త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | అమిత్ షా హైదరాబాద్ పర్యటన కాంగ్రెస్‌పై విమర్శలకే పరిమితం

Ponnam Prabhakar | కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికే అమిత్ షా పర్యటన పరిమితమైందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, విభజన హామీల అమలు, రాష్ట్రానికి కేంద్రం నుంచి అందుతున్న నిధులపై ఆయన ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

P

Telangana | Published On Nov 2, 2026, 6.49 pm IST

Ponnam Prabhakar | అమిత్ షా హైదరాబాద్ పర్యటన కాంగ్రెస్‌పై విమర్శలకే పరిమితం
Advertisement
  • తెలంగాణ విభజన హామీలపై ఎందుకు మాట్లాడలేదు?
  • హామీల‌పై చ‌ర్చించేందుకు బీజేపీ నాయ‌క‌త్వం సిద్ధ‌మేనా?
  • ఆరు గ్యారంటీల అమ‌లుపై బ‌హిరంగ చ‌ర్చ‌కు సై
  • మంత్రి పొన్నం ప్రభాకర్
  • అమిత్ షా ప‌ర్య‌ట‌న‌పై విమ‌ర్శ‌లు

Ponnam Prabhakar | కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికే అమిత్ షా పర్యటన పరిమితమైందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, విభజన హామీల అమలు, రాష్ట్రానికి కేంద్రం నుంచి అందుతున్న నిధులపై ఆయన ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తెలంగాణకు ఇచ్చిన హామీలపై చర్చించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం సిద్ధంగా ఉందా అని సవాల్ విసిరారు. కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారని పేర్కొన్నారు. సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉద్యోగ నియామకాలు సహా అనేక కార్యక్రమాలను ప్రజా ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు. తమ ఆరు గ్యారెంటీల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు.

ఓట్ల తొలగింపుపై సమాధానం చెప్పాలి

చొరబాటుదారులకు ఓటు హక్కు కల్పించడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని పొన్నం స్పష్టం చేశారు. అయితే కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షా హయాంలోనే అలాంటి పరిస్థితులకు అవకాశం ఎలా ఏర్పడిందో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లు తొలగించడంపైనే కాంగ్రెస్ ప్రశ్నిస్తోందన్నారు. విదేశీయుల ఓట్లు తొలగించామని చెబుతున్న కేంద్రం.. ఎంతమంది విదేశీయులను వారి దేశాలకు పంపించిందో ఆధారాలతో వెల్లడించాలని డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పదిసార్లు ఓటరు జాబితా సవరణ ప్రక్రియ చేపట్టిందని, అర్హత లేని ఓట్లను మాత్రమే తొలగించిందని గుర్తుచేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యాలయాల నుంచే ఓట్ల తొలగింపు దరఖాస్తులు పంపిణీ అవుతున్నాయన్న ఆరోపణలపై అమిత్ షా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. SIRపై పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్ చేశారు.

బీజేపీ హామీలపై చర్చకు సిద్ధమా?

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణను ఏటీఎంలా వాడుకుంటున్నారని ఆరోపించిన బీజేపీ నేతలు.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా అదే తరహా విమర్శలు చేస్తున్నారని పొన్నం అన్నారు. దేశంలో మోదీ, అమిత్ షా పాలనలో కొద్దిమంది పారిశ్రామికవేత్తల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. అంబానీ, అదానీలకు దేశ సంపదను కట్టబెడుతూ ధరల భారాన్ని సామాన్యులపై మోపుతున్నారని విమర్శించారు. రైతులకు నెలవారీ పింఛన్లు, ఉచిత విద్యుత్, ప్రతి కుటుంబానికి రూ.15 లక్షలు, ధరలను 30 శాతం తగ్గించడం, లీటర్ పెట్రోల్ రూ.50కే అందించడం వంటి హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేసిందా అని ప్రశ్నించారు. ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని చరిత్ర బీజేపీదని, ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేయడంలోనూ విఫలమైందని విమర్శించారు. తెలంగాణ నుంచి కేంద్రానికి ఎంత పన్ను రూపంలో ఆదాయం వెళ్తోంది? తిరిగి రాష్ట్రానికి ఎంత నిధులు ఇస్తున్నారో ప్రజలకు తెలుసునని పొన్నం అన్నారు. గతంలో తెలంగాణను ఏటీఎంగా అభివర్ణించిన బీజేపీ నేతలు.. ఇప్పుడు రాష్ట్రానికి న్యాయం చేయడంలో ఎందుకు విఫలమవుతున్నారని నిలదీశారు. ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం తక్షణమే సహాయం అందించాలని కోరారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ కాంగ్రెస్ బాధ్యత

రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రధాని నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాడుతోందని పొన్నం పేర్కొన్నారు. అమిత్ షా కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ర్యాలీ నిర్వహించడం మంచిదేనని వ్యాఖ్యానించారు. అయితే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. 12 ఏళ్లుగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీనే ప్రస్తుత పరిస్థితులకు బాధ్యత వహించాలని, ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. ఢిల్లీలో జరిగిన ర్యాలీకి కౌంటర్ ఇచ్చేందుకు అమిత్ షా హైదరాబాద్ వచ్చారని, ఢిల్లీలో ఎదుర్కొనే ధైర్యం లేకే ఇక్కడికి పరిమితమయ్యారని విమర్శించారు. హైదరాబాద్ పర్యటన విఫలమైందని, స్థానిక బీజేపీ నాయకత్వం రాసిచ్చిన స్క్రిప్ట్‌ను అమిత్ షా చదివారని ఎద్దేవా చేశారు. మణిపూర్‌లో హింస, అరుణాచల్ ప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులపై స్పందించకుండా గల్లీ రాజకీయాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రిగా దేశవ్యాప్త సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. నాడు కాంగ్రెస్ నాయకులు స్వాతంత్య్రం కోసం పోరాడారని, నేడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడటం తమ బాధ్యతని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

ట్యాగ్స్:

Amit ShahBJPCongress PartyHyderabad VisitPending PromisesPonnam PrabhakarRahul GandhiSIR ProcessTelangana PoliticsTelangana Reorganisation ActTelugu NewsVoter List Revision
Advertisement
Advertisement