త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLC Deshapathi Srinivas | ఇదా రేవంత్ సర్కార్ పాటిస్తున్న ప్రజాస్వామ్యం..? బాల్క సుమ‌న్ అరెస్టుపై ఎమ్మెల్సీ దేశ‌ప‌తి ఫైర్

MLC Deshapathi Srinivas | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ, అణచివేత ధోరణిపై బీఆర్ఎస్ పార్టీ శాసనమండలి విప్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

S

Telangana | Published On May 30, 2026, 6.04 pm IST

MLC Deshapathi Srinivas | ఇదా రేవంత్ సర్కార్ పాటిస్తున్న ప్రజాస్వామ్యం..? బాల్క సుమ‌న్ అరెస్టుపై ఎమ్మెల్సీ దేశ‌ప‌తి ఫైర్
Advertisement

MLC Deshapathi Srinivas | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ, అణచివేత ధోరణిపై బీఆర్ఎస్ పార్టీ శాసనమండలి విప్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకుల గొంతు నొక్కడమే ధ్యేయంగా రేవంత్ సర్కార్ అక్రమ కేసులు, రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని ఆయన శనివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై పెట్టిన అక్రమ కేసు ముమ్మాటికీ రాజకీయ కక్షసాధింపేనని దేశపతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ప్రశ్నిస్తూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ప్రగతి భవన్‌ను బాంబులు పెట్టి పేల్చేయాలంటూ నాడు రేవంత్ రెడ్డి బహిరంగంగా వ్యాఖ్యానిస్తే... దాన్ని భావప్రకటనా స్వేచ్ఛగా సమర్థించుకున్నారు. కానీ, నేడు ప్రజా సమస్యలపై బాల్క సుమన్ మాట్లాడిన వ్యాఖ్యలు మాత్రం చట్టవ్యతిరేకమా? ఇదా రేవంత్ సర్కార్ పాటిస్తున్న ప్రజాస్వామ్యం? ఇదా మీ ద్వంద్వ నీతి?" అని ఆయన నిలదీశారు.

బీఆర్ఎస్ నాయకులను ఎలాగైనా సరే ఇబ్బందులకు గురిచేయాలనే ఏకైక కుట్రతో, ఏదో ఒక తప్పుడు నెపాన్ని వెతుక్కుంటూ అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రశ్నించే గొంతుకలపై కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అణచివేత ధోరణిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజాస్వామ్యంలో ఇటువంటి నిరంకుశ చర్యలకు తావులేదని హితవు పలికారు.

ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కక్షపూరిత రాజకీయాలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. బాల్క సుమన్‌పై మోపిన అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకుని, ఆయనను వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement