త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vakiti Srihari | ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాం

Vakiti Srihari | తెలంగాణ ఆతిథ్యానికి, క్రీడా రంగంలో రాష్ట్ర ప్రతిష్ఠకు తగిన స్థాయిలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించేందుకు అధికారులు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు.

S

Telangana | Published On Sep 21, 2026, 7.16 pm IST

Vakiti Srihari | ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాం
Advertisement
  • రాష్ట్రానికి పేరు తెచ్చేలా ఏర్పాట్లు చేయాలి
  • క్రీడా వేదికలు, వసతి, రవాణా, భద్రతపై స‌మీక్ష‌లో మంత్రి వాకిటి శ్రీహరి

Vakiti Srihari | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ ఆతిథ్యానికి, క్రీడా రంగంలో రాష్ట్ర ప్రతిష్ఠకు తగిన స్థాయిలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించేందుకు అధికారులు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. రాష్ట్రంలో ఈ ఏడాది డిసెంబర్ 11 నుంచి 23 వరకు నిర్వహించనున్న ఈ పోటీలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోందన్నారు. పోటీల ఏర్పాట్లపై సచివాలయంలో సోమ‌వారం ఆయ‌న‌ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. క్రీడా వేదికల సిద్ధత, మౌలిక సదుపాయాల కల్పన, క్రీడాకారుల వసతి, రవాణా, భద్రత, వైద్య సదుపాయాలు, ఆహారం, పరిశుభ్రత, స్వాగత ఏర్పాట్లు, ప్రచార కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు.

అనంత‌రం వాకిటి మాట్లాడారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే యువ క్రీడాకారులకు తెలంగాణలో అత్యుత్తమ వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రతి క్రీడా వేదికలో అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టాలని, పోటీల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వంటి జాతీయ స్థాయి పోటీలు తెలంగాణలోని యువ క్రీడాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు మరిన్ని అవకాశాలను కల్పిస్తాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేయడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

ఈ సమీక్ష సమావేశంలో మంత్రి తో పాటు రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎండీ సోని బాలదేవి, క్రీడా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement