India Exports | ఎగుమతుల్లో భారత్ సరికొత్త రికార్డు.. 45 శాతం వృద్ధి..
India Exports | భారత వస్తు ఎగుమతులు గత అక్టోబర్‌లో వార్షిక ప్రాతిపదికన 45.06 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 49.47 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల విలువ భారీగా పెరగడంతోపాటు ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, రసాయనాలు, వస్త్ర పరిశ్రమల ఎగుమతులు కూడా గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి.
India Exports | భారత వస్తు ఎగుమతులు గత అక్టోబర్‌లో వార్షిక ప్రాతిపదికన 45.06 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 49.47 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల విలువ భారీగా పెరగడంతోపాటు ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, రసాయనాలు, వస్త్ర పరిశ్రమల ఎగుమతులు కూడా గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. అయితే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం ఎగుమతి ఆదాయాన్ని పెంచినప్పటికీ, దిగుమతుల వ్యయాన్ని కూడా అధికం చేసింది.
గత ఐదేళ్లలో ఇదే అత్యధిక వార్షిక వృద్ధి..
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ వాణిజ్య విధానాల్లో అనిశ్చితి కొనసాగుతున్నప్పటికీ భారత ఎగుమతులు సరికొత్త రికార్డును సృష్టించాయి. అక్టోబర్‌లో భారత వస్తు ఎగుమతులు గతేడాది ఇదే నెలతో పోలిస్తే 45.06 శాతం పెరిగి 49.47 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత ఐదేళ్లలో నమోదైన అత్యధిక వార్షిక వృద్ధిగా ఇది నిలిచింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నవంబర్ నెలవారీ ఆర్థిక సమీక్షలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ వృద్ధిలో పెట్రోలియం ఉత్పత్తులు కీలక పాత్ర పోషించాయి.
అక్టోబర్‌లో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 140.2 శాతం పెరిగి 8.9 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. భారత ముడి చమురు బాస్కెట్ ధర బ్యారెల్‌కు 119.9 డాలర్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో ఇది 65.1 డాలర్లుగా ఉండేది. అంటే ఏడాదిలో 84.2 శాతం పెరిగింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల డాలర్ విలువ పెరిగింది. అయితే ఇదే సమయంలో పెట్రోలియం, ముడి చమురు, ఇతర ఉత్పత్తుల దిగుమతులు కూడా 54.3 శాతం పెరిగి 22.8 బిలియన్ డాలర్లకు చేరుకోవడం గమనార్హం.
ఏయే రంగాలు ఎంత శాతం..
పెట్రోలియం రంగంతోపాటు ఇతర పరిశ్రమల ఎగుమతులు కూడా గణనీయమైన వృద్ధిని సాధించాయి. పెట్రోలియం, రత్నాలు, ఆభరణాలను మినహాయించిన ఇతర వస్తువుల ఎగుమతులు 36.5 శాతం పెరిగాయి. ఇంజినీరింగ్ వస్తువుల ఎగుమతులు 36 శాతం వృద్ధితో 12.7 బిలియన్ డాలర్లకు చేరగా, ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 62.7 శాతం పెరిగి 6.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. సేంద్రీయ, అకర్బన రసాయనాల ఎగుమతులు 36.2 శాతం, ప్లాస్టిక్ ఉత్పత్తుల ఎగుమతులు 36.3 శాతం పెరిగాయి. మాంసం, పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ ఎగుమతులు 34.9 శాతం, రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 40.1 శాతం వృద్ధి సాధించాయి. ఉపాధి ఆధారిత రంగాల్లోనూ మంచి పురోగతి కనిపించింది. హస్తకళల ఎగుమతులు 55.2 శాతం, పత్తి నూలు, వస్త్రాలు, చేనేత ఉత్పత్తుల ఎగుమతులు 30 శాతం పెరిగాయి. కార్పెట్ ఎగుమతులు 20.6 శాతం, రెడీమేడ్ దుస్తుల ఎగుమతులు 20.3 శాతం, తోలు ఉత్పత్తుల ఎగుమతులు 12.7 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
దిగుమతులు ఎలా ఉన్నాయి..?
మరోవైపు అక్టోబర్‌లో భారత వస్తు దిగుమతులు 16.5 శాతం పెరిగి 89.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అయినప్పటికీ ఎగుమతుల వృద్ధి కారణంగా వస్తు వాణిజ్య లోటు గతేడాది ఇదే నెలలోని 42.6 బిలియన్ డాలర్ల నుంచి 39.9 బిలియన్ డాలర్లకు తగ్గింది. వస్తువులు, సేవలు కలిపి మొత్తం ఎగుమతులు 29.9 శాతం పెరిగి 90 బిలియన్ డాలర్లకు చేరగా, మొత్తం దిగుమతులు 16.6 శాతం వృద్ధితో 110.1 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీంతో మొత్తం వాణిజ్య లోటు 25.2 బిలియన్ డాలర్ల నుంచి 20.1 బిలియన్ డాలర్లకు తగ్గింది. సేవల ఎగుమతులు 15.2 శాతం పెరిగి అంచనా ప్రకారం 40.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. సేవల వాణిజ్య మిగులు 19.8 బిలియన్ డాలర్లుగా నమోదై వస్తు వాణిజ్య లోటులో 49.6 శాతాన్ని భర్తీ చేసింది.
తయారీ రంగానికి ప్రోత్సాహకాలు, మెరుగైన రవాణా సదుపాయాలు, సరళీకృత వాణిజ్య విధానాలు, కొత్త వాణిజ్య ఒప్పందాల ద్వారా మరిన్ని అంతర్జాతీయ మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడం ఎగుమతుల వృద్ధికి దోహదపడతాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. అయితే భవిష్యత్తులో ఈ వృద్ధి కొనసాగడం అంతర్జాతీయ డిమాండ్, ముడి చమురు ధరలు, భౌగోళిక రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుందని విశ్లేషిస్తోంది.
తాజావార్తలు
- ●Padmavathi Ammavari Brahmotsavams | డిసెంబర్లో తిరుమల వెళ్తున్నారా..? తిరుచానూరులో జరిగే ఉత్సవాల గురించి తెలుసా?
- ●MK Stalin | స్టాలిన్‌కు ఆర్ఎస్ఎస్ యూనిఫాం వేసిన టీవీకే.. డీలిమిటేషన్‌కు మద్దతుపై భగ్గుమన్న విజయ్ పార్టీ
- ●Musi Riverfront Development Project | మూసీ ప్రాజెక్టు: హరిత ప్రాంతాలు సగానికి తగ్గింపు.. రహదారులు 261 శాతం పెంపు!
- ●Idupu Kayitham | ఇడుపుకాయితం సీరియస్ సినిమా కాదు - ఆ గ్యారెంటీ మాది - నిర్మాత కామెంట్స్
- ●Devi Prasad | డీలిమిటేషన్ బిల్లుకు వాళ్లెందుకు మద్దతిస్తున్నారో అద్దంకి చెప్పాలి
- ●Invest Telangana Global Summit | సమ్మిట్ సన్నాహాల్లో ప్రజాప్రతినిధులకూ ప్రాధాన్యం

Padmavathi Ammavari Brahmotsavams | డిసెంబర్లో తిరుమల వెళ్తున్నారా..? తిరుచానూరులో జరిగే ఉత్సవాల గురించి తెలుసా?

MK Stalin | స్టాలిన్‌కు ఆర్ఎస్ఎస్ యూనిఫాం వేసిన టీవీకే.. డీలిమిటేషన్‌కు మద్దతుపై భగ్గుమన్న విజయ్ పార్టీ

Musi Riverfront Development Project | మూసీ ప్రాజెక్టు: హరిత ప్రాంతాలు సగానికి తగ్గింపు.. రహదారులు 261 శాతం పెంపు!

Idupu Kayitham | ఇడుపుకాయితం సీరియస్ సినిమా కాదు - ఆ గ్యారెంటీ మాది - నిర్మాత కామెంట్స్





