త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SC ST Commission Telangana | అసెంబ్లీ వద్ద దళిత, గిరిజన ఎమ్మెల్యేలపై పోలీసుల దౌర్జన్యం.. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు

అసెంబ్లీ వద్ద పోలీసులు తమపై దాడి చేసి అవమానించారని బీఆర్ఎస్ దళిత, గిరిజన ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

J

Telangana | Published On Sep 7, 2026, 5.35 pm IST

SC ST Commission Telangana | అసెంబ్లీ వద్ద దళిత, గిరిజన ఎమ్మెల్యేలపై పోలీసుల దౌర్జన్యం.. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు
Advertisement
  • తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్న దళిత, గిరిజన ఎమ్మెల్యేలను గేటు వద్ద పోలీసులు అడ్డుకుని దౌర్జన్యం చేశారని బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
  • ఆదివాసీ మహిళా ఎమ్మెల్యే కోవా లక్ష్మితో పాటు ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, మాణిక్ రావు, విజయుడు తదితరులపై పోలీసులు భౌతిక దాడికి పాల్పడ్డారని ఆవేదన
  • నిరసన తెలిపే టీ-షర్ట్స్ విప్పితేనే లోపలికి అనుమతిస్తామని అవమానించారని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు రాసిన లేఖలో వెల్లడి
  • బాధ్యులైన పోలీసులపై సుమోటోగా విచారణ జరిపి కఠిన యాక్షన్ తీసుకోవాలని డిమాండ్

SC ST Commission Telangana | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న తమ పార్టీ ఎస్సీ, ఎస్టీ (SC, ST) శాసనసభ్యులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ (BRS) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ప్రాంగణం వెలుపల గేటు వద్ద పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించి, భౌతిక దాడులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సోమవారం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికారికంగా ఫిర్యాదు చేశారు.

మహిళా ఎమ్మెల్యే, సీనియర్లపై దాడి

ప్రజాప్రతినిధులని కూడా చూడకుండా పోలీసులు తీవ్రమైన దుర్భాషలాడారని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆదివాసీ మహిళా ఎమ్మెల్యే కోవా లక్ష్మి పట్ల అత్యంత అనుచితంగా, అవమానకరంగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, మాణిక్‌రావు, విజయుడు తదితరులపై ఫిజికల్‌గా (Physically) దాడికి పాల్పడ్డారని తెలిపారు. పోలీసుల తోపులాటలో పలువురు ఎమ్మెల్యేలకు గాయాలయ్యాయని, వారికి మెడికల్ ట్రీట్‌మెంట్ కూడా అవసరమైందని లేఖలో వివరించారు.

టీ-షర్ట్స్ విప్పితేనే లోపలికి..

ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేందుకు ధరించిన టీ-షర్ట్స్ విప్పితేనే అసెంబ్లీలోకి పంపిస్తామని పోలీసులు కండిషన్ పెట్టడం తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఇది కేవలం తమపై జరిగిన దాడి కాదని, అట్టడుగు వర్గాల రాజ్యాంగబద్ధ హక్కుల ఉల్లంఘనగా (Rights violation) వారు అభివర్ణించారు.

కమిషన్‌కు ప్రధాన డిమాండ్లు ఇవే

ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ వెంటనే సుమోటోగా (Suo moto) విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. దాడికి పాల్పడిన పోలీసులను వెంటనే ఐడెంటిఫై (Identify) చేసి, వారిపై కఠినమైన యాక్షన్ (Action) తీసుకోవాలని కోరింది. అలాగే అక్కడి సీసీటీవీ (CCTV), పోలీసుల బాడీ క్యామ్ (Body-cam) ఫుటేజీలను భద్రపరిచి, సమగ్ర విచారణ జరపాలని కోరింది. భవిష్యత్తులో దళిత, గిరిజన ప్రజాప్రతినిధుల పట్ల ఇలాంటి దారుణ ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కమిషన్ చైర్మన్‌కు సమర్పించిన వినతిపత్రంలో వారు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement