త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mallu Bhatti Vikramarka | 3 ట్రిలియ‌న్ల ఆర్థిక వ్వవ‌స్థే ల‌క్ష్యం: బ్యాంక‌ర్ల స‌మావేశంలో ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క

Mallu Bhatti Vikramarka | 20147 నాటికి తెలంగాణ 3 ట్రిలియ‌న్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా నిలిపేందుకు ప్ర‌జా ప్ర‌భుత్వం కృత‌నిశ్చ‌యంతో ప‌నిచేస్తోంద‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క పేర్కొన్నారు. సంక్షేమ ప‌థ‌కాలు, ఆర్థిక స్వావ‌లంబ‌న‌, ఫ్యూచ‌ర్ సిటీ నిర్మాణం, మ‌హిళా సాధికార‌త‌, మూసీ పున‌రుజ్జీవంపై తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌థ‌మ ప్రాధాన్య‌త‌ల‌ను ఇస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On May 22, 2026, 5.24 pm IST

Mallu Bhatti Vikramarka | 3 ట్రిలియ‌న్ల ఆర్థిక వ్వవ‌స్థే ల‌క్ష్యం: బ్యాంక‌ర్ల స‌మావేశంలో ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క
Advertisement
  • తెలంగాణ వృద్ధి రేటు 10.7 శాతం
  • దేశ స‌గ‌టు కంటే వేగంగా వృద్ధి  
  • ప‌ట్ట‌ణీక‌ర‌ణ‌తో సేవ‌ల రంగానికి భారీ అవ‌కాశాలు
  • విద్యార్థుల రుణాలు భ‌విష్య‌త్ పెట్టుబ‌డులు
  • వ‌డ్డీ లేని రుణాలను రూ.5 ల‌క్ష‌ల నుంచి రూ. 10 ల‌క్ష‌ల‌కు పెంపు
  • బ్యాంక‌ర్ల స‌మావేశంలో ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క

Mallu Bhatti Vikramarka |  త్రినేత్ర‌.న్యూస్‌: 20147 నాటికి తెలంగాణ 3 ట్రిలియ‌న్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా నిలిపేందుకు ప్ర‌జా ప్ర‌భుత్వం కృత‌నిశ్చ‌యంతో ప‌నిచేస్తోంద‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క పేర్కొన్నారు. సంక్షేమ ప‌థ‌కాలు, ఆర్థిక స్వావ‌లంబ‌న‌, ఫ్యూచ‌ర్ సిటీ నిర్మాణం, మ‌హిళా సాధికార‌త‌, మూసీ పున‌రుజ్జీవంపై తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌థ‌మ ప్రాధాన్య‌త‌ల‌ను ఇస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు. శుక్ర‌వారం మ‌హాత్మాజ్యోతి రావు ఫూలే ప్ర‌జాభ‌వ‌న్ లో జ‌రిగిన 49వ రాష్ట్ర‌స్థాయి బ్యాంకర్ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.

వ్య‌వ‌సాయం వెన్నెముక‌..

రాష్ట్రంలో బ్యాంకుల మొత్తం డిపాజిట్లు దాదాపు రూ.9.43 లక్షల కోట్లకు చేరుకోవడం, అడ్వాన్సులు రూ.12.34 లక్షల కోట్లకు చేరుకోవడం గొప్ప విష‌య‌మ‌ని చెప్పారు. రాష్ట్రం 130.78 శాతం క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తితో ముందుకు సాగ‌డం అద్వితీయమ‌న్నారు. వ్యవసాయ రుణాల విషయంలో లక్ష్యాలను మించి బ్యాంకులు రుణాలు ఇవ్వడం సంతోషకరమ‌ని చెప్పారు. రూ.1,65,297 కోట్ల లక్ష్యానికి గాను రూ.1,68,401 కోట్ల వ్యవసాయ రుణాలు పంపిణీ చేసి 101.88 శాతం సాధించ‌డం గ‌ర్వించ‌ద‌గ్గ విష‌యంగా చెప్పారు. వ్యవసాయం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతులు, పాడి రైతులు, మత్స్యకారులు, అనుబంధ రంగాలకు కిసాన్ క్రెడిట్ కార్డు సహా వివిధ పథకాల ద్వారా బ్యాంకులు అందిస్తున్న మద్దతు అభినంద‌నీయమ‌న్నారు.

అది భ‌విష్య‌త్ పెట్టుబ‌డి..

పారిశ్రామిక రంగంలో దేశంలోనే అత్యంత వేగ‌వంతంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ‌ ఒక‌టని డిప్యూటీ సీఎం చెప్పారు. ఈ నేప‌థ్యంలో బ్యాంకులు సూక్ష్మ, చిన్న‌త‌ర‌హా పరిశ్రమలు, మహిళ, దళిత, గిరిజన యువ పారిశ్రామికవేత్తలకు రుణాల పంపిణీపై బ్యాంకులు మరింత దృష్టి పెట్టాలని అన్నారు. విద్యార్థుల‌కు ఇచ్చే రుణాల విష‌యంలో బ్యాంకులు మ‌రింత సానుకూల దృక్ఫ‌థంతో ముందుకు రావాల‌న్నారు. విద్యార్థుల‌కు ఇచ్చే రుణాలు యువ‌త‌పై మ‌నం పెట్టే భ‌విష్య‌త్ పెట్టుబ‌డి అని ఆయ‌న చెప్పారు. సంక్షేమం-అభివృద్ధి రెండింటిని జోడెడ్లుగా ప‌రుగులు తీయ‌గ‌ల‌వ‌ని ప్ర‌జా ప్ర‌భుత్వం చేత‌ల్లో నిరూపించింద‌న్నారు. సమగ్రాభివృద్ధి, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, ఉపాధి సృష్టి పట్ల మా ప్రభుత్వం కట్టుబడి ఉందని మ‌రోసారి ఆయ‌న పున‌రుద్ఘాటించారు.

బీమా ప‌థ‌కాల ప‌రిధిలోకి తీసుకురావాలి..

నేడు ప్ర‌పంచ‌మంతా పున‌రుత్పాద‌క ఇంధ‌న‌రంగంపై దృష్టి సారిస్తోంద‌న్నారు. అందులో భాగంగా ప్ర‌జాప్ర‌భుత్వం కూడా సౌరశక్తి (Solar Power) విభాగంలో స్థిరమైన ప్రగతిని సాధిస్తోందని వివ‌రించారు. సౌరశక్తి ప్రాజెక్టులు, రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు, ఇతర పర్యావరణ అనుకూల కార్యక్రమాలకు బ్యాంకులు చురుగ్గా రుణ సహాయం అందించాలని ఉప ముఖ్య‌మంత్రి సూచించారు. సామాజిక భద్రత, బీమా పథకాల పరిధిలోకి రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను తీసుకురావాల‌న్నారు.

బ్యాంకులు కేవలం డబ్బు డిపాజిట్ చేసే, రుణాలు ఇచ్చే ఆర్థిక సంస్థలుగానే కాకుండా, రాష్ట్ర వ్యూహాత్మక అభివృద్ధి భాగస్వాములుగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ప్రజల డబ్బు అంతా బ్యాంకులకే చేరుతుంది, కాబట్టి ఆ నిధులను ఏ రంగాల అభివృద్ధికి రుణాలుగా ఇస్తున్నామనేది చాలా ముఖ్యం. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి (GSDP), ఉపాధికి ఏ రంగం ఎక్కువ దోహదపడుతుందో ఆలోచించి బ్యాంకులు వ్యూహాత్మకంగా రుణాలు అందించాలన్నారు.

త‌ల‌స‌రి ఆదాయంలో అగ్ర‌గామి..

ప్ర‌జాప్ర‌భుత్వం 2047 ఆర్థిక సంవత్సరం నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పెద్ద కల. తెలంగాణ ప్ర‌స్తుత వృద్ధి రేటు చూస్తుంటే ఇది సాధ్యమేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశ సగటు వృద్ధి రేటు 8.2% గా ఉంటే, తెలంగాణ వృద్ధి రేటు 10.7% తో దూసుకుపోతోందని చెప్పారు. దేశ సగటు తలసరి ఆదాయం రూ.2.1 లక్షలుగా ఉంటే, తెలంగాణ తలసరి ఆదాయం రూ.4.18 లక్షలతో దేశంలోనే అగ్రగామిగా ఉందని ఉప ముఖ్య‌మంత్రి గ‌ర్వంగా ప్ర‌క‌టించారు. తెలంగాణ ప్రజాప్ర‌భుత్వం మూసీ నది పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం అత్యంత వేగంగా పూర్తి చేయడంకూడా ప్ర‌ధాన ల‌క్ష్యాలుగా నిర్దేశించుకుని ముందుకు సాగుతోంద‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. తెలంగాణలో వేగంగా ప‌ట్ట‌ణీక‌ర‌ణ జ‌రుగుతోంద‌ని అన్నారు. ఈ నేప‌థ్యంలో సేవ‌ల రంగాని అధిక అవ‌కాశాలు ఉంటాయ‌ని ఆయన చెప్పారు

వ‌డ్డీలేని రుణాల పెంపు...

మ‌హిళా ఆర్థిక సాధికార‌త కోసం రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల వడ్డీ లేని రుణాలు రూ. 5 ల‌క్ష‌ల నుంచి రూ. 10 ల‌క్ష‌ల‌కు పెంచుతున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా చెప్పారు. ఈ సంవత్సరం హైదరాబాద్ నగరంలో మహిళా సంఘాలకు రుణ పంపిణీ యుద్ధప్రాతిపదికన దృష్టి సారించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. హైదరాబాద్ నగరం మహిళలకు వ్యాపార రంగంలో, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల్లో ఎదగడానికి ఎన్నో అవకాశాలను ఇస్తోందని చెప్పారు. నగరంలోని మురికివాడల్లోని యువ మహిళా పారిశ్రామికవేత్తలపై ప్రత్యేకంగా దృష్టి సారించాల‌న్నారు.

రాష్ట్రంలో త్వరలోనే అనేక ఇండస్ట్రియల్ హబ్‌లు, క్లస్టర్లను తీసుకువ‌స్తున్న‌ట్లు ఉప ముఖ్య‌మంత్రి వెల్లడించారు. ఇందులో భాగంగా ఫార్మా, ఫ్యాబ్ సిటీ, స్టీల్‌, లెద‌ర్, టెక్స్‌టైల్ వంటి వివిధ రంగాలను డిజైన్ చేస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యమని భ‌ట్టి విక్రమార్క చెప్పారు.

ఈ బ్యాంక‌ర్ల స‌మావేశంలో మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర రావు, స్పెష‌ల్ చీఫ్ సెక్రెట‌రీ దాన కిషోర్‌, ఫైనాన్స్ ప్రిన్సిప‌ల్ సెక్రెట‌రీ సందీప్ కుమార్ సుల్తానియా, ఫైనాన్స్ - ప్లానింగ్ సెక్రెట‌రీ గౌర‌వ్ ఉప్ప‌ల్‌, ఆర్బీఐ రీజ‌న‌ల్ డైరెక్ట‌ర్ చిన్మ‌య మోహ‌న్, ఎస్బీఐ సీజీఎం నీలేష్ ద్వివేది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement