త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Errolla Srinivas | కుంభం అనిల్ రెడ్డి, ఆంక్షా రెడ్డి, బీర్ల ఐలయ్య ఎస్సీలా?

Errolla Srinivas | మాజీ సీఎం కేసీఆర్ ఇంటి మీద‌కు దాడి చేయ‌డానికి వెళ్లింది ద‌ళితులు కాద‌ని.. కాంగ్రెస్‌ నాయ‌కులేన‌ని కార్పొరేష‌న్ మాజీ చైర్మ‌న్ ఎర్రోళ్ల శ్రీ‌నివాస్ స్ప‌ష్టం చేశారు. డ‌ప్పులు కొట్టింది కూడా ఓసీ, బీసీ నాయ‌కులేన‌న్నారు.

S

Telangana | Published On Sep 15, 2026, 5.15 pm IST

Errolla Srinivas | కుంభం అనిల్ రెడ్డి, ఆంక్షా రెడ్డి, బీర్ల ఐలయ్య ఎస్సీలా?
Advertisement
  • డప్పులు కొట్టింది ఓసీ, బీసీ నాయకులే
  • వారిని అడ్డుకుంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎలా పెడతారు?
  • చ‌ట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న‌ రేవంత్‌పైనే ఆ కేసు పెట్టాలి
  • మీడియా స‌మావేశంలో ఎర్రోళ్ల శ్రీ‌నివాస్ డిమాండ్‌

Errolla Srinivas | త్రినేత్ర‌.న్యూస్‌: మాజీ సీఎం కేసీఆర్ ఇంటి మీద‌కు దాడి చేయ‌డానికి వెళ్లింది ద‌ళితులు కాద‌ని.. కాంగ్రెస్‌ నాయ‌కులేన‌ని కార్పొరేష‌న్ మాజీ చైర్మ‌న్ ఎర్రోళ్ల శ్రీ‌నివాస్ స్ప‌ష్టం చేశారు. డ‌ప్పులు కొట్టింది కూడా ఓసీ, బీసీ నాయ‌కులేన‌న్నారు. కుంభం అనిల్‌రెడ్డి, ఆంక్షారెడ్డి, బీర్ల ఐల‌య్య‌లు ఎస్సీలా అని ప్ర‌శ్నించారు. వారిని అడ్డుకుంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలా పెడ‌తార‌ని నిల‌దీశారు. చ‌ట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న సీఎం రేవంత్‌పైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాల‌ని డిమాండ్ చేశారు. మంగ‌ళ‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడారు. రేవంత్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

త‌ప్పుడు కేసులు పెట్టినోళ్ల‌కు కూడా శిక్ష‌లున్న‌య్‌..

కేసీఆర్‌ను చంపడానికి సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేశారు. దళితులను ముందు పెట్టి రేవంత్ కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కేసీఆర్ ఇంటి మీదకు పోయారు.. దళితులు కాదు. అసెంబ్లీలో రేవంత్ అబద్దాలాడుతున్నారు. కేసీఆర్ మీద దాడికి దళితులు ఎందుకు వెళతారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సీఎం నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ ఇంటి మీద దాడిని అడ్డుకున్న వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలా పెడతారు? కేసీఆర్ ఇంటికి వెళ్లినవారు కాంగ్రెస్ జెండాలతో వెళ్ళారు. డప్పులు కొట్టినవారు ఓసీ, బీసీ నాయకులే. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసి ఎస్సీ, ఎస్టీలకు ద్రోహం చేస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టిన వారికి కూడా ఎస్సీ, ఎస్టీ యాక్ట్ లో శిక్షలు ఉన్నాయి.

చావు డప్పు నేర్చుకునేటపుడు ఇండ్లలో నేర్చుకోరు. సీఎంకు సంస్కృతి తెలియదు. బతికున్న వారికి చావు డప్పు కొట్టరు. బతికున్నప్పుడు చావు డప్పు కొట్టించిన అసలు కుట్రదారు సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. మా ఆత్మగౌరవాన్ని రేవంత్ అసెంబ్లీలో కించపరిచారు. కాంగ్రెస్ దళిత శాసన సభ్యులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. బీఆర్ఎస్ ను దళిత వ్యతిరేక పార్టీగా చిత్రీకరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి పెద్ద కుట్ర చేశారు.

జాతీయ ఎస్సీ క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేస్తం..

లోకల్ ఏసీపీ అక్రమ కేసులు పెడుతున్నారు. వివక్ష నుంచి విముక్తి చేయడానికి 1989లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తెచ్చారు. కేసీఆర్‌ను రేవంత్ రాజకీయంగా ఎదుర్కోవాలి. దళితులను అడ్డం పెట్టుకుని కాదు. అట్రాసిటీ యాక్ట్ దుర్వినియోగంపై నేషనల్ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం.

గజ్వెల్‌లో ఓ ఎస్సీ మహిళ బీసీ యువకుడిని పెళ్లి చేసుకుని మోసపోయి పిర్యాదు చేస్తే ఇంతవరకు న్యాయం జరగలేదు. ములుగు మండలంలో ఎస్సీ యువకుల మీద కుల వివక్ష దాడులు జరిగితే ఇప్పటివరకు చర్యలు లేవు. దళితుల మీద దాడులు జరుగుతుంటే కాంగ్రెస్ దళిత ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? కేసీఆర్ మీద కక్షతో బీఆర్ఎస్ మీద కక్షతో ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ను రేవంత్ దుర్వినియోగం చేస్తున్నారు. పహాడీ షరీఫ్ లో కొత్తగూడెం ప్రాంతానికి చెందిన ఎస్సీ మహిళను అత్యాచారం చేసి చంపితే ఈ ప్రభుత్వం ఇప్పటివరకు నిందితులను పట్టుకోలేదు. గద్వాల్లో కులాంతర వివాహం చేసుకుంటే కాంగ్రెస్ నాయకుడి ప్రోద్భలంతో ఇల్లు కూలగొట్టారు.

కేసీఆర్ ఇంటి మీద దాడిని అడ్డుకుంటే ఆగమేఘాల మీద అట్రాసిటీ కేసులు పెట్టిన రేవంత్ ప్రభుత్వం.. ఎస్సీలకు క్షేత్ర స్థాయిలో అన్యాయం జరుగుతుంటే పట్టించుకోవడం లేదు. రేవంత్‌కు దళితుల మీద ప్రేమ లేదు. కేసీఆర్ మీద కక్ష మాత్రమే ఉంది. దళితుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పని చేసే పార్టీ బీఆర్ఎస్. దళితుల కోసం కేసీఆర్ తెచ్చిన పథకాలన్నిటిని రేవంత్ నిర్వీర్యం చేశారు. ఎస్సీ ల మీద ప్రేమ ఉంటె సబ్ ప్లాన్ నిధులు ఎందుకు దారి మళ్లిస్తున్నారు. ద‌ళిత కార్డుతో అమాయకులను అరెస్ట్ చేయడం సమంజసం కాదు.

కాంగ్రెస్ వాళ్లు వ‌చ్చార‌నే శుద్ధి చేసి ఉండొచ్చు..

ప్రభుత్వం ఈ నేతిమాలిన చర్యలు మానాలి. కాంగ్రెస్ నాయకులకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు. అన్నిటిని బయట పెడతాం. దళితులు ఎవ్వరూ బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టలేదు. కాంగ్రెస్ నేతలు కేసులు పెడితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసులు పెడుతున్నారు. కాంగ్రెస్ నేతలు వచ్చారని శుద్ధి చేసి ఉండవచ్చు.. దళితులు వచ్చారని కాదు. దళిత కార్డు దుర్వినియోగం చేస్తే రేవంత్ మూల్యం చెలించుకోక తప్పదు అని ఎర్రోళ్ల హెచ్చ‌రించారు.

ఈ ప్రెస్ మీట్‌లో కార్పొరేషన్ మాజీ చైర్మన్ కిషన్ రావు, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభ ప్రద్ పటేల్, బీఆర్ఎస్ నేతలు మాణిక్యం, బొమ్మెర రామమూర్తి, ఫయాజ్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement