త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLC Deshapathi Srinivas | లండన్ “టాక్ చేనేత బతుకమ్మ” పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్

MLC Deshapathi Srinivas | తెలంగాణ రాష్ట్ర పండుగ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను, చేనేత కార్మికులను ఆదుకోవాలనే సామాజిక బాధ్యత జోడించి లండన్‌లో తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) నిర్వహించబోతున్న "టాక్ చేనేత బతుకమ్మ - దసరా 2026 " సంబురాలా పోస్టర్‌ను ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆవిష్కరించారు.

S

Telangana | Published On Sep 19, 2026, 11.49 am IST

MLC Deshapathi Srinivas | లండన్ “టాక్ చేనేత బతుకమ్మ” పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
Advertisement

పాల్గొన్న స్థానిక బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, లండన్ ఎన్నారైలు
అనిల్ కూర్మాచలం, ఎఫ్దీసి మాజీ చైర్మన్ & టాక్ వ్యవస్థాపకుడు

MLC Deshapathi Srinivas | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ రాష్ట్ర పండుగ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను, చేనేత కార్మికులను ఆదుకోవాలనే సామాజిక బాధ్యత జోడించి లండన్‌లో తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) నిర్వహించబోతున్న "టాక్ చేనేత బతుకమ్మ - దసరా 2026 " సంబురాలా పోస్టర్‌ను ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, జ‌డ్పీ మాజీ చైర్మన్ తుల ఉమా, ఇతర బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ మహిళా నాయకులు, లండన్ ఎన్నారైలు, స్థానిక నాయకులు ఆవిష్కరించారు.

ప్రవాస తెలంగాణ ప్రజలు చేస్తున్న కృషి అభినంద‌నీయం

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ఇది ఒక విశిష్టమైన ప్రతిరూపమని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ సంస్కృతి, పండుగలు, కళలు, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడంలో ప్రవాస తెలంగాణ ప్రజలు చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యంగా టాక్ సంస్థ చేనేత కార్మికులకు అండగా నిలుస్తూ, సామాజిక బాధ్యతతో బతుకమ్మ పండుగను “టాక్ – చేనేత బతుకమ్మ”గా నిర్వహించడం ఎంతో స్ఫూర్తిదాయకమని దేశపతి శ్రీనివాస్ అన్నారు. చేనేత అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, తెలంగాణ కళాకారుల తరతరాల నైపుణ్యానికి, శ్రమకు, మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. బతుకమ్మ పండుగను చేనేతతో అనుసంధానం చేస్తూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా చేనేత కళాకారులకు ప్రోత్సాహం లభించడంతో పాటు, తెలంగాణ చేనేత ప్రత్యేకతను, మన సంస్కృతి గొప్పతనాన్ని అంతర్జాతీయ వేదికపై మరింత విస్తృతంగా చాటిచెప్పే అవకాశం ఏర్పడుతుందని అన్నారు.

ప్రవాస తెలంగాణ సమాజం ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా తెలంగాణ సంస్కృతి, భాష, కళలు, సంప్రదాయాలను భావితరాలకు చేరవేస్తూ వాటి పరిరక్షణకు చేస్తున్న కృషి ప్రశంసనీయమని దేశపతి శ్రీనివాస్ తెలిపారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ తెలంగాణతో ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తూ, మన సంస్కృతి పట్ల గర్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పడం అభినందించదగ్గ విషయమన్నారు.

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పండుగలకు ప్రత్యేక గౌరవం లభించిందని వారు గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం బతుకమ్మ, బోనాలు వంటి తెలంగాణ పండుగలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపునిస్తూ, వాటి వైభవాన్ని మరింతగా చాటిచెప్పేలా చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. బతుకమ్మ పండుగకు అధికారిక రాష్ట్ర పండుగ హోదా కల్పించడంతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు మరింత గౌరవం, గుర్తింపు లభించిందని వారు గుర్తుచేశారు.

తెలంగాణ ఉద్యమ కాలం నుండి అనిల్ కూర్మాచలం, వారి బృందం లండన్ వేదికగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయడంలో నిరంతరం చేస్తున్న కృషిని దేశపతి శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ సంస్కృతి పరిరక్షణ, చేనేత కార్మికుల ప్రోత్సాహం, బతుకమ్మ పండుగను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించడంలో టాక్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ, టాక్ సంస్థకు, అనిల్ కూర్మాచలం, వారి బృందానికి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

బతుకమ్మకు ప్రత్యేక స్థానం

జ‌డ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమా మాట్లాడుతూ... తెలంగాణ ఆడపడుచుల సాంస్కృతిక ప్రతీకగా, మన మట్టి పరిమళాన్ని, ఆత్మీయతను, సాంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించే పండుగగా బతుకమ్మకు ప్రత్యేక స్థానం ఉందని తుల ఉమా అన్నారు. బతుకమ్మ కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, తెలంగాణ మహిళల ఐక్యతకు, ఆత్మగౌరవానికి, ప్రకృతితో మనకున్న అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

అదేవిధంగా చేనేత రంగానికి, చేనేత కార్మికులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె అన్నారు. తెలంగాణ చేనేతకు బతుకమ్మను అనుసంధానం చేయడం ద్వారా మన పండుగతో పాటు చేనేత కళాకారుల శ్రమ, నైపుణ్యం, సృజనాత్మకతకు కూడా గుర్తింపు లభిస్తుందని తెలిపారు.

తెలంగాణ అధికార భాషా సంఘం మాజీ చైర్ పర్సన్ మంత్రి శ్రీదేవి మాట్లాడుతూ.. తొమ్మిది రోజుల పాటు మహిళలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో బతుకమ్మను పేర్చి, పాటలు పాడుతూ, సంప్రదాయ నృత్యాలతో వేడుకలు జరుపుకోవడం తెలంగాణ సంస్కృతిలో ఎంతో ప్రత్యేకమైన సంప్రదాయమని అన్నారు. తెలంగాణలో పుట్టి పెరిగిన వారితో పాటు, విదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు సైతం బతుకమ్మను ఘనంగా నిర్వహిస్తూ మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడం అభినందనీయమని తెలిపారు.

ప్రముఖ రచయిత, గాయకుడు మానుకోట ప్రసాద్, హాజరైన బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ మహిళా నాయకులు మాట్లాడుతూ... ప్రత్యేకంగా లండన్ వంటి అంతర్జాతీయ నగరంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించడం ద్వారా తెలంగాణ సంస్కృతి, మహిళల సంప్రదాయాలు, మన పండుగల విశిష్టతను ఇతర సమాజాలకు కూడా పరిచయం చేసే అవకాశం లభిస్తుందని వారు పేర్కొన్నారు. విదేశాల్లో పెరుగుతున్న తెలంగాణ యువత, భావితరాలకు బతుకమ్మ పండుగ ద్వారా మన భాష, సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమని అన్నారు.

చేనేతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం పట్ల మహిళా నాయకులు అభినందనలు తెలిపారు. తెలంగాణ చేనేత కార్మికులు తమ నైపుణ్యంతో రూపొందించే వస్త్రాలకు ప్రోత్సాహం కల్పించడంతో పాటు, చేనేత కుటుంబాలకు సామాజికంగా అండగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఎఫ్దీసి మాజీ చైర్మన్ & టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ ... "టాక్ చేనేత బతుకమ్మ - దసరా 2026 " సంబురాలా పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌కు, జ‌డ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమాకు, తెలంగాణ అధికార భాషా సంఘం మాజీ చైర్ పర్సన్ మంత్రి శ్రీదేవికి, హాజరైన బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ మహిళా నాయకులు, స్థానిక నాయకులకు, లండన్ ఎన్నారై సహచరులకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల మీడియాతో మాట్లాడుతూ.. హౌంస్లోలోని లాంప్ట‌న్ స్కూల్‌లో అక్టోబ‌ర్ 17న మ‌ధ్యాహ్నం ఒంటిగంట‌కు బ‌తుక‌మ్మ వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తామ‌న్నారు. యూకే నలుమూలల నుండి భారీగా ప్రవాసులు హాజరై సంబురాలని విజయవంతం చేయాల‌ని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో డ‌బ్ల్యూడీసీడ‌బ్ల్యూ హైద‌రాబాద్ జిల్లా మాజీ రీజిన‌ల్ ఆర్గ‌నైజ‌ర్ సుశీలా రెడ్డి ముక్త‌వ‌రం, జీహెచ్ఎంసీ మాజీ కార్పొరేట‌ర్ హేమ శ్యామ‌ల‌, పార్టీ సీనియ‌ర్ నేత‌లు రాజ్ కుమార్ శాన‌బోయిన‌, శ్రీనివాస్ వ‌ల్లాల‌, రజిత రెడ్డి, అర్పిత, ఖుషి సమ్ము, మల్లేష్ పప్పుల, నరేష్ గౌడ్, రాజేష్ శామకూర, టాక్ ప్రతినిధులు పృథ్వీ రావుల, మధు యాదవ్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement