Aadi Srinivas | సాగులో మార్పులతోనే రైతుకు లాభం
Aadi Srinivas | రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం వ్యవసాయ రంగంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రైతు పండించిన ప్రతి గింజకు మద్దతు ధర కల్పించడంతోపాటు, పెట్టుబడి భారాన్ని తగ్గించి ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు.
- ప్రతి గింజకు మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
- సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నం
- 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశాం
- కిసాన్ మేళాలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Aadi Srinivas | రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం వ్యవసాయ రంగంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రైతు పండించిన ప్రతి గింజకు మద్దతు ధర కల్పించడంతోపాటు, పెట్టుబడి భారాన్ని తగ్గించి ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా వాణిజ్య, ఉద్యాన పంటల సాగు చేపట్టి అధిక ఆదాయం పొందాలని రైతులకు పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని బాబు జగ్జీవన్‌రామ్ వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ శాఖ, ఆత్మ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కిసాన్ మేళాలో ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గితేతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి మేళాను ప్రారంభించారు. అనంతరం వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి వ్యవసాయంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతికత, యంత్రాలు, పథకాల గురించి తెలుసుకున్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగుతో విజయాలు సాధిస్తున్న ఆదర్శ రైతులతో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు. వారిని సన్మానించి అభినందించారు.
రైతు సంక్షేమానికి భారీగా నిధులు

ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తోందన్నారు. సన్న వడ్ల సాగును ప్రోత్సహించేందుకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నామని తెలిపారు. రూ.20,650 కోట్లతో 25 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు ఏకకాలంలో రుణమాఫీ చేసినట్లు గుర్తుచేశారు. గతంలో నిలిచిపోయిన వ్యవసాయ సబ్సిడీలను పునరుద్ధరిస్తూ 37 రకాల వ్యవసాయ పరికరాలను రైతులకు అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. మూడేళ్ల బడ్జెట్‌లో రైతు సంబంధిత కార్యక్రమాలకు సుమారు రూ.1.10 లక్షల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
నీటి లభ్యతను బట్టి పంటల ప్రణాళిక

ప్రస్తుత ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆది శ్రీనివాస్ సూచించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయని, అందుబాటులో ఉన్న నీటి వనరులకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని అన్నారు. తాగునీటికి ప్రాధాన్యమిస్తూనే సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. వరితోపాటు ఆయిల్‌పామ్, మిర్చి, కూరగాయలు, పూల సాగు వంటి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రతి గ్రామం నుంచి నలుగురు ఆదర్శ రైతులు ముందుకొచ్చి నూతన పద్ధతుల్లో సాగు చేపడితే వారిని చూసి మరింత మంది రైతులు ఆ దిశగా అడుగులు వేస్తారని అన్నారు. ఆయిల్‌పామ్ సాగుతోపాటు అంతర పంటలు వేసుకోవడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. ధాన్యం శుద్ధి కోసం సింగిల్ విండో, ఐకేపీ కేంద్రాల ద్వారా ఆధునిక ప్యాడీ క్లీనర్ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ధాన్యాన్ని శుభ్రపరిచి విక్రయించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందన్నారు.
ఆధునిక సాగు విధానాలపై అవగాహన కల్పించాలి

నకిలీ విత్తనాల నియంత్రణ, రైతులకు సకాలంలో ఎరువుల సరఫరా కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, పొలాస పరిశోధనా కేంద్రం ప్రతినిధులు, వ్యవసాయ కళాశాల విద్యార్థులు క్షేత్రస్థాయిలో రైతులతో మమేకమై ఆధునిక సాగు విధానాలపై అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయంతోపాటు పాడి పరిశ్రమ, పశుసంపద, మత్స్య, ఉద్యానవన రంగాలను అభివృద్ధి చేసుకుంటే రైతు కుటుంబాలకు ఏడాది పొడవునా ఆదాయ మార్గాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. భూసార పరిరక్షణపై రైతులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వరి కొయ్యలను కాల్చకుండా పొలంలోనే సేంద్రియ ఎరువులుగా మార్చుకోవాలని సూచించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి శాస్త్రవేత్తల సలహాల మేరకు నానో, సేంద్రియ ఎరువులను వినియోగించాలన్నారు. రైతు సంక్షేమంతోపాటు ఆరు గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన : కలెక్టర్

జిల్లా కలెక్టర్, ఆత్మ చైర్‌పర్సన్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు కిసాన్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దాదాపు 40 స్టాళ్లలో వివిధ శాఖల పథకాలు, నూతన విత్తనాలు, డ్రోన్ టెక్నాలజీ, ఆధునిక యంత్రాలు, సేవలను ప్రదర్శించినట్లు వివరించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతు వేదికలు, గ్రామసభల ద్వారా ముందస్తు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తున్న రైతుల క్షేత్రాలను పరిశీలిస్తూ వారిని ఇతర రైతులకు ఆదర్శంగా పరిచయం చేస్తున్నామన్నారు. నీటి వసతి ఉన్న రైతులు ఆయిల్‌పామ్ సాగు చేపట్టాలని, మొక్కలు, డ్రిప్ ఇరిగేషన్‌కు సబ్సిడీ అందిస్తున్నామని పేర్కొన్నారు. అంతర పంటల ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని, మార్కెటింగ్ పరంగానూ ఇబ్బందులు లేవని తెలిపారు. జల సంరక్షణలో భాగంగా పామ్‌పాండ్లు, బోర్‌వెల్ రీచార్జ్ పనులు చేపట్టాలని సూచించారు.
రైతులకు మేళాలు మంచి వేదికలు : ఎస్పీ మహేశ్

ఎస్పీ మహేశ్ బీ గితే మాట్లాడుతూ.. వ్యవసాయ విద్యను అభ్యసించిన తనకు వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలపై అవగాహన ఉందన్నారు. ఆదర్శ రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల అనుభవాలు, ఆధునిక సాంకేతికతను తెలుసుకునేందుకు కిసాన్ మేళాలు మంచి వేదికలని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కూరగాయలు, పండ్లు, పూల సాగు చేపట్టాలని సూచించారు. రైతులు ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, రుణాల పేరుతో జరిగే మోసాల విషయంలో జాగ్రత్త వహించాలని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు సూపర్ ఎల్‌నినో ప్రభావం, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటల రూపంలో వివరించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ఆత్మ కమిటీ డివిజన్ చైర్మన్లు రాజిరెడ్డి, ముకుందరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు సత్తు శ్రీనివాస్‌రెడ్డి, హమీద్, మహేష్‌రెడ్డి, పలువురు పీఏసీఎస్ చైర్మన్లు, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

KGBV | నిరుద్యోగ మహిళలకు గుడ్‌న్యూస్.. కేజీబీవీల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం!
నవంబర్ 28, 2026

Padmavathi Ammavari Brahmotsavams | డిసెంబర్లో తిరుమల వెళ్తున్నారా..? తిరుచానూరులో జరిగే ఉత్సవాల గురించి తెలుసా?
నవంబర్ 28, 2026

Invest Telangana Global Summit | సమ్మిట్ సన్నాహాల్లో ప్రజాప్రతినిధులకూ ప్రాధాన్యం
నవంబర్ 28, 2026
తాజావార్తలు
- ●Akhilesh Yadav | బీజేపీకి దేశం కంటే ఎన్నికలే ముఖ్యం : అఖిలేష్ యాదవ్
- ●KGBV | నిరుద్యోగ మహిళలకు గుడ్‌న్యూస్.. కేజీబీవీల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం!
- ●Arjun | పహల్గామ్ ఉగ్రదాడి కథతో సినిమా - ఆయోధ్యలో అర్జున్ దేశభక్తి మూవీ లాంఛ్
- ●Fab City Land Scam | ఫ్యాబ్ సిటీ భూ స్కాంపై.. సీబీఐ విచారణకు ఆదేశించిన హైకోర్టుకు హ్యాట్సాఫ్
- ●India Exports | ఎగుమతుల్లో భారత్ సరికొత్త రికార్డు.. 45 శాతం వృద్ధి..
- ●Padmavathi Ammavari Brahmotsavams | డిసెంబర్లో తిరుమల వెళ్తున్నారా..? తిరుచానూరులో జరిగే ఉత్సవాల గురించి తెలుసా?

Akhilesh Yadav | బీజేపీకి దేశం కంటే ఎన్నికలే ముఖ్యం : అఖిలేష్ యాదవ్

KGBV | నిరుద్యోగ మహిళలకు గుడ్‌న్యూస్.. కేజీబీవీల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం!

Arjun | పహల్గామ్ ఉగ్రదాడి కథతో సినిమా - ఆయోధ్యలో అర్జున్ దేశభక్తి మూవీ లాంఛ్

Fab City Land Scam | ఫ్యాబ్ సిటీ భూ స్కాంపై.. సీబీఐ విచారణకు ఆదేశించిన హైకోర్టుకు హ్యాట్సాఫ్



