త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ACB’s Sensational Report on Irregularities at NIMS | నిమ్స్ అక్రమాలపై ఏసీబీ సంచలన నివేదిక.. రూ.5 కోట్ల విలువైన ఇంప్లాంట్ల నిల్వల గుర్తింపు

ACB's Sensational Report on Irregularities at NIMS | హైదరాబాద్‌లోని నిమ్స్ (NIMS) ఆసుపత్రిలో పలు అవకతవకలు జరిగినట్లు ఏసీబీ అధికారులు (ACB Officers) పేర్కొన్నారు.

S

Telangana | Published On Nov 23, 2026, 6.55 pm IST

ACB’s Sensational Report on Irregularities at NIMS | నిమ్స్ అక్రమాలపై ఏసీబీ సంచలన నివేదిక.. రూ.5 కోట్ల విలువైన ఇంప్లాంట్ల నిల్వల గుర్తింపు
Advertisement
  • మానవ వనరుల నియామకాల నుంచి వైద్య బిల్లుల వరకు అన్ని అక్రమాలే

ACB's Sensational Report on Irregularities at NIMS | త్రినేత్ర న్యూస్: హైదరాబాద్‌లోని నిమ్స్ (NIMS) ఆసుపత్రిలో పలు అవకతవకలు జరిగినట్లు ఏసీబీ అధికారులు (ACB Officers) పేర్కొన్నారు. ఐదు ఆపరేషన్ థియేటర్లను తనిఖీ చేసిన అధికారులు, వాటి సమీపంలోని అల్మారాలు, స్టోర్ గదుల్లో సుమారు రూ.5 కోట్ల విలువైన ఇంప్లాంట్లు, ఇతర వైద్య సామగ్రిని ప్రైవేట్ విక్రేతలు అనుమతి లేకుండా నిల్వ చేసినట్లు గుర్తించారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ప్రధాన స్టోర్‌కు ఇండెంట్ పెట్టకుండానే నేరుగా విక్రేతల నుంచి ఇంప్లాంట్లు తీసుకుంటున్నట్లు గుర్తించారు. ఏసీబీతో పాటు టీజీ సేఫ్ (ఫుడ్ సేఫ్టీ), డ్రగ్ కంట్రోల్ శాఖ, కార్మిక శాఖ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలు గ‌త అక్టోబర్ 29, నవంబర్ 2 తేదీల్లో నిమ్స్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించ‌గా ఆ వివ‌రాల‌ను సోమ‌వారం వెల్ల‌డించారు.

మానవ వనరుల నియామకాల్లో ఉల్లంఘనలు

2019 నుంచి 2025 వరకు మానవ వనరుల సేవలకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తి కాకుండానే కొనసాగినట్లు గుర్తించారు. కార్మికుల నియామకాలు, వారిని సెమీ స్కిల్డ్ కేటగిరీకి మార్చడంలో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు, నియామకాల్లో కుమ్మక్కు వ్యవహారాలకు అవకాశం ఉన్నట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది.

నిమ్స్ ప్రధాన క్యాంటీన్‌లో అపరిశుభ్ర వాతావరణం, గడువు ముగిసిన ఆహార పదార్థాలు గుర్తించారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ రిజిస్ట్రేషన్ లేకుండానే క్యాంటీన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్మిక చట్టాల ఉల్లంఘనలతో పాటు క్యాంటీన్ టెండర్లలో పోటీ వ్యతిరేక విధానాలు, బిడ్డర్ల మధ్య కుమ్మక్కు జరిగినట్లు ప్రాథమిక పరిశీలనలో అనుమానాలు వ్యక్తమయ్యాయి.

మెడికల్ షాపులు.. సెక్యూరిటీ టెండర్లలో జాప్యం

ఆసుపత్రిలోని మెడికల్ షాపులు తప్పనిసరిగా నిర్వహించాల్సిన అమ్మకాల రికార్డులను నమోదు చేయడం లేదని, రిజిస్ట్రేషన్ లేని సిబ్బందిని నియమించుకున్నట్లు గుర్తించారు. మెడికల్ షాపుల కేటాయింపు టెండర్ ప్రక్రియను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. భద్రతా సిబ్బంది సేవలకు సంబంధించిన టెండర్ల ఖరారులో అసాధారణ జాప్యం, ఒప్పందాల పొడిగింపులు జరిగినట్లు గుర్తించారు. డిఫాల్ట్ అయిన ఏజెన్సీకి చెందిన రూ.28.13 లక్షల బ్యాంకు గ్యారెంటీని కూడా జప్తు చేయలేదని ఏసీబీ వెల్లడించింది.

ఇంప్లాంట్ల వినియోగం అనంతరం యుటిలిటీ సర్టిఫికెట్లు జారీ చేసి, విక్రేతల ఇన్వాయిస్‌ల ఆధారంగా బిల్లులు ప్రాసెస్ చేస్తున్నట్లు ఏసీబీ పేర్కొంది. వినియోగించని ఇంప్లాంట్లకు కూడా యుటిలిటీ సర్టిఫికెట్లు సృష్టించి బిల్లులు పొందే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.

డిశ్చార్జ్ అయిన తర్వాతే బిల్లులు

రోగులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా పలు సందర్భాల్లో బిల్లులు ప్రాసెస్ చేసినట్లు గుర్తించారు. ముఖ్యంగా ప్రభుత్వ చెల్లింపులు జరిగే ఆరోగ్యశ్రీ పథకం రోగుల బిల్లుల్లో ఈ విధమైన అక్రమాలు జరిగినట్లు పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో రోగులు మరణించిన మూడు నెలల తర్వాత కూడా బిల్లులు ప్రాసెస్ చేసినట్లు వెల్లడించారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రోగుల డిశ్చార్జ్ అనంతరం సుమారు రూ.66 లక్షల విలువైన బిల్లులు నమోదు చేసినట్లు ఏసీబీ తెలిపింది.

సర్జికల్ వస్తువుల వినియోగంలో భారీ తేడాలు

శస్త్రచికిత్సలకు ఉపయోగించే వస్తువుల వినియోగం అసాధారణంగా అధికంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒకే రోగికి ఒక వారంలో 800 గ్లౌజులు వినియోగించినట్లు రికార్డుల్లో నమోదైందని వెల్లడించారు. ఈ అవకతవకల్లో ఎక్కువ భాగం ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పొందిన రోగులకు సంబంధించినవిగా ఉన్నట్లు పేర్కొన్నారు.

రికార్డులు స్వాధీనం..

తనిఖీల సందర్భంగా నోట్ ఫైళ్లు, ఒప్పంద పత్రాలు, ఇతర సంబంధిత రికార్డులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుర్తించిన అవకతవకలపై మరింత లోతుగా పరిశీలించి, ఆరోపణలను నిర్ధారించేందుకు తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు వెల్ల‌డించారు.

Advertisement
Advertisement