త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Yuzvendra Chahal | చాహ‌ల్ సంచ‌ల‌నం.. ఆ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన లెగ్ స్పిన్న‌ర్‌..!

Yuzvendra Chahal | భారత స్టార్‌ లెగ్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు శుక్రవారం రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించాడు. రెడ్‌ బాల్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ.. అంతర్జాతీయ క్రికెట్‌కు మాత్రం గుడ్‌బై చెప్పలేదని స్పష్టం చేశాడు.

P

Sports | Published On Oct 2, 2026, 3.45 pm IST

Yuzvendra Chahal | చాహ‌ల్ సంచ‌ల‌నం.. ఆ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన లెగ్ స్పిన్న‌ర్‌..!
Advertisement

Yuzvendra Chahal | భారత స్టార్‌ లెగ్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు శుక్రవారం రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించాడు. రెడ్‌ బాల్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ.. అంతర్జాతీయ క్రికెట్‌కు మాత్రం గుడ్‌బై చెప్పలేదని స్పష్టం చేశాడు. వన్డే, టీ20 ఫార్మాట్లలో టీమిండియాకు మళ్లీ ప్రాతినిధ్యం వహించాలన్నదే తన లక్ష్యమని తెలిపాడు. తొలిసారి క్రికెట్‌ బంతిని పట్టుకున్నప్పుడు అది ఎర్ర బంతేనని చాహల్‌ గుర్తుచేసుకున్నాడు. తనకు పదేళ్ల వయసున్నప్పుడు రెడ్‌ బాల్‌తో మొదలైన ప్రయాణం.. ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించిందని పేర్కొన్నాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ తనకు కేవలం మరో ఫార్మాట్‌ కాదని.. సహనం, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం, వికెట్‌ కోసం గంటల తరబడి పోరాడే స్ఫూర్తిని ఈ ఫార్మాట్‌ నేర్పిందని చెప్పాడు.

లార్డ్స్‌లో చివరి మ్యాచ్‌..

చాహల్‌ తన చివరి ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ను లార్డ్స్‌ మైదానంలో నార్తాంప్టన్‌షైర్‌ తరఫున ఆడాడు. మిడిలెసెక్స్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. 2026-27 కౌంటీ ఛాంపియన్‌షిప్‌ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన చాహల్‌ 21 వికెట్లు తీశాడు. డర్హామ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. ఇందులో తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది. చాహల్‌ తన ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో మొత్తం 49 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 148 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 32.27 సగటుతో బౌలింగ్‌ చేసిన అతడి అత్యుత్తమ ప్రదర్శన 6/25. అయితే, చాహల్‌కు భారత టెస్టు జట్టులో చోటు దక్కలేదు. టెస్టు క్యాప్‌ అందుకోవాలన్నది తన చిరకాల కల అని.. అది నెరవేరకపోయినా రెడ్‌ బాల్‌ క్రికెట్‌లో తన ప్రయాణంపై సంతృప్తిగా ఉన్నానని తెలిపాడు.

ప్రయాణం ఇంకా ముగియలేదని..

ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా.. తన అంతర్జాతీయ కెరీర్‌ ఇంకా ముగియలేదని చాహల్‌ స్పష్టం చేశాడు. దేశం తరఫున ఆడాలన్న ఆకలి తనలో ఇంకా ఉందని తెలిపాడు. తనలో ఇంకా క్రికెట్‌ మిగిలే ఉందని.. వన్డే, టీ20ల్లో మరో అవకాశం కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు. తన క్రికెట్‌ ప్రయాణంలో అండగా నిలిచిన హర్యానా క్రికెట్ బోర్డుతో పాటు రణ్‌బీర్‌ సింగ్‌ మహీంద్రా, అనిరుధ్‌ సింగ్‌ చౌదరీలకు చాహల్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. పదేళ్ల వయసులో ఎర్ర బంతిని పట్టుకున్న చిన్నారి నుంచి లార్డ్స్‌లో చివరి ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడే స్థాయికి చేరుకోవడం అద్భుతమైన ప్రయాణమని పేర్కొన్నాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు చాహల్‌ వీడ్కోలు పలకడంతో ఇకపై కౌంటీ క్రికెట్‌లోనూ అతడిని రెడ్‌ బాల్‌తో చూడటం కుదరదు. ప‌రిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియాలోకి తిరిగి రావాల‌ని ఆశిస్తున్నాడు.

Advertisement
Advertisement