త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | గ‌ల్ఫ్‌లో ఉన్నోళ్ల ఓట్లు పోనివ్వం.. ఎస్ఐఆర్‌పై సీఈసీని క‌లుస్తాం: కేటీఆర్‌

KTR | జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ బిడ్డల ఓటు హక్కును కాపాడేందుకు పార్టీ తరఫున ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. జాతీయ ఎన్నికల సంఘాన్ని కలిసి తెలంగాణ ఎన్నారైల ఓటు హక్కును కాపాడేలా చూస్తామన్నారు.

S

Telangana | Published On May 22, 2026, 4.56 pm IST

KTR | గ‌ల్ఫ్‌లో ఉన్నోళ్ల ఓట్లు పోనివ్వం.. ఎస్ఐఆర్‌పై సీఈసీని క‌లుస్తాం: కేటీఆర్‌
Advertisement
  • పార్టీ తరఫున నియమించిన బూత్ లెవల్ ఏజెంట్ల సహకారంతో ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడుతాం
  • స‌భ్య‌త్వ న‌మోదును ప‌క‌డ్బందీగా చేప‌డ‌దాం
  • తెలంగాణ బిడ్డ‌లవి ఒక్క ఓటు కూడా పోనివ్వొద్దు
  • ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలతో బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

KTR | త్రినేత్ర‌.న్యూస్‌: జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ బిడ్డల ఓటు హక్కును కాపాడేందుకు పార్టీ తరఫున ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఓటర్ల ఓట్ల జాబితా సవరణ కోసం ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న SIR విషయంలో లక్షలాది మంది తెలంగాణ ఎన్ఆర్ఐల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నదని కేటీఆర్ అన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నివాసంలో శుక్ర‌వారం జరిగిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జుల‌ సమావేశంలో కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.

ఇప్పటికే వందలాది మంది ఎన్ఆర్ఐలు తమ స్థానిక శాసన సభ్యులకు, మాజీ శాసన సభ్యులకు ఫోన్లు చేసి ఆందోళన చెందుతున్న విషయాన్ని నాయ‌కులు కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన కేటీఆర్ ఈ విషయంలో జాతీయ ఎన్నికల సంఘాన్ని కలిసి తెలంగాణ ఎన్నారైల ఓటు హక్కును కాపాడేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి పార్టీ తరఫున ఓ సీనియర్ ప్రతినిధి, నాయకుల ప్రతినిధి బృందాన్ని, ఎమ్మెల్యేలు, ఎంపీల బృందాన్ని ఢిల్లీకి పంపనున్నట్లు కేటీఆర్ తెలిపారు.

బూత్ లెవ‌ల్ ఏజెంట్ల‌తో స‌మ‌న్వ‌యం..

త‌మకు కేటాయించిన బూత్ ల పరిధిలో గల్ఫ్ ఎన్ఆర్ఐల వివరాలు సేకరించి వారి ఓటు హక్కును ఎలక్షన్ కమిషన్ తొలగించకుండా సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌చార్జులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. దీంతో పాటు పార్టీ తరఫున ఎస్ఐఆర్ (SIR) కోసం నియమించిన బూత్ లెవెల్ ఏజెంట్లతో కూడా సమన్వయం చేసుకోవాలని కేటీఆర్ సూచించారు.

స‌భ్య‌త్వ న‌మోదును ప‌క‌డ్బందీగా చేప‌ట్టాలి..

పార్టీ పెట్టిన తొలినాళ్లలోనే జిల్లా పరిషత్ ను గెలుచుకొని భారత రాష్ట్ర సమితికి ఆది నుంచి నిజామాబాద్ జిల్లా ఒక బలమైన కోటగా నిలిచిందని కేటీఆర్ గుర్తు చేశారు. నిజామాబాద్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక అవకాశంగా తీసుకొని ముందుకు పోవాలన్నారు. కేసీఆర్ సూచించినట్లు సభ్యత్వ నమోదును కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. దీంతోపాటు ఎస్ఐఆర్ (SIR), స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని కూడా పకడ్బందీగా నిర్వహించి ఏ ఒక్క పౌరుడి ఓటు హక్కు తొలగించకుండా చూడాలన్నారు.

ఈ సంద‌ర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నేతలంతా తమ స్థానిక నియోజకవర్గాల్లో ఉన్న స్థితిగతులపై కేటీఆర్ కి వివరాలు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల‌, చేస్తున్న మోసాల వల్ల‌ అనేక వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని, తిరిగి కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని నేతలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, రానున్న ఎన్నికల నాటికి తిరిగి జిల్లాలో బీఆర్ఎస్‌ పూర్తిగా స్వీప్ చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తామని నేతలు తెలిపారు.

ఈ సమావేశంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జులు, పార్టీ సీనియర్ నేత సురేష్ రెడ్డితో పాటు జిల్లా సభ్యత్వ నమోదు ఇన్‌చార్జీగా నియమితులైన వి.జి. గౌడ్, జనరల్ సెక్రటరీ పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement