త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RS Praveen Kumar | రూ. 1100 కోట్ల స్కాం బ‌య‌ట‌పెట్టినందుకే ‘పెద్ది’కి వేధింపులు : ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్

RS Praveen Kumar | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌లో రూ. 1100 కోట్ల కుంభ‌కోణం జ‌రిగింద‌ని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి బ‌హిర్గ‌తం చేసిన త‌ర్వాతనే ఆయ‌న‌పై వేధింపులు మొద‌ల‌య్యాయ‌ని బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ పేర్కొన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులతో, సోదరులతో, సన్నిహితులతో మాట్లాడిన తర్వాత ఇది అర్థమైంది అని ఆయ‌న తెలిపారు.

S

Telangana | Published On Jul 29, 2026, 2.35 pm IST

RS Praveen Kumar | రూ. 1100 కోట్ల స్కాం బ‌య‌ట‌పెట్టినందుకే ‘పెద్ది’కి వేధింపులు : ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్
Advertisement

పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి వెప‌న్ లైసెన్స్ కూడా ర‌ద్దు చేశారు..
ఆయ‌న‌ ఆస్ప‌త్రి పాల‌వ‌డానికి ఫ‌హీం ఖురేషీనే కార‌ణం
దేశంలో న‌క్స‌లిజం లేకుంటే
తెలంగాణ మంత్రుల‌కు బుల్లెట్ ఫ్రూప్ కార్లు ఎందుకు..?
రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించిన ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్

RS Praveen Kumar | త్రినేత్ర‌.న్యూస్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌లో రూ. 1100 కోట్ల కుంభ‌కోణం జ‌రిగింద‌ని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి బ‌హిర్గ‌తం చేసిన త‌ర్వాతనే ఆయ‌న‌పై వేధింపులు మొద‌ల‌య్యాయ‌ని బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ పేర్కొన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులతో, సోదరులతో, సన్నిహితులతో మాట్లాడిన తర్వాత ఇది అర్థమైంది అని ఆయ‌న తెలిపారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ బుధ‌వారం మీడియాతో మాట్లాడారు.

పెద్ది సుదర్శన్ రెడ్డి గతంలో సివిల్ సప్లైస్ చైర్మన్‌గా ఉన్నప్పుడు, ప్రస్తుత డీజీపీ సీవీ ఆనంద్ సివిల్ సప్లైస్ కమిషనర్‌గా ఉన్నారు. గతంలో సివిల్ సప్లైస్ డిపార్ట్‌మెంట్‌లో వేల కోట్ల కుంభకోణాలు జరిగాయని, బియ్యం రాబందుల పాలు కాకూడదని ఒక అద్భుతమైన ప్లాన్‌ను అప్పటి సీఎం కేసీఆర్‌కు ఇచ్చారు. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సివిల్ సప్లైస్‌లో రూ.1100 కోట్ల స్కాం జరిగిందని పెద్ది సుదర్శన్ రెడ్డి తెలుసుకొని ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు లేఖలు రాశాడు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు తెలిపి, హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశారు. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో రూ.17000 విలువైన బంకర్ బెడ్‌ను రూ. 33000లకు కొన్నారని, ఇందులో కాంగ్రెస్ నాయకులు, బడా కాంట్రాక్టర్లు వందల కోట్ల స్కాం చేశారని.. వాటిని ఢిల్లీ పెద్దలకు కూడా ఇచ్చారని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధారాలతో బయటపెట్టారు. ఈ కుంభకోణాల్లో దొరికిపోతున్నామని రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ నాయకులకు అర్థమైందో అప్పటి నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి వెపన్ లైసెన్స్‌ను రద్దు చేసి ఆయనను ఇబ్బందుల‌కు గురి చేశార‌ని ఆర్ఎస్పీ తెలిపారు.

పెద్ది సుదర్శన్ రెడ్డిని నిందితుడిగా చేర్చాలని ప్లాన్ చేశారు

పెద్ది సుదర్శన్ రెడ్డికి ఇలా కావడానికి కారణం సీఎం రేవంత్ సన్నిహితుడు ఫహీం ఖురేషీ. కాంగ్రెస్ పాలన ఇంత క్రూరంగా ఉంటుందా అనేదానికి నిదర్శనమే పెద్ది సుదర్శన్ రెడ్డి ఉదంతం. నర్సంపేటలో ఉండే కొంతమంది వ్యాపారస్తులు వాసవి బిల్డర్స్‌కు కొంత భూమి అమ్మేశారు. అయితే ఆ భూమిపై ముఖ్యమంత్రి సన్నిహితుడు ఫహీం ఖురేషీ కన్ను పడింది. వాసవి బిల్డర్స్‌కు చెందిన విజయ్ కుమార్, ఫహీం ఖురేషీ కలిసి సైబరాబాద్‌లోని ఈవోడ‌బ్ల్యూలో కేసు పెట్టించి, నర్సంపేటలో సుదర్శన్ రెడ్డి సన్నిహితులైన వ్యాపారస్తులను పోలీస్ స్టేషన్‌కు పిలిచి టార్చర్ పెట్టారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు చెప్పాలని వేధించారు. అందులో ఆయనను నిందితుడిగా చేర్చాలని ప్లాన్ చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి సీవీ ఆనంద్ గారికి ఫోన్ చేసినా.. నా చేతిలో ఏమీ లేదు. అంతా ఫహీం ఖురేషీ, ముఖ్యమంత్రి కార్యాలయం చూస్తుంది అని చేతులు దులుపుకున్నాడు. గురుకుల బంకర్ బెడ్ల కుంభకోణంపై పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడినందుకే ఇంత వేధించార‌ని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ స్ప‌ష్టం చేశారు.

కర్ణాటకలో మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు లేవు..

దేశంలో నక్సలిజం లేదు.. అందుకే బుల్లెట్ ప్రూఫ్ కార్లు తొలిగిస్తున్నామని డీజీపీ చెప్తున్నాడు. కర్ణాటకలో మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు లేవు. మరి తెలంగాణలో మంత్రులకు, కాంగ్రెస్ నాయకులకు ఎందుకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు? బీఆర్ఎస్ నాయకులకు ఒక న్యాయం కాంగ్రెస్ నాయకులకు ఒక న్యాయం ఉంటుందా? ఈ అంశంపై కచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

మైనంపల్లి హన్మంతరావు ఏం కూంబింగ్ ఆపరేషన్లు చేశారని 2+2 సెక్యూరిటీ ఇచ్చారు?

మైనంపల్లి హన్మంతరావు ఏం కూంబింగ్ ఆపరేషన్లు చేశాడని, ఏ తీవ్రవాద సంస్థ, ఏ మావోయిస్టులు ఆయనను టార్గెట్ చేశారని 2+2 సెక్యూరిటీ ఇచ్చారు? కొండా మురళీ ఎమ్మెల్సీ కాదు, కార్పొరేషన్ చైర్మన్ కాదు. ఆయనకు 2+2 సెక్యూరిటీ ఇచ్చారు.. ఆయనకు ఏ హోదా ఉందని 2+2 సెక్యూరిటీ ఇచ్చారు? ఏనుముల తిరుపతి రెడ్డి, ఏనుముల కొండల్ రెడ్డిలు ఏం కూంబింగ్ ఆపరేషన్లు చేశారని, ఏ ఉగ్రవాద సంస్థతో ముప్పు ఉందని, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక సెమీ ఆటోమేటెడ్ వెపన్స్ ఇచ్చారు? సునీతా మహేందర్ రెడ్డి మాజీ జెడ్పీ చైర్‌పర్సన్. ఆమెకు గన్‌మెన్లను ఇచ్చారు. సత్యవతి రాథోడ్ తెలంగాణ రాష్ట్రంలో తొలి గిరిజన మహిళా మంత్రి.. ఆమె ఇప్పుడు మాజీ మంత్రి. ఆమె గన్‌మెన్లను తీసేశారు. జోగు రామన్న మాజీ మంత్రి. ఆయన గన్‌మెన్లను తొలగించారు.. అదే జిల్లాలో ఇంద్రకరణ్ రెడ్డికి 2+2 గన్‌మెన్లను ఇచ్చారు ఎందుకు? కుందూరు జానారెడ్డి ప్రస్తుత హోదా ఏంటి? ఆయనకు 2+2 గన్‌మెన్లను ఇచ్చి, అత్యాధునిక బుల్లెట్‌ప్రూఫ్ వాహనం ఇచ్చారు. జానారెడ్డి మాజీ మంత్రి అయితే సత్యవతి రాథోడ్, జోగు రామన్న కూడా మాజీ మంత్రులే కదా. మరి వీళ్లకు ఎందుకు సెక్యూరిటీ తొలగించారు? బీఆర్ఎస్ నాయకులకు ఒక న్యాయం.. కాంగ్రెస్ నాయకులకు ఒక న్యాయమా? దీని మీద డీజీపీ సమాధానం చెప్పాలని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement