త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | రూ. 200 కోట్ల ప్ర‌భుత్వ భూమి.. రూ. 7 కోట్లకే రేవంత్ రాసిచ్చాడు : కేటీఆర్

KTR | చదువూ సంధ్యా లేని అనుముల అన్నదమ్ములు.. కోట్లు, సూట్లు వేసుకుని కొత్త దందాలకు తెరలేపారని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. అనుముల కొండల్ రెడ్డి చైర్మన్‌గా ఉన్న 'టెసారాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్' అనే దొంగ కంపెనీకి, రూ. 200 కోట్ల విలువైన భూమిని రూ. 7 కోట్ల‌కే రేవంత్ రెడ్డి రాసిచ్చాడు అని కేటీఆర్ తెలిపారు.

S

Telangana | Published On Aug 11, 2026, 3.29 pm IST

KTR | రూ. 200 కోట్ల ప్ర‌భుత్వ భూమి.. రూ. 7 కోట్లకే రేవంత్ రాసిచ్చాడు : కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : చదువూ సంధ్యా లేని అనుముల అన్నదమ్ములు.. కోట్లు, సూట్లు వేసుకుని కొత్త దందాలకు తెరలేపారని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. అనుముల కొండల్ రెడ్డి చైర్మన్‌గా ఉన్న 'టెసారాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్' అనే దొంగ కంపెనీకి, రూ. 200 కోట్ల విలువైన భూమిని రూ. 7 కోట్ల‌కే రేవంత్ రెడ్డి రాసిచ్చాడు అని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ నేత‌ మన్నె క్రిశాంక్ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల కొండల్ రెడ్డికి చెందిన టెస్సెరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బండారం బయటపెట్టిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగ‌ళ‌వారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

ఎనుముల కొండల్ రెడ్డి రేవంత్‌ రెడ్డికి తమ్ముడు. ఆయన లింక్డ్‌ ఇన్‌ ప్రొఫైల్‌లో నేను టెసరాక్ట్‌ అనే కంపెనీకి చైర్మన్‌గా ఉన్నానని కొండల్‌ రెడ్డి స్పష్టంగా రాశారు. టెసరాక్ట్‌ అడ్వాన్స్‌ సిస్టమ్స్‌కు భూపాల్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్స్‌కు నేను బాధ్యుడిని అని కొండల్ రెడ్డి చెప్పారు. టెసరాక్ట్‌ సంస్థ ఏర్పాటు చేసిన ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ కంపెనీ, నేను చెప్పుకొని ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి అమెరికన్‌ కాన్సుల్ జనరల్ కూడా హాజరయ్యారని కేటీఆర్ ఆధారాల‌తో స‌హా చూపించారు.

కొండల్‌ రెడ్డి ఏం చదువుకున్నాడో.. ఏమో నాకు తెలియదు కానీ సడెన్‌గా యూఎస్‌ ఇండియా స్ట్రాటజిక్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఫోరమ్‌లో ఎగ్జిక్యూటివ్‌ బోర్డులో టెసరాక్ట్ చైర్మన్‌గా ఆయన జాయిన్ అయ్యారని వారు స్వయంగా లింక్డ్‌ ఇన్‌లో పెట్టుకున్నారు. యూఎస్‌ ఇండియా స్ట్రాటజిక్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఫోరమ్‌ కూడా టెసరాక్ట్‌ అడ్వాన్స్‌ సిస్టమ్స్‌ చైర్మన్ అనుముల కొండల్‌ రెడ్డిని ఆహ్వానించడానికి సంతోషిస్తున్నామని వారు కూడా స్టేట్‌మెంట్‌ ఇచ్చార‌ని కేటీఆర్ తెలిపారు.

ఇది అతిపెద్ద కుంభ‌కోణం..

చదువూ సంధ్యా లేని అనుముల అన్నదమ్ములు.. కోట్లు బూట్లు వేసుకుని ఇంత పెద్ద కంపెనీలకు చైర్మన్లు ఎట్లా అయిపోతున్నారు. ఎవరి కంపెనీ, ఏంటిదీ కంపెనీ అని ఆరా తీస్తే.. టెసరాక్ట్‌ అడ్వాన్స్‌ సిస్టమ్స్‌ కంపెనీ వెబ్‌సైట్‌ చూశాం. కంపెనీ ఫోన్ నంబర్ చూసినం. ఆ కంపెనీ ఫోన్ నంబర్ 12345678 అని ఉంది.. ఇలాంటి నంబర్లు ఉండొచ్చని మాకు తెలీదు, రేవంత్ రెడ్డి కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఏమైనా కనుగొన్నాడో అది కూడా తెలియదని కేటీఆర్ అన్నారు. ఈ కంపెనీకి ఒక్క ఉద్యోగి లేడు. ఇది వాళ్లే చెప్పారు. 2025, మార్చి 31 నాడు ఎంతమంది ఉద్యోగులున్నారంటే.. ఒక్కరు కూడా లేడు. ఎక్కడుంది కంపెనీ అంటే.. ఎక్కడో పటాన్‌ చెరులో ఒక చిన్న ఇల్లు అడ్రస్ పెట్టుకున్నరు. కంపెనీ పెట్టినప్పుడు మూలధనం రూ. లక్ష. కంపెనీ పెయిడ్‌ ఆఫ్ క్యాపిటల్‌ లక్ష రూపాయలు.. ఎంప్లాయ్ ఒక్కడూ లేడు. చైర్మన్ ఎవరంటే అనుముల కొండల్ రెడ్డి. దీనికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం కేటాయించిందో తెలుసా..? రేవంత్‌ సర్కార్ రూ. 200 కోట్ల విలువైన 5 ఎకరాల భూమిని ఈ లక్ష రూపాయల మూలధనం ఉన్న కంపెనీకి కేటాయించి అతిపెద్ద కుంభకోణానికి పాల్పడింద‌ని కేటీఆర్ తెలిపారు.

ఆ సీఎం రాజీనామా చేసే ప‌రిస్థితి వ‌చ్చింది..

ఇది మొద‌టిది కాదు.. ఇది కొండ‌ల్ రెడ్డి వ్య‌వ‌హారం. అనుముల జ‌గ‌దీశ్ రెడ్డి అని రేవంత్ రెడ్డికి ఇంకో బ్ర‌ద‌ర్ ఉన్నాడు. ఆయ‌న అమెరికాలో ఉంటారు. సీఎం అమెరికా ప‌ర్య‌ట‌న‌కు పోతే.. రేవంత్, జ‌గ‌దీశ్ క‌లిసి వెయ్యి కోట్ల‌కు ఎంవోయూ చేసుకుని స్వ‌చ్ఛ బ‌యోతో ఫొటో దిగారు. వాళ్ల‌కు ఎక్క‌డ భూమి ఇచ్చారో త‌వ్వి తీయాలి. మోడీ ప్రభుత్వంతో కలిసి రేవంత్ రెడ్డి తన బావమరిది సృజన్ రెడ్డికి రూ. 1137 కోట్ల అమృత్ కాంట్రాక్ట్ ఇచ్చాడు. సింగరేణిలో వేల కోట్ల కుంభకోణాలు సృజన్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. అనుముల కొండల్ రెడ్డికి చెందిన టెసెరాక్ట్ కంపెనీలో ఒక్క ఉద్యోగి లేడు, ఆఫీస్ అడ్రస్ లేదు కానీ సుమారు రూ. 200 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కేవలం రూ. 7 కోట్లకు రేవంత్ రెడ్డి రాసిచ్చాడు. ఇది స్కామా..? కాదా..? తేలాలి. క‌ర్ణాట‌క‌లో సీఎం స‌తీమ‌ణికి ఆనాడు మూడు ఎక‌రాల స్థ‌ల‌మిస్తే ఆ సీఎం రాజీనామా చేసే ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ అంశాన్ని వ‌దిలిపెట్టే ప్ర‌స‌క్తే లేద‌ని కేటీఆర్ హెచ్చ‌రించారు.

నీ శాఖ‌లో ఏం జ‌రుగుతుందో తెలుసా శ్రీధ‌ర్ బాబు..?

అసలు నీ శాఖలో ఏం జరుగుతుందో నీకు తెలుసా శ్రీధర్ బాబు..? అని కేటీఆర్ ప్రశ్నించారు. బహిరంగంగా టెసరాక్ట్ కంపెనీ చైర్మన్ నేనే అని కొండల్ రెడ్డి ప్రచారం చేసుకుంటుంటే, రేవంత్ రెడ్డి సోదరుడికి దీనికి సంబంధం లేదని శ్రీధర్ బాబు సిగ్గులేకుండా బుకాయిస్తున్నాడని కేటీఆర్ ఫైర్ అయ్యారు. అసలు నీ శాఖలో ఏం జరుగుతుందో నీకు తెలుసా..? లేక రేవంత్ రెడ్డి నుండి స్క్రిప్ట్ రాగానే బల‌వంతంగా అదే మాట్లాడుతున్నావా శ్రీధర్ బాబు..? అని అడిగారు.

Advertisement
Advertisement