త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Asian Games 2026 | పర్వీన్‌ పంచ్‌కు పసిడి పతకం.. చైనీస్ తైపీ బాక్స‌ర్‌పై గెలుపు..

Asian Games 2026 | ఆసియా గేమ్స్‌లో భారత మహిళా బాక్సర్‌ పర్వీన్‌ సత్తా చాటింది. మహిళల 65 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో ఒలింపిక్‌ కాంస్య పతక విజేత, చైనీస్‌ తైపీకి చెందిన చెన్‌ నియన్‌-చిన్‌పై 3-2 స్ల్పిట్ డెసిషన్‌తో విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన పోరులో చివరి రౌండ్‌ కీలకంగా మారింది.

P

Sports | Published On Oct 2, 2026, 3.33 pm IST

Asian Games 2026 | పర్వీన్‌ పంచ్‌కు పసిడి పతకం.. చైనీస్ తైపీ బాక్స‌ర్‌పై గెలుపు..
Advertisement

Asian Games 2026 | ఆసియా గేమ్స్‌లో భారత మహిళా బాక్సర్‌ పర్వీన్‌ సత్తా చాటింది. మహిళల 65 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో ఒలింపిక్‌ కాంస్య పతక విజేత, చైనీస్‌ తైపీకి చెందిన చెన్‌ నియన్‌-చిన్‌పై 3-2 స్ల్పిట్ డెసిషన్‌తో విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన పోరులో చివరి రౌండ్‌ కీలకంగా మారింది. ఐదుగురు జడ్జిల్లో ముగ్గురు పర్వీన్‌కు అనుకూలంగా తీర్పునివ్వడంతో గోల్డ్ మెడ‌ల్ ద‌క్కింది. తొలి రౌండ్‌లో ఇద్ద‌రు బాక్స‌ర్లు ఆచితూచి ఆడుతూ వ‌చ్చారు. రిఫరీ నుంచి వార్నింగ్ రావడంతో పర్వీన్‌ దూకుడు పెంచింది. ప్రత్యర్థికి దగ్గరగా వెళ్లి వరుసగా స్ట్రెయిట్‌ జాబ్‌లు సంధించింది. చెన్‌ మాత్రం గార్డ్‌ను కిందికి ఉంచి కౌంటర్‌ పంచ్‌లతో బదులిచ్చేందుకు ప్రయత్నించింది. తొలి రౌండ్‌ను ఐదుగురు జడ్జిలూ పర్వీన్‌కే కేటాయించారు. దీంతో ఆమె 10-9 ఆధిక్యంలో నిలిచింది.

రెండో రౌండ్‌లో చెన్‌ పుంజుకుంది..

రెండో రౌండ్‌లోనూ పర్వీన్‌ మెరుగ్గా కనిపించినప్పటికీ.. ఐదుగురు జడ్జిలూ చెన్‌ నియన్‌-చిన్‌కు అనుకూలంగా స్కోర్‌ చేశారు. దీంతో చెన్‌ 10-9తో రౌండ్‌ను గెలిచి స్కోరును సమం చేసింది. ఫలితంగా చివరి మూడు నిమిషాలు అత్యంత కీలకంగా మారాయి. మూడో రౌండ్‌లో ఇరువురు పలుమార్లు క్లించ్‌లోకి వెళ్లారు. బయటకు వస్తూ పరస్పరం పంచ్‌లు విసిరారు. రౌండ్‌ సాగుతున్న కొద్దీ చెన్‌.. పర్వీన్‌ను వెనక్కి నెట్టే ప్రయత్నం చేసింది. పర్వీన్‌ మాత్రం తన దూరాన్ని కాపాడుకుంటూ జాబ్‌, క్రాస్‌లతో ప్రత్యర్థిని నిలువరించింది. మూడో రౌండ్‌లో ఇద్దరికీ జడ్జిల నుంచి మిశ్రమ స్కోర్ వ‌చ్చింది. ఐదుగురు జడ్జిల్లో ఇద్దరు చెన్‌కు 10-9 స్కోర్‌ ఇవ్వగా.. ముగ్గురు పర్వీన్‌కు 10-9 ఆధిక్యమిచ్చారు. దీంతో తుది ఫలితం 3-2గా పర్వీన్ ఆధిక్యంలోకి వ‌చ్చింది. స్ల్పిట్ డెసిష‌న్‌తో ప‌ర్వీన్ గోల్డ్ మెడ‌ల్‌ను నెగ్గింది.

భార‌త్ ఖాతాలో 13 స్వ‌ర్ణాలు..

మ్యాచ్ ముగిసిన త‌ర్వాత రింగ్‌లో ఆసక్తికర దృశ్యం కనిపించింది. పర్వీన్‌ను చెన్‌ నియన్‌-చిన్‌ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంది. అంతేకాకుండా ఆమెను ఎత్తుకుని సంబరాలు జ‌రిపింది. రింగ్‌లో స్వర్ణం కోసం తీవ్రంగా పోరాడిన ఇద్దరు బాక్సర్లు.. మ్యాచ్‌ ముగిసిన వెంటనే పరస్పరం అభినందించుకోవడం ఆకట్టుకుంది. చెన్‌ చూపించిన క్రీడాస్ఫూర్తి ప్రత్యేకంగా నిలిచింది. ప‌ర్వీన్ సాధించిన గోల్డ్‌తో ఆసియా గేమ్స్‌లో భార‌త జ‌ట్టు ఖాతాలో 13 స్వ‌ర్ణాలు చేరాయి. బాక్సింగ్‌లో ఇది భారత్‌కు రెండో స్వర్ణం. అంతకుముందు మహిళల 75 కేజీల విభాగంలో లవ్లీనా బోర్గొహెయిన్‌ స్వర్ణం గెలిచింది. పర్వీన్‌ పసిడి పతకంతో భారత్‌ మొత్తం పతకాల సంఖ్య 73కు చేరింది.

Advertisement
Advertisement