్ విజిట్ విధానంలో ముందే వెళ్లి సైట్ విజిట్ చేసి సింగరేణి నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాలని పేర్కొన్నారు. ఈ విధానంలో ఎవరు ముందుగానే టెండర్ వేస్తున్నారో తెలుసుకొని, బెదిరించి, బయపెట్టి వారికి టెండర్ దక్కకుండా చేసి తమ అనుయాయకులకు ప్లస్ 7 నుంచి ప్లస్ 20 శాతానికి కట్టబెట్టి, కమీషన్లు తీసుకుంటున్నార‌ని ఆరోపించారు. నైనీ బ్లాక్ లో ఇదే జరిగిందని, వాటాల పంచాయతీ వచ్చి కొట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. గతంలో ఇదే సింగరేణిలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న‌ప్పుడు ఉన్న టెండర్లు రద్దు చేసి, వాటినే తమ అనుయాయులకు కట్టబెట్టారని ధ్వ‌జ‌మెత్తారు. అప్పుడు కాంపిటీటివ్ విధానంలో ఇచ్చిన టెండర్లు రద్దు చేసి ఇప్పుడు ప్లస్ 7 మీద టెండర్లు కట్టబెట్టారని దుయ్య‌బ‌ట్టారు. గతంలో వెంకటేషన్ కని అనే టెండర్ బీఆర్ఎస్ హయాంలో మైనస్ 7 ఉంటే, ఇప్పుడు ప్లస్ 7తో రీటెండ‌ర్ చేసి క‌ట్టబెట్టార‌ని విమ‌ర్శించారు. ఎస్ఆర్‌పీఓసీ టూ శ్రీరాంపూర్ అనే మైనస్ 7 టెండర్ రద్దు చేసి, ప్లస్ 7తో తిరిగి అప్ప‌గించార‌ని చెప్పారు. ఎస్ఆర్‌పీఓసీ టూ విస్త‌ర‌ణ 2025 టెండ‌ర్ డీల్ సెట్ కాక‌పోవ‌డంతో మూడు సార్లు వాయిదా పడింద‌ని, దానిని వారి అనుయాయుల‌కు ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్నారు.

డీజిల్‌లోనూ క‌మీష‌న్లు...

సింగరేణికి డీజిల్‌ను గతంలో బల్క్‌లో ఐఓసీఎల్ నుంచి సరఫరా చేసేవారని, కానీ పర్సెంటేజీల కోసం దీనిని కూడా కాంట్రాక్ట‌ర్ల‌కు అప్ప‌గించార‌ని హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు. సింగ‌రేణికి దీనివ‌ల‌న ఎక్కువ న‌ష్టం క‌లుగుతుంద‌ని చెప్పారు. చేసిన పని మీదనే కాకుండా, డీజీల్ కలుపుకొని జీఎస్టీ కట్టాల్సి ఉంటుందని, దాంతో సంస్థ‌పై అద‌న‌పు భారం ప‌డుతుంద‌ని వివ‌రించారు. ఇదంతా ముఖ్య‌మంత్రి, ఆయ‌న స‌న్నిహితులు, స‌మీప బంధువు క‌నుస‌న్న‌ల్లో జ‌రుగుతుంద‌ని ఆరోపించారు. ఎవరికి సర్టిఫికేట్ రావాలన్నా, టెండర్ రావాలన్నా వారి ఆదేశం లేనిదే జ‌ర‌గ‌డం లేద‌ని చెప్పారు. రెండేళ్ల నుంచి సింగరేణికి రెగ్యులర్ సీఎండీ లేకుండా, ఇంచార్జీని పెట్టి ఇలాంటి అడ్డగోలు వ్యవహారాలు చేస్తున్నారని మండిప‌డ్డారు. సైట్ విజిట్ స‌ర్టిఫికెట్ లేద‌ని నైనీ టెండ‌ర్ ర‌ద్దు చేసిన భ‌ట్టి మిగిలిన టెండ‌ర్లు కూడా ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. సైట్ విజిట్ విధానం శాశ్వతంగా రద్దు చేయాలని, డీజిల్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సింగిరేణికి అర్హత కలిగిన సీనియ‌ర్‌ను సీఎండీగా నియ‌మించాల‌ని సూచించారు.

బ‌లిప‌శువులుగా ఐఏఎస్ అధికారులు, జ‌ర్న‌లిస్టులు..

క్యాబినెట్‌ను దండుపాళెం ముఠా అంటే త‌న‌ను ల‌క్ష్యంగా చేసుకున్నార‌ని, సింగరేణి టెండర్ల విషయంలో సీఎం, భట్టి, కోమటి రెడ్డి మధ్య వాటాల పంచాయతీ అవ‌డంలేదా హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. తన్నుకు చచ్చింది నిజం, వాటాల కోసం కొట్టుకున్నది నిజం ఇందులో జర్నలిస్టులు, ఐఏఎస్ లో ఏం పాపం చేశార‌ని అన్నారు. మొత్తం ఉదంతంలో ఐఏఎస్ అధికారులు, జ‌ర్న‌లిస్టులు బ‌లిప‌శువులుగా మారార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. హోలోగ్రామ్ టెండ‌ర్ల విష‌యంలో ముఖ్య‌మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి మ‌ధ్య కూడా ఐఏఎస్ అధికారి బ‌ల‌య్యార‌ని వాపోయారు.

మంత్రుల మ‌ధ్య వాటాల పంచాయితీ..

గతంలో దక్కన్ సిమెంట్స్ యజమానిని సీఎం ఇంటికి ఎదురుగా గెస్ట్ హౌజ్‌లో తుపాకీ ఎక్కుపెట్టి పైసలు వసూలు చేసారని మంత్రి కుమార్తె చెప్పిందని, అది కూడా రేవంత్‌కు అత్యంత సన్నిహితుడు రోహిన్ రెడ్డి అని కూడా చెప్పారని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు. వ్యాపారవేత్తల వద్ద బెదిరించి సంపాదించుకున్న డబ్బును పంచుకోవడంలో వాటాల పంచాయతీ వ‌స్తోంద‌ని ఎద్దేవా చేశారు. సమ్మక్క సారక్క టెండర్లు దక్కలేదని పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి టెండర్లను దేవాదాయ శాఖ నుంచి ఆర్అండ్‌బీకి మార్చి టెండర్లు దక్కించుకున్నార‌ని ఆరోపించారు. తాను సంత‌కం పెట్ట‌కుండానే టికెట్ రేట్ల జీవోలు వ‌స్తున్నాయ‌ని సంబంధిత మంత్రి కోమటి రెడ్డి వెంక‌ట్‌రెడ్డి అన‌డం చూశామ‌ని, ఈ విష‌యంలో ముఖ్య‌మంత్రి వ‌ర్సెస్ కోమ‌టిరెడ్డిగా మారింద‌ని చెప్పారు. ఆరు గ్యారెంటీలు అటకెక్కినయని, వాటాలా పంచాయతీలు ముందుకు వచ్చినయని ఎద్దేవా చేశారు.

రేవంత్‌కు తెలియ‌కుండా సిట్ వ‌స్తే సీఎంగా ఫెయిల్‌..

కాంగ్రెస్ నాయకుడు సంపత్ కుమార్ రూ.ఎనిమిది కోట్లు డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట‌ర్‌నే బెదిరించాడ‌ని, దీనిపై స‌ద‌రు కాంట్రాక్ట‌రే స్వ‌యంగా పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదు చేశార‌ని హ‌రీశ్‌రావు చెప్పారు. బీఆర్ఎస్ నాయ‌కులు, జ‌ర్న‌లిస్టులను వేధించేందుకే సిట్‌లు ఏర్పాటు చేస్తున్నార‌ని మండిపడ్డారు. ఖాకీ బుక్కు అంద‌రికీ స‌మానం అనే డీజీపీ శివ‌ధ‌ర్‌రెడ్డి ఖాకీ బుక్కు కాకి ఎత్తుకుపోయిందా అని ప్ర‌శ్నించారు. సజ్జనార్‌ జర్నలిస్టులను బెదిరించారు క‌దా, ఇప్పుడు ఏమైంది హూంక‌రింపు, ఇవ‌న్నీ క‌నిపించ‌డం లేదా అని దుయ్య‌బ‌ట్టారు.
ఇదొక దండుపాళ్యం ముఠా లెక్క అయ్యిందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రేవంత్ రెడ్డికి తెల్వకుండా సిట్ ఎలా వస్తుందని, ఒక వేళ అలా జ‌రిగితే ముఖ్య‌మంత్రిగా ఫెయిల్ అయిన‌ట్లేన‌ని అన్నారు. అస‌లు స‌ర్కార్ న‌డుపుతున్నారా.. స‌ర్క‌స్ కంపెనీ న‌డుపుతున్నారా అని విమ‌ర్శించారు. పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణను కేసీఆర్ తయారు చేస్తే, కాంగ్రెస్ రాగానే బెదిరింపులు, భూ కబ్జాలు ప్రారంభ‌మ‌య్యాయ‌ని ఆరోపించారు.

బీఆర్ఎస్ పార్టీ జెండా ప్ర‌జ‌ల గుండెల్లో ఉంది..

బీఆర్ఎస్ జెండా గ‌ద్దెల‌ను కూల్చాల‌న్న రేవంత్ వ్యాఖ్య‌ల‌పై హ‌రీశ్‌రావు ఫైరయ్యారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ జెండా గద్దె జోలికి వ‌స్తే రేవంత్ గ‌ద్దె కూలుతుంద‌ని హెచ్చ‌రించారు. రేవంత్ కూలిస్తే కూలిపోవ‌డానికి బీఆర్ఎస్ పార్టీ జెండా గ‌ద్దెల్లో లేద‌ని, ప్ర‌జ‌ల గుండెల్లో ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. ముఖ్య‌మంత్రి హౌలా మాట‌లు బంద్ చేసి, ఆరు గ్యారెంటీల‌పై దృష్టి పెట్టాల‌ని హిత‌వు ల‌పికారు. మంత్రివ‌ర్గ స‌మావేశం నిర్వ‌హించి, రైతుబంధు, ఎరువుల కొర‌త‌, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బ‌కాయిల‌పై ఎందుకు చ‌ర్చించ‌లేద‌ని ప్ర‌శ్నించారు.

టీడీపీ పుట్టుకే కాంగ్రెస్‌కు వ్య‌తిరేకం..

ఖ‌మ్మంలో స‌భ‌లో రేవంత్ మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి మాట్లాడిన అంశాన్ని ప్ర‌స్తావిస్తూ టీడీపీ పుట్టుకే కాంగ్రెస్‌కు వ్య‌తిరేక‌మ‌ని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ అప్పటి ముఖ్యమంత్రి అంజయ్యను అవమానిస్తే తెలుగు దేశం పార్టీ పుట్టిందని చెప్పారు. కాంగ్రెస్ వ్య‌తిరేకంగా జాతీయ స్థాయిలో నేష‌న‌ల్ ఫ్రంట్ పెట్టార‌ని అన్నారు. కాంగ్రెస్ భూస్థాపిత‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని ఎన్టీఆర్ ప్ర‌తిన‌బూనార‌ని వివ‌రించారు. అంత ప్రేముంటే తెలుగుదేశంలోనే ఉండాల్సిందని అన్నారు. టీడీపీ నుంచి బయటకు వచ్చి రేవంత్ ద్రోహం చేశాడ‌ని మండిప‌డ్డారు. కాంగ్రెస్ భూస్థాపితం అయితేనే ఎన్టీఆర్ ఆత్మ‌కు శాంతి క‌లుగుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. నాలుగు ఓట్ల కోసం టీడీపీ కోసం మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు. కాంగ్రెస్ పార్టీ దేశ‌వ్యాప్తంగా బీజేపీకి వ్య‌తిరేకంగా పోరాడితే, రేవంత్ మాత్రం బీజేపీ, చంద్ర‌బాబుల‌తో క‌లిసి ఉంటున్నార‌ని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఔట్‌సోర్సింగ్ సీఎం, అస‌లైన కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య ప‌చ్చ గడ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి ఉంద‌న్నారు. వైఎస్ఆర్‌కు వీర విధేయుడిన‌ని చెప్పుకునే భ‌ట్టి విక్ర‌మార్క‌, తెలుగుదేశం మీద ప్రేమ చూపే రేవంత్ ఇద్ద‌రూ తెలంగాణకు వ్య‌తిరేకంగా ప‌నిచేసిన వారేన‌ని మండిప‌డ్డారు. అన్ని విష‌యాలు బ‌య‌ట‌పెడుతా అన్న మాట‌కు భ‌ట్టి విక్ర‌మార్క క‌ట్టుబ‌డి అన్ని వివ‌రాలు వెల్ల‌డించాల‌ని కోరారు.

Advertisement

తాజావార్తలు

Advertisement