KTR | నేతన్నల కడుపు కొడుతున్న కాంగ్రెస్ సర్కార్ : కేటీఆర్
KTR | కాంగ్రెస్ సర్కార్ నేతన్న కడుపు కొడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో అమలైన చేనేత సంక్షేమ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
నేతన్నలకు ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ అమలు కాలేదు
చేనేత విషయంలో బీజేపీ-కాంగ్రెస్ వైఖరి ఒక్కటేనని విమర్శ
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా
నేతన్నలకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి
ప్రభుత్వ ఆర్డర్లు అన్ని కమీషన్ల కోసం
ప్రైవేట్ సంస్థలకు వ్యక్తులకు అప్పజెప్తున్నారు
బీజేపీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతోనూ నేతన్నలకు తీవ్ర నష్టం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా
చేనేత రంగానికి తీవ్ర అన్యాయం చేసింది
బహిరంగ లేఖలో పేర్కొన్న కేటీఆర్
KTR | త్రినేత్ర.న్యూస్ : కాంగ్రెస్ సర్కార్ నేతన్న కడుపు కొడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో అమలైన చేనేత సంక్షేమ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని నేతన్నల తరఫున ముఖ్యమంత్రి రేవంత్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.
తెలంగాణ సంస్కృతి, అస్తిత్వానికి వెన్నెముకగా నిలిచిన చేనేత కార్మికుల పరిస్థితి కాంగ్రెస్ పాలనలో తీవ్రంగా దిగజారిందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో అమలైన 'నేతన్న బీమా', 'నేతన్నకు చేయూత' వంటి నేతన్నల కోసం ప్రత్యేకంగా అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను నిలిపివేసి నేతన్నలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టారని విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ చేనేత కార్మికులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు కాలేదని ఆరోపించిన కేటీఆర్, వెంటనే అన్ని పథకాలను పునరుద్ధరించి నేతన్నలకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. జాతీయ చేనేత దినోత్సవం కేవలం ఉత్సవాలు నిర్వహించుకునే రోజు కాదని, చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే విధానాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ కలిసి చేనేత రంగాన్ని సంక్షోభం వైపు నెడుతున్నాయని విమర్శించారు.
వేలాది కుటుంబాలకు నిరంతర ఉపాధి కల్పించాం
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా చేనేత రంగానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని కేటీఆర్ గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 55,072 మంది చేనేత కార్మికులకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పిస్తూ 'నేతన్న బీమా' అమలు చేశామని తెలిపారు. ఒక్కో కార్మికుడికి ప్రీమియం ప్రభుత్వమే భరించిందని వివరించారు. 'నేతన్నకు చేయూత' పథకం ద్వారా కార్మికుల పొదుపును ప్రోత్సహిస్తూ, కార్మికుడు ప్రతి నెలా రూ.1,200, అనుబంధ కార్మికుడు రూ.800 చెల్లిస్తే ప్రభుత్వం రూ.4,000 వరకు వాటా జమ చేసే వినూత్న విధానాన్ని అమలు చేశామని తెలిపారు. అదేవిధంగా చేనేత సహకార సంఘాలకు పావలా వడ్డీ రుణాలు, 20 శాతం మార్కెటింగ్ రిబేట్ అందించడంతో పాటు బతుకమ్మ చీరలు, ప్రభుత్వ పాఠశాల యూనిఫారాల తయారీ వంటి భారీ ప్రభుత్వ ఆర్డర్లను చేనేత రంగానికే అప్పగించి వేలాది కుటుంబాలకు నిరంతర ఉపాధి కల్పించామని పేర్కొన్నారు.
చేనేత సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా నిలిపివేసింది
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేనేత సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా నిలిపివేసిందని కేటీఆర్ ఆరోపించారు. ప్రస్తుతం 'నేతన్న బీమా' అమలు కావడం లేదని, 'నేతన్నకు చేయూత' పథకం చెల్లింపులు పూర్తిగా ఆగిపోయాయని పేర్కొన్నారు. చేనేత సహకార సంఘాలకు ఇవ్వాల్సిన పావలా వడ్డీ రుణాలు, మార్కెటింగ్ రిబేట్లు నిలిచిపోయాయని, బతుకమ్మ చీరలు, ప్రభుత్వ యూనిఫారాల వంటి ప్రభుత్వ ఆర్డర్లలో నేతన్నలకు గతంలో ఇచ్చిన ప్రాధాన్యతను తగ్గించారని విమర్శించారు. ప్రభుత్వ ఆర్డర్లు అన్ని కమీషన్ల కోసం ప్రైవేట్ సంస్థలకు వ్యక్తులకు అప్పజెప్తున్నారని విమర్శించారు.
నేతన్నలకు ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితం
నేతన్నల కోసం గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు. అడ్డగోలుగా హామీలు ఇచ్చి అందరిని మోసం చేసినట్లుగానే నేతన్నలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నది అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కేటీఆర్ అన్నారు. చేనేత భరోసా కింద ప్రతి ఏడాది రూ.18 వేల ఆర్థిక సాయం, అనుబంధ కార్మికులకు రూ.6 వేల సహాయం, లక్ష రూపాయల వరకు వ్యక్తిగత రుణమాఫీ, చేనేత సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ రుణాల మాఫీ, కేంద్రం విధిస్తున్న 5 శాతం జీఎస్టీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్న హామీల్లో ఒక్కటీ అమలు కాలేదని విమర్శించారు. రెండున్నరేళ్లు గడిచినా నేతన్నలకు ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని మండిపడ్డారు.
బీజేపీ ప్రభుత్వం కూడా చేనేత రంగానికి తీవ్ర అన్యాయం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా చేనేత రంగానికి తీవ్ర అన్యాయం చేసిందని కేటీఆర్ విమర్శించారు. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు, హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డు, పవర్‌లూమ్ బోర్డులను రద్దు చేయడం, హౌస్ కమ్ వర్క్‌షెడ్ వంటి పథకాలను ఎత్తివేయడం, చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ విధించడం వంటి నిర్ణయాలు చేనేత రంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని పేర్కొన్నారు. పార్టీలు వేరైనా చేనేత విషయంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల వైఖరిలో ఎలాంటి తేడా లేదని ఆరోపించారు.
నేతన్నల కుటుంబాలకు అండగా నిలవాలి
రాష్ట్రంలోని నేతన్నల తరఫున ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. చేనేత కళాకారుల కోసం ప్రత్యేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన అమలు చేయాలని, గతంలో రద్దు చేసిన అన్ని పథకాలను పునరుద్ధరించాలని కోరారు. ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'నేతన్న బీమా', 'నేతన్నకు చేయూత' పథకాలను వెంటనే తిరిగి ప్రారంభించి బకాయిలు విడుదల చేయాలని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన చేనేత భరోసా, రుణమాఫీ, జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ హామీలను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. "మన చేనేత... మన గౌరవం. నేతన్న బతికితేనే చేనేత బతుకుతుంది. చేనేత బతికితేనే మన సంస్కృతి, మన స్వాభిమానం సజీవంగా ఉంటాయి. ఇప్పటికైనా మోసపూరిత వైఖరిని వీడి నేతన్నల కుటుంబాలకు అండగా నిలవాలి" అని కేటీఆర్ తన లేఖలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
సంబంధిత వార్తలు

Harish Rao | తెలంగాణ నీటి హక్కులను రక్షించండి.. కేంద్ర జలశక్తి మంత్రికి హరీశ్‌రావు లేఖ
ఆగస్టు 7, 2026

Komatireddy | కాంట్రాక్టర్లను వేధించొద్దు.. గనులశాఖ అధికారులకు కోమటిరెడ్డి ఆదేశాలు
ఆగస్టు 7, 2026

Harish Rao | ‘మిషన్ భగీరథ’ అనేది పథకం కాదు.. ప్రజల జీవితాలను మార్చిన మహత్తర ప్రణాళిక
ఆగస్టు 7, 2026
తాజావార్తలు
- ●రీచార్జ్ నుంచి ATM ఛార్జీల దాకా.. మధ్యతరగతి జేబుకు చిల్లులు పెడుతున్న ‘డిజిటల్ దోపిడీ’!
- ●Harish Rao | తెలంగాణ నీటి హక్కులను రక్షించండి.. కేంద్ర జలశక్తి మంత్రికి హరీశ్‌రావు లేఖ
- ●Vijay-Sangeeta | సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక ట్విస్ట్.. పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత
- ●EV Charging Station | ఈవీ చార్జింగ్ స్టేషన్లకు భారీగా డిమాండ్.. స్వయం ఉపాధితో చక్కని ఆదాయం..
- ●Komatireddy | కాంట్రాక్టర్లను వేధించొద్దు.. గనులశాఖ అధికారులకు కోమటిరెడ్డి ఆదేశాలు
- ●Harish Rao | ‘మిషన్ భగీరథ’ అనేది పథకం కాదు.. ప్రజల జీవితాలను మార్చిన మహత్తర ప్రణాళిక

రీచార్జ్ నుంచి ATM ఛార్జీల దాకా.. మధ్యతరగతి జేబుకు చిల్లులు పెడుతున్న ‘డిజిటల్ దోపిడీ’!

Harish Rao | తెలంగాణ నీటి హక్కులను రక్షించండి.. కేంద్ర జలశక్తి మంత్రికి హరీశ్‌రావు లేఖ

Vijay-Sangeeta | సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక ట్విస్ట్.. పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత

EV Charging Station | ఈవీ చార్జింగ్ స్టేషన్లకు భారీగా డిమాండ్.. స్వయం ఉపాధితో చక్కని ఆదాయం..



