త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RS Praveen Kumar | ఫోన్ ట్యాపింగ్ చ‌ట్ట‌బ‌ద్ధ‌మే.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

RS Praveen Kumar | ఫోన్ ట్యాప్ చేయడం నేరం కాదని.. దేశ రక్షణ కోసం ట్యాపింగ్ చేయవచ్చని ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ చెప్పార‌ని బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ గుర్తు చేశారు.

S

Telangana | Published On Jan 23, 2026, 4.03 pm IST

RS Praveen Kumar | ఫోన్ ట్యాపింగ్ చ‌ట్ట‌బ‌ద్ధ‌మే.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడే కొత్త కాదు..
బ్రిటీష్ కాలం నుంచి అమ‌ల్లో ఉంది..
ఫోన్ ట్యాప్ నేరం కాద‌న్న మ‌న్మోహ‌న్ సింగ్..
స‌జ్జ‌నార్‌పై ఏపీలో ఫోన్ ట్యాపింగ్ కేసులు
మ‌రి ఏ అర్హ‌త‌తో స‌జ్జ‌నార్ విచార‌ణ జ‌రుపుతున్నాడు..?
ఇంటెలిజెన్స్ వ్య‌వ‌స్థ‌ను దిగ‌జార్చిన రేవంత్..
రేవంత్ రాజ‌కీయాల‌కు పోలీసులు బ‌లి కాకండి..
కాంగ్రెస్, బీజేపీ కుమ్మ‌క్కు వ‌ల్లే రేవంత్ దౌర్జ‌న్యాలు
తెలంగాణ భ‌వ‌న్‌లో ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు

RS Praveen Kumar | త్రినేత్ర‌.న్యూస్ : ఫోన్ ట్యాప్ చేయడం నేరం కాదని.. దేశ రక్షణ కోసం ట్యాపింగ్ చేయవచ్చని ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ చెప్పార‌ని బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ గుర్తు చేశారు. కేంద్రంలో ఫోన్ ట్యాపింగ్ జ‌ర‌గ‌డం లేద‌ని అమిత్ షా చెప్ప‌గ‌ల‌రా..? కాంగ్రెస్, బీజేపీ కుమ్మ‌క్కైనందు వ‌ల్లే రేవంత్ దౌర్జ‌న్యాల మీద బీజేపీ మాట్లాడ‌డం లేద‌న్నారు. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు జారీ చేయ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తూ.. ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడారు.

పంజాగుట్ట పోలీసు స్టేష‌న్‌లో న‌మోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు ఆధారంగా ఇప్ప‌టి వ‌ర‌కు 350 మందిని విచారించారు. ఫోన్ ట్యాపింగ్ జ‌ర‌గ‌లేద‌ని విచార‌ణ‌లో తేలింది. విచారణ సమయంలో పోలీస్ కానిస్టేబుల్‌ను బెదిరించారు. అయినా ఏ ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల పేర్లు చెప్పలేదు. కావాలనే మరోసారి సిట్ ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులను వేధించేందుకు అక్రమ సిట్‌ను రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారు. విచారణ చేస్తే, ఇప్పుడున్న మంత్రులను విచారించాలి, మంత్రుల అక్రమాలు ఎక్కువయ్యాయి. ఫోన్ ట్యాపింగ్ పేరుతో లేని పోనీ సంబంధాలు కట్టబెడుతున్నారు. చట్ట పరంగా మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ దుర్వినియోగం జరిగినట్లు అనుమానం ఉంటే... ఆనాడు ఉన్నటువంటి పోలీస్ అధికారులను విచారణ చేయాలి. నాయకులకు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎటువంటి సంబంధం ఉండదు అని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ స్ప‌ష్టం చేశారు.

దేశ భ‌ద్ర‌త కోసం ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు అని చ‌ట్ట‌మే చెప్తుంది..

ఫోన్ ట్యాపింగ్ అనేది చ‌ట్ట‌బ‌ద్ధంగానే జ‌రుగుతంది. ఇప్పుడే కొత్త‌గా ఫోన్ ట్యాపింగ్ చేయ‌డం లేదు. బ్రిటీష్ కాలం నుంచి ఇది కొన‌సాగుతుంది. దేశ భ‌ద్ర‌త కోసం ఉగ్ర‌వాదుల నెంబ‌ర్స్‌ను ట్యాపింగ్ చేస్తారు. దేశ భ‌ద్ర‌త కోసం ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు అని చ‌ట్ట‌మే చెప్తుంది. దేశ భద్రత కోసం పార్లమెంట్ వేదికగా ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు అని మన్మోహన్ సింగే చెప్పారు. మన్మోహన్ సింగ్‌కు ఉన్నటువంటి స్టేచ‌ర్.. రేవంత్ రెడ్డికి ఉందో లేదో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదని రేవంత్ రెడ్డి కూడా గతంలో చెప్పాడు. మరి ఈ రోజు ఇదే ముఖ్యమంత్రి ట్యాపింగ్ మీద కేసులు వేస్తున్నాడు. ఫోన్ ట్యాపింగ్ దేశ రక్షణ కోసం పోలీసులు చేస్తారు.. అన్ని ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేస్తాయి కానీ దీని మీద ఏ రాష్ట్రంలో కూడా చర్చ జరగడం లేదు అని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ తెలిపారు.

ఏ అర్హ‌త‌తో స‌జ్జ‌నార్ విచార‌ణ జ‌రుపుతున్నాడు..?

2015లో నోటుకు ఓటు కేసులో సజ్జనార్ ఫోన్ ట్యాపింగ్ చేశాడని కేసులు పెట్టారు. ఇప్పుడు అదే సజ్జ‌నార్ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ చేస్తా అంటున్నాడు. రాజకీయ నాయకులను వేధించడానికి ఏర్పాటు చేసిన సిట్‌కు సజ్జనార్ చీఫ్‌గా ఉన్నాడు. సజ్జనార్‌కు సిట్‌ను లీడ్ చేసి, ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారించే నైతిక అర్హత లేదు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగగా అరెస్ట్ అయినప్పుడు ఎస్ఐబీగా సజ్జనార్ ఉన్నాడు.. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ప్రస్తుత డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి ఉన్నారు. ఇవ‌న్నీ ఎలా జ‌రుగుతాయో వారికి తెలియ‌దా..? ఆనాడు స‌జ్జ‌నార్, శివ‌ధ‌ర్ రెడ్డి ఇంటెలిజెన్స్ అధికారులుగా ఉండే. త‌మ ఫోన్ల‌ను ట్యాప్ చేస్తున్నార‌ని ఏపీలోని కొంత‌మంది నాయ‌కులు వీరిద్ద‌రిపై ప‌లు స్టేష‌న్‌ల‌లో ఫిర్యాదులు చేస్తే కేసులు కూడా న‌మోదు అయ్యాయి. అలాంటి మీరు ఏ అర్హ‌త‌తో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును విచార‌ణ జ‌రుపుతున్నారు. ట్యాపింగ్‌లు ఎందుకు చేస్తారో వీరికి తెలుసు.. ఏ చ‌ట్ట ప్ర‌కారం చేస్తారో కూడా వీరికి తెలుసు. ఎవ‌ర్నీ ప‌ట్టుకోవ‌డానికి చేస్తారో తెలుసు..? అయినా వీరే ట్యాపింగ్ విష‌యంలో కేసులు ఎదుర్కొంటున్నారు. వీట‌న్నింటిపై తెలంగాణ ప్ర‌జ‌లు ఆలోచించాల‌ని ఆర్ఎస్పీ సూచించారు.

ఎస్ఐబీ ఆఫీసు ఎక్క‌డుంటుందో హోమంత్రికి కూడా తెల్వ‌దు..

ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎలా ఉంటుందో ఏ రాజకీయ నాయకుడుకి తెలియదు. హోం మంత్రికి కూడా ఎస్ఐబీ ఆఫీస్ ఎక్కడో ఉంటుందో తెలియదు. అంతటి రహస్యంగా ఇంటిలిజెన్స్, ఎస్ఐబీ వ్యవస్థలు ఉంటాయి. అలాంటి వ్యవస్థలను త‌న వికృత క్రీడ‌ల‌తో రేవంత్ రెడ్డి దిగజార్చారు. ప‌దోన్న‌తుల కోసం రేవంత్ రెడ్డి వికృత క్రీడలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు. దేశ భద్రత కోసం, రాష్ట్ర భద్రత కోసం ఫోన్ ట్యాపింగ్ చెయ్యాల్సిన అవసరం ఉంటుంది. ఒక పోలీస్ అధికారిగా ఫోన్ ట్యాపింగ్ విషయం నాకు తెలుసు. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని.. రేవంత్ రెడ్డి బజారున పడేశాడు అని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ధ్వ‌జ‌మెత్తారు.

ప్రజల గొంతుకగా రాజీలేని పోరాటం చేస్తూనే ఉంటాం..

ప్రజల గొంతుకగా రాజీలేని పోరాటం చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులపైన అక్రమ కేసులు పెడుతున్నారు. ఎన్ని కేసులు పెట్టిన ప్రజల గొంతుకగా రాజీలేని పోరాటం చేస్తూనే ఉంటాం. విచారణల పేరుతో బీఆర్ఎస్ నాయకుల గుండెలు ఎన్నిసార్లు చీల్చిన.. విచారణ అధికారులకు ఒకే ఒకటి కనిపిస్తుంది.. తెలంగాణ ప్రజలు, అభివృద్ధి మాత్రమే. రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో.. పోలీస్ అధికారులు బలికాకండి. కేటీఆర్‌ను విచారణకు పిలవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement