Thummala Nageshwar Rao | బ్యాంకులు దీర్ఘకాలిక పెట్టుబడి రుణాలు అందించాలి: మంత్రి తుమ్మల
Thummala Nageshwar Rao | గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, ప్యాక్ హౌస్‌లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, డ్రిప్ ఇరిగేషన్, సోలార్ వ్యవసాయం, వ్యవసాయ యాంత్రీకరణ వంటి రంగాలకు బ్యాంకులు దీర్ఘకాలిక పెట్టుబడి రుణాలు అందించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బ్యాంకులు మరింత చురుకైన పాత్ర పోషించాలని కోరారు.
- గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో భాగం కావాలి
- వ్యవసాయ రుణాలను పంట రుణాలకే పరిమితం చేయొద్దు
- మౌలిక వసతులు, విలువ ఆధారిత వ్యవసాయానికి విస్తరించాలి
- 49వ ఎస్‌ఎల్‌బీసీ త్రైమాసిక సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Thummala Nageshwar Rao | త్రినేత్ర.న్యూస్: గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, ప్యాక్ హౌస్‌లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, డ్రిప్ ఇరిగేషన్, సోలార్ వ్యవసాయం, వ్యవసాయ యాంత్రీకరణ వంటి రంగాలకు బ్యాంకులు దీర్ఘకాలిక పెట్టుబడి రుణాలు అందించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. శుక్రవారం ప్రజాభవన్‌లో నిర్వహించిన 49వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) త్రైమాసిక సమావేశంలో బ్యాంకింగ్ సంస్థల ప్రతినిధులు, NABARD అధికారులు, సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ప్రతినిధులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బ్యాంకులు మరింత చురుకైన పాత్ర పోషించాలని కోరారు.
రాష్ట్రంలో 2025-26 ఆర్థిక సంవత్సరాంతానికి మొత్తం డిపాజిట్లు సుమారు రూ.9.43 లక్షల కోట్లకు, మొత్తం అడ్వాన్సులు రూ.12.33 లక్షల కోట్లకు చేరాయి. రాష్ట్ర క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తి 130.78 శాతంగా నమోదై జాతీయ సగటును మించి ఉంది. ప్రధాన రంగ రుణాలు రూ.4.09 లక్షల కోట్లు, వ్యవసాయ రుణాలు రూ.1.87 లక్షల కోట్లకు చేరడం సంతోషకరం. వ్యవసాయ రుణాల లక్ష్య సాధన 102 శాతం నమోదు కావడం అభినందనీయం అని మంత్రి కొనియాడారు.
రూ.75,486 కోట్లకు పంట రుణాల పంపిణీ..
2025-26 ఆర్థిక సంవత్సరంలో పంట రుణాల పంపిణీ రూ.75,486 కోట్లకు చేరింది. వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యంలో 84.34 శాతం సాధించింది. మొత్తం వ్యవసాయ, అనుబంధ రంగాలు, మౌలిక వసతుల కింద రూ.1,68,401 కోట్ల రుణాలు పంపిణీ చేసి 101.88 శాతం లక్ష్య సాధన నమోదు కావడం రాష్ట్ర బ్యాంకింగ్ వ్యవస్థ పురోగతిని సూచిస్తోంది. కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, TGCAB వంటి బ్యాంకులు లక్ష్యాలను మించి రుణాల పంపిణీ చేశాయి. మరికొన్ని బ్యాంకులు తమ పనితీరును మెరుగుపరచుకోవాలి అని తుమ్మల సూచించారు.
ఇప్పటికీ వ్యవసాయ రుణాల్లో అధిక భాగం స్వల్పకాలిక పంట రుణాలకే పరిమితమవడం ఆందోళన కలిగించే విషయం. తెలంగాణ వ్యవసాయం ఇప్పుడు ఉద్యానవనం, ఆయిల్ పామ్, సమగ్ర వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, రక్షిత సాగు, పాడి, మత్స్య, యాంత్రీకరణ వంటి రంగాల వైపు వేగంగా మారుతుంది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థ కూడా మారుతున్న అవసరాలకు అనుగుణంగా స్పందించాలి అని నాగేశ్వర్‌రావు కోరారు.
ఒకే దశలో రూ.21 వేల కోట్ల రుణమాఫీ..
రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల నిబద్ధతతో పనిచేస్తోంది. దాదాపు రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీని ఒకే దశలో అమలు చేసి దేశంలోనే చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దీని వల్ల బ్యాంకుల రికవరీలు మెరుగుపడటంతో పాటు గ్రామీణ రుణ సంస్కృతి పునరుద్ధరించబడింది. రైతులు రుణాల చెల్లింపులో క్రమశిక్షణ పాటిస్తున్నందున బ్యాంకులు పెట్టుబడి రుణాల మంజూరులో ఆలస్యం చేయొద్దు. వ్యవసాయ ఎన్‌పీఏలు 5.23 శాతం నుంచి 4.71 శాతానికి తగ్గడం, టర్మ్ లోన్ల ఎన్‌పీఏలు కేవలం 2.62 శాతం ఉండటం రైతుల నిబద్ధతకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణలో గత రెండు సంవత్సరాలుగా వరి, మొక్కజొన్న ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరిగింది. దీంతో నిల్వ సామర్థ్యం, గిడ్డంగులు, డ్రైయింగ్ యార్డులు, రవాణా, లాజిస్టిక్స్, శాస్త్రీయ పంట అనంతర నిర్వహణ వ్యవస్థలపై ఒత్తిడి పెరిగింది. రైతులు తక్కువ ధరలకు పంటలను విక్రయించాల్సిన పరిస్థితులు రాకుండా వేర్ హౌస్ రిసీప్ట్ ఫైనాన్స్, e-NWR ఫైనాన్స్, పంట అనంతర రుణాలను విస్తరించాలి. ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, సైలోలు, గ్రేడింగ్ యూనిట్లు, రిపెనింగ్ ఛాంబర్లు వంటి మౌలిక వసతులకు రుణాలు అందించాలి అని సూచించారు.
ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయల దిగుమతి..
రాష్ట్రంలో ఉద్యానవనం, ఆయిల్ పామ్, పసుపు, మామిడి వంటి పంటలకు అపార అవకాశాలు ఉన్నాయి. కేవలం 6 శాతం సాగుభూమిలోనే ఉద్యాన పంటలు సాగవుతున్నప్పటికీ, వ్యవసాయ స్థూల విలువలో వాటి వాటా 25 శాతం వరకు ఉంది. రాష్ట్రం ప్రతి సంవత్సరం సుమారు రూ.4500 కోట్ల విలువైన కూరగాయలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇది కోల్డ్ చైన్, నిల్వ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో భారీ అవకాశాలను సృష్టిస్తోంది. ఆయిల్ పామ్ సాగు ఇప్పటికే 2.91 లక్షల ఎకరాలకు విస్తరించి, దాదాపు 79 వేల మంది రైతులు సాగు చేస్తున్నారని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు వెయ్యి రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOs) కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, వీటికి బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి బలమైన ఆర్థిక మద్దతు అవసరమని మంత్రి పేర్కొన్నారు. ఇన్‌పుట్ షాపులు, నిల్వ గిడ్డంగులు, కస్టమ్ హైరింగ్ సెంటర్లు, డ్రోన్లు, బయో-ఇన్‌పుట్ రిసోర్స్ సెంటర్లు, వ్యవసాయ ప్రాసెసింగ్ యూనిట్లకు వర్కింగ్ క్యాపిటల్ అందించడం ద్వారా గ్రామీణ మౌలిక వసతులు బలోపేతం అవుతాయని తెలిపారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థలను వ్యవసాయ రంగంలో స్థిరమైన అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దాలని బ్యాంకులను కోరారు.
2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.147.91 కోట్ల బడ్జెట్..
వ్యవసాయ యాంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.147.91 కోట్ల బడ్జెట్ కేటాయించిందని మంత్రి తెలిపారు. ఈ పథకం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) విధానంలో అమలు అవుతుందని, రైతులకు నేరుగా ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బ్యాంకులు రైతులకు అవసరమైన అదనపు రుణ సహాయం అందించాలని కోరారు. కౌలు రైతులు సాగుభూమిలో దాదాపు 30 శాతం భాగాన్ని సాగు చేస్తున్నారని, వారికి సకాలంలో పంట రుణాలు అందించడం అత్యంత అవసరమని మంత్రి తెలిపారు. దీనివల్ల అధిక వడ్డీ ప్రైవేట్ అప్పులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని పేర్కొన్నారు. విత్తనాలు, ఎరువులు, యంత్రాలు వంటి వ్యవసాయ ఇన్‌పుట్ల కొనుగోలుకు సకాలంలో రుణాలు అందేలా బ్యాంకులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.
అందరూ కలిసి పని చేయాలి..
భవిష్యత్ వ్యవసాయ రుణాలు మైక్రో ఇరిగేషన్, సమగ్ర వ్యవసాయం, అగ్రో ఫారెస్ట్రీ, సోలార్ వ్యవసాయం, రక్షిత సాగు, వాతావరణ అనుకూల వ్యవసాయం వంటి రంగాలపై కేంద్రీకృతం కావాలని మంత్రి సూచించారు. తెలంగాణ దేశంలోనే అత్యంత సురక్షితమైన గ్రామీణ పెట్టుబడి వాతావరణాన్ని అందిస్తోందని, రైతుల చెల్లింపు క్రమశిక్షణ, తక్కువ ఎన్‌పీఏలు, ప్రభుత్వ బలమైన మద్దతు కారణంగా గ్రామీణ తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. వ్యవసాయ పెట్టుబడులు, గ్రామీణ మౌలిక వసతులు, ఫుడ్ ప్రాసెసింగ్, విలువ ఆధారిత వ్యవసాయం, గ్రామీణ పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణను జాతీయ ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని తుమ్మల పిలుపునిచ్చారు.
సంబంధిత వార్తలు

Mallu Bhatti Vikramarka | 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం: బ్యాంకర్ల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
మే 22, 2026

KTR | గల్ఫ్‌లో ఉన్నోళ్ల ఓట్లు పోనివ్వం.. ఎస్ఐఆర్పై సీఈసీని కలుస్తాం: కేటీఆర్
మే 22, 2026

Dialysis Patients | డయాలసిస్ పేషెంట్లకు అండగా ప్రభుత్వం.. 2,356 మందికి కొత్తగా పెన్షన్లు
మే 22, 2026
తాజావార్తలు
- ●Brahmotsavams | రేపటి నుంచి తిరుపతి గోవింద రాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.. 27న గరుడ సేవ
- ●Mallu Bhatti Vikramarka | 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం: బ్యాంకర్ల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
- ●RBI | ఆర్బీఐ భారీ డివిడెండ్.. కేంద్రానికి రూ.2.87 లక్షల కోట్లు చెల్లింపు..
- ●Suriya Jyothika | హీరో సూర్య కూతురి ఫొటోలు చూశారా - హీరోయిన్లకు మించిన అందం
- ●Portronics Vayu Nano | జేబులో ఇమిడే టైర్ ఇన్‌ఫ్లేటర్.. పోర్ట్రోనిక్స్ వాయు నానో లాంచ్..
- ●KTR | గల్ఫ్‌లో ఉన్నోళ్ల ఓట్లు పోనివ్వం.. ఎస్ఐఆర్పై సీఈసీని కలుస్తాం: కేటీఆర్

Brahmotsavams | రేపటి నుంచి తిరుపతి గోవింద రాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.. 27న గరుడ సేవ

Mallu Bhatti Vikramarka | 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం: బ్యాంకర్ల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

RBI | ఆర్బీఐ భారీ డివిడెండ్.. కేంద్రానికి రూ.2.87 లక్షల కోట్లు చెల్లింపు..

Suriya Jyothika | హీరో సూర్య కూతురి ఫొటోలు చూశారా - హీరోయిన్లకు మించిన అందం



