త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Seethakka | చదువే ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం : మంత్రి సీతక్క

Minister Seethakka | "ప్రపంచాన్ని, జీవితాన్ని మార్చే శక్తి చదువుతోనే సాధ్యమవుతుంది. ఒకవేళ జీవితంలో అన్నీ కోల్పోయినా చదువు ఉంటే మళ్లీ నిలబడగలుగుతాం" అని రాష్ట్ర మంత్రి సీత‌క్క‌ పేర్కొన్నారు. బాలికలు కార్పొరేటర్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

S

Telangana | Published On May 30, 2026, 6.24 pm IST

Minister Seethakka | చదువే ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం : మంత్రి సీతక్క
Advertisement

Minister Seethakka | త్రినేత్ర‌.న్యూస్ : "ప్రపంచాన్ని, జీవితాన్ని మార్చే శక్తి చదువుతోనే సాధ్యమవుతుంది. ఒకవేళ జీవితంలో అన్నీ కోల్పోయినా చదువు ఉంటే మళ్లీ నిలబడగలుగుతాం" అని రాష్ట్ర మంత్రి సీత‌క్క‌ పేర్కొన్నారు. బాలికలు కార్పొరేటర్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

కొంగరకలాన్‌లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో మహిళా వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన స్నేహ సంఘాల మాక్ పార్లమెంట్, "అమ్మకు అక్షరమాల" కార్యక్రమం, అంగన్వాడీ యూనిఫామ్‌ల‌ పంపిణీ కార్యక్రమాల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ నెల్సన్ మండేలా చెప్పిన ప్రపంచాన్ని మార్చి శక్తి విద్యకు ఉంది అనే సూక్తిని ప్రస్తావించిన మంత్రి, చదువుతో పాటు సంస్కారం కూడా జీవితంలో అంతే ముఖ్యమని తెలిపారు. తల్లిదండ్రులను, గురువులను గౌరవించడం, సమాజంతో మమేకం కావడం, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడం అవసరమని సూచించారు. స్నేహ సంఘాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది టీనేజీ బాలికలను పదివేలకు పైగా స్నేహ గ్రూపులుగా ఏర్పాటుచేసి భద్రత, ఆరోగ్యం, పోషకాహారం, విద్య, సాధికారత అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మొబైల్ ఫోన్లకు బానిసలు కాకుండా వాటిని విద్య, వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాల అభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు. "పెళ్లి అయినా, వృద్ధాప్యం వచ్చినా మీతో ఉండేది మీ చదువు, మీ విజ్ఞానం మాత్రమే" అని పేర్కొంటూ ప్రతి బాలిక ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని సాధించే దిశగా కృషి చేయాలని కోరారు.

అంగన్వాడీ యూనిఫామ్‌ల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తెలంగాణకు ఐసిడిఎస్ సేవల బీజం మహబూబ్‌నగర్ నుంచే పడిందని గుర్తు చేశారు. 1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ చిన్నారుల కు పోషకాహారాన్ని అందించే విధంగా ఐసిడిఎస్ సేవలను ప్రారంభించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అంగన్వాడీ సేవలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతోందన్నారు.

గర్భధారణ దశ నుంచి మూడేళ్ల వయస్సు వరకు పిల్లల పోషకాహార అవసరాలను దృష్టిలో ఉంచుకుని అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. గతంలో లేని యూనిఫామ్‌ల‌ను ప్రస్తుతం అందిస్తున్నామని, 57 రకాల విద్యా, ఆట వస్తువులను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. "తొలి ముద్ద" కార్యక్రమం ద్వారా అల్పాహారం, పాలు, గుడ్లు, పోషకాహారం అందిస్తున్నామని వివరించారు. "ప్రైవేట్ నర్సరీల్లో అన్నం, పాలు, గుడ్లు ఇవ్వరు. కానీ ప్రభుత్వ అంగన్వాడీల్లో పిల్లల సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ప్రయివేటు బడి వద్దు.. అంగన్వాడి ముద్దు" అని మంత్రి పేర్కొన్నారు. అంగన్వాడీ విద్య పూర్తి చేసుకుని మొదటి తరగతిలో చేరుతున్న చిన్నారులకు విద్యారంభ ధ్రువపత్రాలను మంత్రి అందజేశారు.

స్నేహ సంఘాల మాక్ పార్లమెంట్‌లో బాలికలు విద్య, ఆరోగ్యం, సైబర్ భద్రత, రవాణా, పాఠశాల మౌలిక వసతులు, మహిళా ఉపాధ్యాయుల నియామకం, సానిటరీ న్యాప్కిన్ల పంపిణీ తదితర అంశాలపై ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వ పథకాలపై సంబంధిత అధికారులు సమాధానాలు ఇచ్చారు.

ఈ సందర్భంగా సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా సీతక్క అసెంబ్లీలో చేసిన చర్చలు అధికారులను ఆలోచింపజేసేవని గుర్తుచేశారు. గ్రామస్థాయిలో బాలికలు తమ సమస్యలను ధైర్యంగా వ్యక్తపరిచే వేదికగా స్నేహ సంఘాలు నిలుస్తున్నాయని తెలిపారు. మహిళల అక్షరాస్యత పెంపు కోసం చేపట్టిన "అమ్మకు అక్షరమాల" కార్యక్రమం ద్వారా లక్షలాది మంది మహిళలు చదవడం, రాయడం నేర్చుకుని వేలిముద్రకు బదులుగా సంతకం చేసే స్థాయికి చేరుకున్నారని అధికారులు వెల్లడించారు.

కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, మహిళా కమిషన్ సభ్యురాలు సదాలక్ష్మి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, శాఖ డైరెక్టర్ శృతి ఓజా, పంచాయతీరాజ్ కమిషనర్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా అధికారులు, స్నేహ సంఘాల సభ్యులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement