త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uttamkumar Reddy | స్మార్ట్ కార్డుల ప్ర‌య‌త్నాన్ని అభినందించండి.. కేంద్రం స‌న్న బియ్యానికి ఖ‌ర్చు భ‌రిస్తే మోదీ ఫొటో పెడ‌తాం

Uttamkumar Reddy | స్మార్ట్ కార్డు ఫొటోలపై రాజకీయ రాద్ధాంతాలు ఆపి అభినందించాల‌ని రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తే మోదీ ఫోటో పెట్ట‌డంపై ఆలోచిస్తామ‌న్నారు.

S

Telangana | Published On Aug 15, 2026, 6.10 pm IST

Uttamkumar Reddy | స్మార్ట్ కార్డుల ప్ర‌య‌త్నాన్ని అభినందించండి.. కేంద్రం స‌న్న బియ్యానికి ఖ‌ర్చు భ‌రిస్తే మోదీ ఫొటో పెడ‌తాం
Advertisement
  • రూ.14.9 వేల కోట్లు పెట్టి సన్న బియ్యం ఇస్తున్నాం
  • కేంద్ర ప్రభుత్వం దొడ్డు బియ్య‌మే పంపిస్తోంది
  • స‌న్న బియ్యం కోసం అద‌న‌పు ఖ‌ర్చును భ‌రిస్తున్నాం
  • సూర్యాపేట జెండావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttamkumar Reddy | త్రినేత్ర‌.న్యూస్: స్మార్ట్ కార్డు ఫొటోలపై రాజకీయ రాద్ధాంతాలు ఆపి అభినందించాల‌ని రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తే మోదీ ఫోటో పెట్ట‌డంపై ఆలోచిస్తామ‌న్నారు. 80వ స్వాతంత్య్ర వేడుక‌ల‌ సందర్భంగా సూర్యాపేటలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయ‌న పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.4 కోట్ల మంది ప్రజలకు స్మార్ట్ కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. కేంద్ర దొడ్డు బియ్యం ఇస్తుంద‌ని.. స‌న్న బియ్యం పంపిణీకి అయ్యే అద‌న‌పు ఖ‌ర్చును రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తోంద‌ని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం అందించే స్మార్ట్ కార్డుల విషయంలో రాజకీయ విమర్శలు చేయడం సరికాదు. రేషన్ వ్యవస్థలో మరింత పారదర్శకత తీసుకురావడానికే స్మార్ట్ కార్డుల విధానాన్ని అమలు చేస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో 2.16 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం. నిరుపేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని రాజకీయ కోణంలో చూడొద్దు. గతంలో అరకొరగా రేషన్ కార్డులు ఇచ్చిన వారు, అసలు సన్న బియ్యం ఇవ్వనివారు ఇప్పుడు స్మార్ట్ కార్డులపై వ్యాఖ్యలు చేస్తున్నారు అని మంత్రి విమర్శించారు.

ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని విమర్శించడం మానుకుని అభినందించాలని మంత్రి కోరారు. మీ పాలనలో మీ కార్డులల్లో మీ ఫొటోలు పెట్టుకోవద్దని మేం ఎక్కడా చెప్పడం లేదని స్పష్టం చేశారు. ప్రజలకు పారదర్శకంగా, సమర్థవంతంగా రేషన్ సరుకులు అందించడమే స్మార్ట్ కార్డుల పంపిణీ లక్ష్యమని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.14.9 వేల కోట్లను వెచ్చించి సన్న బియ్యం పంపిణీ చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం కేవలం దొడ్డు బియ్యం మాత్రమే ఇస్తుందని చెప్పారు. సన్న బియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అదనపు వ్యయాన్ని భరిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని గౌరవిస్తూ, ప్రోటోకాల్ ప్రకారం రేషన్ దుకాణాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటోను ఏర్పాటు చేస్తున్నామని, సన్న బియ్యం పంపిణీకి అయ్యే మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వం పూర్తిగా భరిస్తే అప్పుడు స్మార్ట్ కార్డులపై మోదీ ఫొటో పెట్టడంపై ఆలోచిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాల విషయంలో రాజకీయాలు, రాద్ధాంతాలు చేయడం మానుకోవాలని ఆయన సూచించారు. నిరుపేదలకు నాణ్యమైన సన్న బియ్యం అందించడం, రేషన్ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు.

Advertisement
Advertisement