త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Alleti Maheshwar Reddy | హేట్ స్పీచ్ బిల్లుతో కాంగ్రెస్‌కు కూడా ఇబ్బందే.. ఎమ్మెల్యే ఏలేటి కీల‌క వ్యాఖ్య‌లు

Alleti Maheshwar Reddy | విద్వేష ప్రసంగాలు, నేరాల నిరోధ బిల్లుతో భ‌విష్య‌త్‌లో కాంగ్రెస్ పార్టీకి కూడా ఇబ్బందే అని బీజేపీఎల్పీ నేత ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ బిల్లు ఉంద‌న్నారు. ఆర్టిక‌ల్ 19ను హ‌రించివేసే విధంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన బిల్లు ఉంద‌ని మ‌హేశ్వ‌ర్ రెడ్డి మండిప‌డ్డారు.

S

Telangana | Published On Mar 30, 2026, 3.43 pm IST

Alleti Maheshwar Reddy | హేట్ స్పీచ్ బిల్లుతో కాంగ్రెస్‌కు కూడా ఇబ్బందే.. ఎమ్మెల్యే ఏలేటి కీల‌క వ్యాఖ్య‌లు
Advertisement

Alleti Maheshwar Reddy | త్రినేత్ర‌.న్యూస్ : విద్వేష ప్రసంగాలు, నేరాల నిరోధ బిల్లుతో భ‌విష్య‌త్‌లో కాంగ్రెస్ పార్టీకి కూడా ఇబ్బందే అని బీజేపీఎల్పీ నేత ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ బిల్లు ఉంద‌న్నారు. ఆర్టిక‌ల్ 19ను హ‌రించివేసే విధంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన బిల్లు ఉంద‌ని మ‌హేశ్వ‌ర్ రెడ్డి మండిప‌డ్డారు. శాస‌న‌స‌భ‌లో విద్వేష ప్రసంగాలు, నేరాల నిరోధ బిల్లు -2026పై చ‌ర్చ సంద‌ర్భంగా ప్ర‌భుత్వంపై ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి నిప్పులు చెరిగారు.

శాంతి భ‌ద్ర‌తల ప‌రిర‌క్ష‌ణ పేరు మీద మీరు తీసుకొచ్చే బిల్లు ముఖ్యంగా ప్ర‌జాస్వామ్యం గొంతు నొక్కే ఆయుధంగా మారే ప్ర‌మాదం ఉంద‌ని భావిస్తున్నా. అస్ప‌ష్ట‌మైన నిర్వ‌చ‌నాలు, అప‌రిమిత‌మైన అధికారాలు ఉన్నాయి. అత్యంత ప్ర‌మాద‌క‌రంగా ఉంది. ఒక వ్య‌క్తి లేదా స‌మూహం దుర‌భిప్రాయం క‌లిగించిన‌ట్లు లేదా మాట్లాడిన‌ట్లు భావిస్తే అది నేర‌మ‌ని సెక్ష‌న్ 2(1) చెబుతుంది. అస్ప‌ష్ట‌మైన అంశాల‌తో మీరు ప్ర‌వేశ‌పెట్టే బిల్లు సామాన్యుల‌పై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న‌ట్టు ఉంది. రోడ్లు స‌రిగా లేవ‌ని, పాల‌న స‌రిగా లేద‌ని మంత్రి మీద‌నో ప్ర‌భుత్వం మీదనో సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తే.. ఆయ‌న‌ను అరెస్టు చేసే అధికారాలు ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతుంది అని ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి తెలిపారు.

ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తే, నిల‌దీస్తే హేట్ స్పీచ్‌గా భావిస్తున్నారు. పాల‌కుల త‌ప్పును ఎత్తిచూపినా.. హేట్ స్పీచ్ కింద మీరు తెచ్చే ప్ర‌మాదం స్ప‌ష్టంగా క‌న‌బ‌డుతుంది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ బిల్లును పెడుతున్నారు. రాజ్యాంగం క‌ల్పించిన భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌ను ఈ బిల్లు హ‌రించి వేస్తుంది. మ‌ర‌ణించిన వ్య‌క్తుల‌పై వ్యాఖ్య‌లు చేస్తే అరెస్టు చేస్తామ‌ని చెప్ప‌డం హాస్యాస్ప‌దం. రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ, వాజ‌పేయి.. ఇలా ఎవ‌రి మీద మాట్లాడిన హేట్ స్పీచ్ కింద ప‌రిగ‌ణించే ప్ర‌మాదం ఉంది. నిజాం పాల‌న బాగాలేద‌నో, ఆర్టిక‌ల్ రాసినా కూడా.. దాని మీద ఎవ‌రైనా ఫిర్యాదు చేస్తే ర‌చ‌యిత మీద కేసులు పెట్టి నాన్ బెయిల‌బుల్ సెక్ష‌న్ల కింద అరెస్టు చేసే అధికారాలు పోలీసులకు ఇస్తున్న‌ట్లు స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది అని ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి పేర్కొన్నారు.

సెక్ష‌న్ 3

ఈ చ‌ట్టంలోని సెక్ష‌న్ 3 కింద న‌మోదైన కేసులు నాన్ బెయిల‌బుల్ కేసులు. రాజ‌కీయ క‌క్ష సాధింపు కోసం అధికార పార్టీకి చెందిన వ్య‌క్తులు ఫిర్యాదు చేస్తే అరెస్టు చేసి జైల్లో పెడుతారు. నింద రుజువైనా, కాక‌పోయినా జైల్లో పెడుతారు. ఆయ‌న చేసిన త‌ప్పేందో తెల్వ‌కుండా.. నాన్ బెయిల‌బుల్ సెక్ష‌న్లు పెడుతున్నారు. శిక్ష ప‌డ‌క‌ముందే జైల్లో ఉండే ప్ర‌మాదం ఉంది. ఈ చ‌ట్టాన్ని పూర్తిగా వ్య‌తిరేకిస్తున్నాం. నేరం రుజువు కాక‌ముందే జైల్లో పెట్ట‌డం అంటే అన్యాయం కాక‌పోతే ఇంకేమైత‌ది.

సెక్ష‌న్ 4

సెక్ష‌న్ 4లో ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్‌కు అధికారులు ఇచ్చారు. ఒక వ్య‌క్తిని అరెస్టు చేస్తే.. శిక్ష ప‌డినా, ప‌డ‌క‌పోయినా మ‌ళ్లీ అనుమానంతో అరెస్టు చేసే అవ‌కాశం ఉంది. రౌడీషీట్ ఓపెన్ చేసిన‌ట్టుగా ఉంది. ముంద‌స్తు బెయిల్ ఉండ‌వు. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌ను నియంత్రించడానికి తీసుకున్నట్టు ఉంది. మీరు ఎప్పుడు అధికారంలో ఉండ‌రు. రేపు ఇటువైపు వ‌చ్చిన‌ప్పుడు మీరు కూడా త‌ప్పుబ‌ట్టే ప్ర‌మాదం ఉంది కాబ‌ట్టి ఆలోచించండి. ఈ బిల్లుపై హౌస్ క‌మిటీ వేయాలి. లేకుంటే అంద‌రితో సంప్ర‌దింపులు జ‌ర‌పాలి. సెల‌క్ష‌న్ క‌మిటీకి పంపాల‌ని కోరుతున్నాను. సెక్ష‌న్ 4 అనేది ప్ర‌జాస్వామ్యానికి డెత్ వారెంట్. ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేసే చ‌ట్టం ఇది. రిపీట్ అఫెండ‌ర్‌ అని చెప్పి.. అరెస్టు చేయ‌డం క‌క్ష సాధింపే క‌దా..? అని ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి నిల‌దీశారు.

సెక్ష‌న్ 5

ఈ సెక్ష‌న్ ప్ర‌కారం.. ఏదైన సంస్థ‌లో నేరం జ‌రిగితే.. ఆ సంస్థ స‌భ్యులంద‌రూ కూడా భాగస్వాములే. ఒక వ్య‌క్తి త‌ప్పు చేసినా.. స‌భ్యులంద‌రూ కూడా శిక్షార్హులే అని సెక్ష‌న్ 5 చెబుతుంది. ఒక వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ చేసిన త‌ప్పిదానికి అందులో ఉన్న స‌భ్యులంద‌రూ కూడా శిక్షార్హులే అన్న‌ట్టు ఉంది. ఈ చ‌ట్టం ప్ర‌జాస్వామ్యానికే ప్ర‌మాద‌క‌రం అని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు.

సెక్ష‌న్ 8

ఈ సెక్ష‌న్‌లో ప్రభుత్వ అధికారుల‌కు మాత్రం పూర్తి ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్నారు. వారేం చేసినా వారికి శిక్ష లేదు. సామాన్యుడు చేయ‌కున్నా అరెస్టు చేస్తారు. సామాన్యుడు శిక్షార్హుడు. ఈ చ‌ట్టాన్ని అధికార పార్టీ నేత‌లు మిస్‌యూజ్‌ చేసే అవ‌కాశం ఉంది అని ఆయ‌న పేర్కొన్నారు.

సోష‌ల్ మీడియాపై ఉక్కుపాదం మోపాల‌ని చూస్తున్నారు. స‌మాజంలో సామ‌ర‌స్యం పెంచ‌డానికి కాదు.. స‌మాజంలో భ‌యం పెంచ‌డానికి ఈ చ‌ట్టం తీసుకువ‌స్తున్నారు. ప్ర‌జ‌ల రక్ష‌ణ‌ కోసం ఉండాలి కానీ ప్ర‌జ‌ల గొంతు నెక్కేందుకు ఉండ‌కూడు. సెల‌క్ష‌న్ క‌మిటీకి పంపాల్సిందిగా కోరుతున్నాం. లేదంటే రివ్యూ చేసేందుకు హౌజ్ క‌మిటీ వేయాల‌ని కోరుతున్నామ‌ని ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement