త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rakesh Reddy | 20 వేల పోలీసు ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయాల్సిందే : ఏనుగుల రాకేశ్ రెడ్డి

Rakesh Reddy | రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యలపై, కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు యూత్ డిక్లరేషన్‌పై, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్‌పై ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయ‌కుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి నిల‌దీశారు. త‌క్ష‌ణ‌మే 20 వేల పోలీసు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Mar 13, 2026, 5.13 pm IST

Rakesh Reddy | 20 వేల పోలీసు ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయాల్సిందే : ఏనుగుల రాకేశ్ రెడ్డి
Advertisement

జాబ్ నోటిఫికేష‌న్ల గురించి ఆలోచించే స‌మ‌యం లేదా..?
లైసెన్స్‌డ్ స‌ర్వే ఉద్యోగుల‌ను విధుల్లోకి తీసుకోవాలి
ఆకునూరి ముర‌ళి క్ష‌మాప‌ణ చెప్పాలి
ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ తొల‌గిస్తారా..?
అప్డేట్ చేయాల్సింది కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని
అప్పుడే నోటిఫికేష‌న్లు వ‌స్తాయి

Rakesh Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యలపై, కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు యూత్ డిక్లరేషన్‌పై, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్‌పై ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయ‌కుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి నిల‌దీశారు. త‌క్ష‌ణ‌మే 20 వేల పోలీసు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో రాకేశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే అందరూ కలిసి నిరుద్యోగ యువతే లక్ష్యంగా యూత్ డిక్లరేషన్‌లు విడుదల చేసి అనేక హామీలిచ్చారు. తెలంగాణలో ప్రతీ ఇంటికో నిరుద్యోగి ఉన్నాడు. వాళ్ళే కోటి మంది నిరుద్యోగ యువత కోటి ఆశలతో ఓట్లేసి గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గ‌త ఎన్నికల సమయంలో ప్రధానంగా ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ, జీవో 46 రద్దు, రాజీవ్ యువ వికాసం లాంటి పథకాలు అమలు చేస్తామని ఆకర్షణీయమైన హామీలు ఇచ్చి గద్దెనెక్కడం జరిగింది. కానీ అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండేళ్లు అవుతున్న ఇచ్చిన హామీలు గుర్తు రావడం లేదు. వీళ్ల ఓట్లతో సీఎం అయిన రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులకు వీళ్ల గురించి ఆలోచించే తీరిక లేకుండా పోతుంది. ఆఖరికి తమ‌ న్యాయమైన హక్కుల సాధన కోసం దిల్‌షుఖ్‌నగ‌ర్‌లో నిరుద్యోగ యువత నిరసన తెలిపితే అక్రమంగా అరెస్ట్ చేసి, అక్రమ కేసులు బనాయించి వాళ్లకు నాయకత్వం వహించే నిరుద్యోగ నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారు. నమ్మి నానపోతే పుచ్చిబుర్రలాయే అంటారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నమ్మి ఓట్లేసి గెలిపిస్తే పుచ్చి బుర్రలు అవ్వడం కాదు. ఏకంగా నిరుద్యోగుల పుర్రెలే పగలగొడుతున్నారు అని రాకేశ్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు.

కొత్తగా ఉద్యోగానికి రాజీనామా చేయాలన్న నిబంధన 

రెండేళ్లు కావొస్తున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సంస్కరణ కూడా తీసుకురాలేదు. యూపీఎస్సీ నోటిఫికేషన్ లో సివిల్ సర్వీస్ లో ఉన్నవాళ్ళు నేరుగా పరీక్షలు రాయడానికి వీలుగా లేదని, ఒకవేళ ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్‌లుగా విధులు నిర్వహస్తున్న వారు మళ్లీ యూపీఎస్సీ పరీక్ష రాయాలంటే ముందుకు తమ ఉద్యోగానికి రాజీనామా చేయాలన్న నిబంధనను కొత్తగా తేవడం జరిగింది. 2028 నుండి అమల్లోకి రాబోతుంది. జ్యుడీషరీ వ్యవస్థలో ఒక కొత్త సంస్కరణలు వచ్చాయి. ఒక లాయర్ జడ్జి కావాలంటే లా చదివి బార్ అసోసియేషన్ సభ్యులు అయితే జడ్జి పరీక్ష రాసి జడ్జి కావొచ్చు. కానీ, ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం జడ్జ్ కావాలంటే కనీసం మూడేళ్లు ప్రాక్టీస్ చేసి ఉండాలని నిబంధన తేవడం జరిగిందని రాకేశ్ రెడ్డి తెలిపారు.

అగో నోటిఫికేషన్.. ఈగో నోటిఫికేషన్

అలాగే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో చెప్తే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఫైనాన్స్ శాఖకు ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. మన పక్క రాష్ట్రం కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే, అక్కడ ఇటీవలే నిర్వహించిన ఒక పోటీ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ జరిగిందని నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ధర్నా చేస్తే ఒక విచారణ కమిటీ వేసింది. కానీ, మన తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రమత్తులో ఉంది ఒక సిలబస్ రివ్యూ కమిటీ వేసి రెండేళ్లు దాటినా ఇప్పటి వరకు ఆ సిలబస్ పై దిక్కుమొక్కు లేదు. ఇది తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధి సోయి? అసలు సిలబస్ ఫైనల్ కాకుండా నోటిఫికేషన్ ఎలా ఇస్తారు. ఎలా పరీక్షలు నిర్వహిస్తారు. ఎలా పోస్ట్ లు భర్తీ చేస్తారు. నిరుద్యోగ యువతను మభ్య పెట్టడానికి రోజుకో మీడియా లీకు ఇచ్చి త్వరలో నోటిఫికేషన్ ఇస్తున్నామని అగో నోటిఫికేషన్.. ఈగో నోటిఫికేషన్ అని ఊరించడం తప్ప ఒక్క నోటిఫికేషన్ ఇవ్వడం లేదు. ఈ లీకులను నమ్మి మోసపోతున్న యువత హైదరాబాద్‌లో ఇరుకైన గదుల్లో ఒక పూట తింటూ, మరో పూట పస్తులు ఉంటూ.. స్విగ్గి, రాపిడోలు నడుపుతూ పూట గడుపుతున్నారు. పెళ్లీడుకొచ్చిన యువత పండగొచ్చినా పబ్బం వచ్చినా ఉద్యోగం రాకపోవడంతో ఊర్లోకి వెళ్ళి తల్లిదండ్రులకు ముఖం చూపెట్టలేక నగరంలోనే బతుకు ఈడుస్తున్నారు. 30 దాటిన కానీ సరైన ఉద్యోగ ఉపాధి అవకాశం లేక ఉసూరుమంటూ జీవనం కొనసాగిస్తున్నారని రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు.

జాబ్ క్యాలెండర్ చెల్లని చిత్తు కాగితం

ఈ రోజు కూడా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ రావడం లేదని కాశీపేట మండలానికి చెందిన హరీష్ అనే యువకుడు బ‌లవన్మరణానికి పాల్పడటం జరిగింది. స్వయంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా ప్రవేశ పెట్టిన జాబ్ క్యాలెండర్ చెల్లని చిత్తు కాగితం అయింది. ప్రయివేటు కంపెనీల్లో అయినా ఉద్యోగాలు పొందాలనుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ఉన్న కంపెనీలు తరలిపోవడం తప్ప కొత్త కంపెనీలు రావడం లేదు. రేవంత్ రెడ్డి పాలన వల్ల గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రముఖ ప్రపంచ దిగ్గజ సంస్థల్లో సైతం లే ఆఫ్స్ అవుతున్నాయ‌ని చెప్పారు.

ఒక్క పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగమైనా నోటిఫికేషన్ ఇచ్చారా?

కేసీఆర్ హయాంలో, కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు 3 లక్షలున్న ఐటీ ఉద్యోగులను 10 లక్షలకు పెంచడం జరిగింది. కానీ, రేవంత్ రెడ్డి వచ్చాక సాఫ్ట్‌వేర్ కంపెనీలు బయటపడి బయటకి వెళ్తే కొన్ని వేలాది ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క పోలీస్ శాఖలోనే 46,681 పోలీస్ ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. నాది ప్రజా పాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి రెండేళ్లు అవుతుంది. ఒక్క పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగమైనా నోటిఫికేషన్ ఇచ్చారా? మొన్న మున్సిపల్ ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతను మభ్యపెట్టడానికి టీజీపీఎస్సీ నుండి ఓటీఆర్‌ను అప్డేట్ చేసుకోవాలని సమాచారమిచ్చింది. అయితే ఈ ఎన్నికల సందర్భంగా అయినా నోటిఫికేషన్ ఇస్తారేమో అనుకున్నారు. కానీ, ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. అసలు అప్డేట్ చేయాల్సింది ఓటీఆర్‌ను కాదు. అప్డేట్ చేయాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని రాకేశ్ రెడ్డి అన్నారు.

ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ పథకాన్ని ఆపాలనటం పెద్ద కుట్ర

స్వయంగా ముఖ్యమంత్రే విద్యా శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న ఈ రాష్ట్రంలో విద్యా శాఖను ఎలా ప్రక్షాళన కావాలని కమిటీ వేస్తే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకూడదని ఆ కమిటీ సిఫార్స్ చేసింది. స్వయంగా ముఖ్యమంత్రే నిర్వహించే ఈ శాఖ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను విద్యకు దూరం చేసే కుట్రలు శ్రీకారం చుట్టడం అత్యంత దారుణం. ఈ కమిటీకి ఏమైనా తలా తోక ఉన్నట్టా లేనట్టా అసలు. లక్షలాది మంది పేద విద్యార్థులకు విద్యను చేరువ చేయడానికి తీసుకొచ్చిన ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ పథకాన్ని ఆపాలనటం కంటే పెద్ద కుట్ర ఇంకొకటి ఉంటుందా? అని రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు.

ఇంతకంటే నీచమైన ప్రభుత్వం ఇంకొకటి ఉంటుందా?

అపర మేధావిగా ఫీలయ్యే ఆకునూరి మురళి ప్రభుత్వ ఉపాధ్యాయులకు జీతాలు ఎక్కువ ఇస్తున్నారని కమిటి రిపోర్ట్‌లో ఇచ్చి ఉపాధ్యాయ వృత్తినే అవమానించారు. మరి మీ ప్రభుత్వం ఇవ్వాల్సిన పీఆర్సీ, డీఏల గురించి రిపోర్టులో ఎందుకు స్పందించలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థులను బావి భారత పౌరులుగా తీర్చి దిద్దుతున్న ఉపాధ్యాయుల జీతాల మీద కూడా పడ్డారంటే ఇంతకంటే నీచమైన ప్రభుత్వం ఇంకొకటి ఉంటుందా? ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయితే వాళ్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని రోదిస్తున్నారు. ఏకంగా హైకోర్టు జడ్జ్ మా రిటైర్మెంట్ బెనిఫిట్ త్వరగా ఇవ్వాలని హైకోర్ట్ మెట్లెక్కి దుస్థితి దాపురించింది అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఏ స్థాయికి దిగజారిందో తెలుస్తుంది అని రాకేశ్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు.

Advertisement
Advertisement