త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Musi Rejuvenation Project | మూసీ పున‌రుజ్జీవ ప్రాజెక్టుకు అప్పుగా రూ.7345 కోట్లు.. డీపీఆర్ లేకుండానే ముందుకు!

Musi Rejuvenation Project | కాంగ్రెస్ స‌ర్కార్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్ట‌నున్న మూసీ పున‌రుజ్జీవ‌న ప్రాజెక్టుకు (Musi Rejuvenation Project) ముంద‌డుగు ప‌డింది. తొలిద‌శ‌లో రూ.7055 కోట్ల‌తో ప్రాజెక్టు ప‌నుల‌ను ఆగ‌స్టు నాటికి ప్రారంభించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

G

Telangana | Published On May 14, 2026, 8.48 am IST

Musi Rejuvenation Project | మూసీ పున‌రుజ్జీవ ప్రాజెక్టుకు అప్పుగా రూ.7345 కోట్లు.. డీపీఆర్ లేకుండానే ముందుకు!
Advertisement

Musi Rejuvenation Project | త్రినేత్ర‌.న్యూస్‌: కాంగ్రెస్ స‌ర్కార్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్ట‌నున్న మూసీ పున‌రుజ్జీవ‌న ప్రాజెక్టుకు (Musi Rejuvenation Project) ముంద‌డుగు ప‌డింది. తొలిద‌శ‌లో రూ.7055 కోట్ల‌తో ప్రాజెక్టు ప‌నుల‌ను ఆగ‌స్టు నాటికి ప్రారంభించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. నిర్మాణాల‌పై ప్ర‌భావం లేని 5 కిలోమీట‌ర్ల మే ప‌నులు ప్రారంభించాల‌ని అధికారుల‌ను ఆదేశించింది. ఇందులో భాగంగా తొలిద‌శ‌లో చేప‌ట్టే ప‌నుల‌కు అవ‌స‌ర‌మైన నిధుల‌ను అందించేందుకు ఏషియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంకు (ADB) ముందుకు వ‌చ్చింది. మొత్తం రూ.4100 కోట్ల రుణం ఇచ్చేందుకు స‌మ్మ‌తించింది. ఇప్ప‌టికే చ‌ర్చ‌లు పూర్తిచేసిన మూసీ రివ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (MRDCL) అధికారులు, ఏడీబీతో ఒప్పందం చేసుకున్నారు. మ‌రో రూ.2845.12 కోట్లు ప్ర‌భుత్వం నుంచి గ్రాంటుగా సేక‌రించాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు నిధులు మంజూరుచేయాల‌ని ప్ర‌భుత్వాన్ని అభ్య‌ర్థించింది.

మొద‌టి ద‌శ‌లో భాగంగా ఫేజ్‌-1లో 21 కిలోమీట‌ర్ల మేర మూసీ సుంద‌రీక‌ర‌ణ చేప‌ట్ట‌నున్నారు. జోన్ 1ఏలో హిమాయ‌త్‌సాగ‌ర్ నుంచి గాంధీ స‌రోవ‌ర్ వ‌ర‌కు 9.2 కి.మీ., జోన్ 1బీలో ఉస్మాన్ సాగ‌ర్ నుంచి గాంధీ స‌రోవ‌ర్ వ‌ర‌కు 11.8 కి.మీ. అభివృద్ధి ప‌నులు జ‌రుగ‌నున్నాయి.

జోన్ 1ఏ ప‌నుల‌కు అంచ‌నా వ్య‌యం రూ.3104 కోట్లు గా నిర్ధారించారు. దీనికి వ‌డ్డీ రూ.128 కోట్ల‌తో క‌లుపుకుని రూ.3232.01 కోట్లు కానుంది. అదేవిధంగాజ జోన్‌1బీలో ప‌నుల‌కు రూ.3950 కోట్లు వ్య‌యం అవుతుంద‌ని లెక్క‌గ‌ట్టారు. వ‌డ్డీ రూ.163.11కోట్ల‌తో మొత్తం వ్య‌యం రూ.4113.11 కోట్లు అవుతుంద‌ని అంచ‌నా వేశారు. మొత్తంగా రూ.7345.12 కోట్ల నిధుల‌ను స‌మీక‌రించాల‌ని పేర్కొన్నారు. ఇందులో రూ.4500 కోట్లు ఇచ్చేందుకు ఏడీబీ ముందుకురాగా, మిగిలిన మొత్తం రూ.2845.12 కోట్లు ప్ర‌భుత్వం గ్రాంట్ల రూపంలో చెల్లించ‌నుంది.

కాగా, హిమాయ‌త్‌సాగ‌ర్, ఉస్మాన్ సాగ‌ర్ నుంచి బాపు ఘాట్ వ‌ర‌కు 21 కిలోమీట‌ర్ల ప‌రిధిలో మొద‌టి ద‌శ ప‌నులను ప్ర‌భుత్వం చేప‌ట్ట‌నుంది. అయితే ఇందులో ఎలాంటి ఆవాసాలు లేని తొలి 5 కి.మీ. ప‌నులును త‌క్ష‌ణ‌మే ప్రారంభించాల‌ని నిర్ణ‌యించింది. ఆగ‌స్టు నాటికి అన్ని అనుమ‌తులు పూర్తిచేసి ప‌నుల‌ను ప్రారంభించాల‌ని, 2027 డిసెంబ‌ర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా నిర్దేశించుకున్న‌ది.

డీపీఆర్ లేకుండానే మూసీపై ముందుకు

అయితే ఆగ‌స్టు నాటికి ప‌నులు ప్రారంభించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న ప్ర‌భుత్వం ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు బ‌హిర్గతం చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మూసీ పున‌రుజ్జీవ ప్రాజెక్టుపై ప్ర‌భుత్వం నియ‌మించిన మంత్రివ‌ర్గ ఉప‌సంఘానికి ఎంఆర్‌డీసీఎల్ అధికారులు ఈ నెల 8న‌ డీపీఆర్‌ను స‌మ‌ర్పించారు. అయిన‌ప్ప‌టికీ దానిని ప్ర‌జ‌ల ముందు ఉంచ‌కుండానే నిర్మాణానికి అవ‌స‌ర‌మైన నిధుల‌ను స‌మ‌కూర్చుకుంటున్న‌ది. డీపీఆర్ ఇవ్వ‌డానికి 18 నెల‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని జ‌న‌వ‌రిలో జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

అయితే బ‌డ్జెట్ స‌మావేశాల్లో మాత్రం మూసీ ప్రాజెక్టు మొద‌టి ద‌శ‌కు సంబంధించిన డీపీఆర్ సిద్ధ‌మైంద‌ని, రూ.6,500 కోట్ల నుంచి రూ.7000 కోట్లు అవుతుంద‌ని అంచ‌నా వేసిన‌ట్లుగా మంత్రి శ్రీధ‌ర్ బాబు స‌భ‌లో వెల్ల‌డించారు. కాగా, డీటేయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు రాకముందే 10,017 ఇండ్ల కూల్చివేత‌కు ప్ర‌భుత్వం ఇప్ప‌టికే నోటీసులు జారీచేసింది. ఈ నేప‌థ్యంలో ప్రాజెక్టు మొద‌టి ద‌శ‌కు నిధులు స‌మ‌కూర్చుకుంటున్న కాంగ్రెస్ స‌ర్కార్ ప్ర‌జ‌ల సందేహాల‌ను నివృతి చేయాల్సి ఉన్న‌ది. అస‌లు మూసీ అభివృద్ధికి ఎన్ని నిధుల‌ను వెచ్చించ‌నున్న‌ది, ఎన్ని ద‌శ‌ల్లో ప‌నుల‌ను చేప‌ట్ట‌నుంది, ప్ర‌భావిత‌మ‌య్యే ఇండ్ల సంఖ్య ఎంత, ఎన్ని ఎక‌రాల‌ను సేక‌రిస్తారు, నిధుల‌ను ఏవిధంగా స‌మీక‌రించుకోనుంది వంటి అంశాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల్సి ఉంది.

న‌ది వెంట హ‌ద్దు రాళ్లు..

మ‌రోవైపు, మూసీ పున‌రుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా నది వెంట హద్దు రాళ్లు ఏర్పాటు చేసే పనిని అధికారులు ప్రారంభించారు. గండిపేట జలాశయం దిగువ నుంచి బాపూఘాట్‌ వరకు మూసీ నది, బఫర్‌ జోన్‌లను రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖలు గతంలోనే నిర్ధారించాయి. దాని ప్రకారం ఎంఆర్‌డీసీఎల్‌ అధికారులు.. గండిపేట నుంచి నార్సింగి గోశాల వరకు సర్వే చేసి హద్దురాళ్లను ఏర్పాటు చేశారు. ఇటు మూసీతోపాటు అటు ఈసీ నదికి కూడా హిమాయత్‌ సాగర్‌ నుంచి రెండూ సంగమించే బాపూఘాట్‌ వరకు హద్దులు ఏర్పాటు చేయనున్నారు.

ఇటీవ‌ల వ‌చ్చిన వ‌ర‌ద‌ల‌తో మూసీ ఉప్పొంగింది. దీంతో న‌ది వెంట ఉన్న‌ చాలా కాలనీలు, ఇళ్లు నీట మునిగాయి. ఈనేప‌థ్యంలో సర్వే చేసిన ప్ర‌భుత్వం నది గర్భం, బఫర్‌ జోన్‌లను మార్కింగ్‌ చేసింది. తర్వాత పూర్తిస్థాయిలో సర్వే చేసి ఎఫ్‌టీఎల్‌ హద్దు రాళ్లను ఏర్పాటు చేస్తామని అధికారులు అప్పట్లో ప్రకటించారు. హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు, సర్వేయర్లు చేపట్టిన సుదీర్ఘ కసరత్తు ఇటీవలే పూర్తయింది. ఎఫ్‌టీఎల్‌ తర్వాత 50 మీటర్ల వరకు బఫర్‌జోన్‌గా ఖరారు చేసి, హద్దురాళ్లు ఏర్పాటు చేస్తున్నారు.

Advertisement
Advertisement