త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | కార్పొరేష‌న్ల‌లో కోఆప్ష‌న్ మెంబ‌ర్‌గా ట్రాన్స్‌జెండ‌ర్‌: సీఎం రేవంత్‌రెడ్డి

Revanth Reddy | రాబోయే మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల అనంత‌రం ఆ కార్పొరేష‌న్ల‌లో కో ఆప్ష‌న్ మెంబ‌ర్‌గా ట్రాన్స్‌జెండ‌ర్‌ను నామినేట్ చేయాల‌ని ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సూచించారు. దివ్యాంగులు సమాజంలో ఆత్మగౌరవంతో నిలబడేలా త‌మ‌ ప్రభుత్వం మానవీయ కోణంలో పని చేస్తోంద‌ని చెప్పారు.

A

Telangana | Published On Jan 12, 2026, 5.11 pm IST

Revanth Reddy | కార్పొరేష‌న్ల‌లో కోఆప్ష‌న్ మెంబ‌ర్‌గా ట్రాన్స్‌జెండ‌ర్‌: సీఎం రేవంత్‌రెడ్డి
Advertisement

Revanth Reddy | రాబోయే మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల అనంత‌రం ఆ కార్పొరేష‌న్ల‌లో కో ఆప్ష‌న్ మెంబ‌ర్‌గా ట్రాన్స్‌జెండ‌ర్‌ను నామినేట్ చేయాల‌ని ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సూచించారు. తద్వారా వారి సమస్యలపై వారు మాట్లాడుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. దీనిపై సముచిత నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయ‌ప‌డ్డారు. దివ్యాంగులు సమాజంలో ఆత్మగౌరవంతో నిలబడేలా త‌మ‌ ప్రభుత్వం మానవీయ కోణంలో పని చేస్తోంద‌ని చెప్పారు. రూ. 50 కోట్లతో వారికి సహాయ ఉపకరణాలు పంపిణీ చేస్తున్నామ‌న్నారు. ప్రజా భవన్‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో “బాల భరోసా” పథకం, దివ్యాంగులకు సహాయ ఉపకరణాల ఉచిత పంపిణీ కార్యక్రమాల‌ను ఆయ‌న ప్రారంభించారు. అనంత‌రం వ‌ర్చువ‌ల్‌గా “ప్రణామ్” వ‌యోవృద్ధుల డే కేర్ సెంటర్లను ప్రారంభించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ దివ్యాంగుల‌కు కుటుంబ సభ్యుల్లా భరోసా కల్పించేందుకు త‌మ‌ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా రూ. 50 కోట్లు కేటాయించిందని చెప్పారు.

విద్య, ఉద్యోగాల భర్తీలో దివ్యాంగులకు వారి కోటాను వారికి కేటాయిస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి పేర్కొన్నారు. దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింద‌ని తెలిపారు. క్రీడల్లో దివ్యాంగులను ప్రోత్సహించాలని పారాలింపిక్స్‌లో ప‌త‌కం సాధించిన అమ్మాయికి ప్ర‌భుత్వ ఉద్యోగం ఇచ్చామ‌ని గుర్తు చేశారు. పోటీ ప్రపంచంలో తాము వెనకబడ్డామన్న ఆలోచన లేకుండా అన్ని రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు కల్పిస్తున్నామ‌ని వివ‌రించారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను ఉపయోగించుకుని ఆత్మస్థైర్యంతో జీవితంలో ఎదగాలని పిలుపునిచ్చారు. బెస్ట్ పార్లమెంటేరియన్ గా ఎదిగిన కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి దివ్యాంగులకు ఒక స్ఫూర్తి అని అన్నారు. వైకల్యం అనే ఆలోచనను రానీకుండా ఉన్నత స్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తి జైపాల్ రెడ్డి అని కొనియాడారు.

వయోవృద్ధులకు ప్రభుత్వమే కుటుంబంగా మారి ప్రణామ్ పేరుతో డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తోందని రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ప్రతీ నెలా జీతంలో 10 శాతం తల్లిదండ్రులకు అందించేలా చట్టం తీసుకువ‌స్తామ‌ని ప్ర‌క‌టించారు. తల్లిదండ్రుల ఫిర్యాదులను పరిశీలించి జీతంలో నేరుగా 10 శాతం తల్లిదండ్రుల ఖాతాలోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికి నూటికి నూరు శాతం వైద్యం అందించాలన్నదే త‌మ విధానమ‌ని స్ప‌ష్టం చేశారు. రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో హెల్త్ పాలసీని తీసుకురాబోతున్నామ‌ని చెప్పారు.

తెలంగాణ సమాజం సామాజిక న్యాయం, సమాన అవకాశాలను కోరుకుంటోందన్నారు. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కులగణన నిర్వహించామ‌న్నారు. తెలంగాణ ఒత్తిడికి తలొగ్గి కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన నిర్వహించేందుకు అంగీకరించిందని పేర్కొన్నారు. తెలంగాణ కులగణన మోడల్ ను దేశం అనుసరిస్తోందని చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసి సమాన అవకాశాలు కల్పిస్తున్నామ‌న్నారు. ఒకప్పుడు సామాన్యులకు ప్రవేశం లేని ప్రజా భవన్ లో ఇప్పుడు అందరికీ ప్రవేశం కల్పించామ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ప్రభుత్వానికి ధర్మ గంట ఉందన్న ఆయ‌న‌.. ఎవరు ఏ సమస్యలు చెప్పినా విని పరిష్కరిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా, పేదల సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందామ‌ని పిలుపునిచ్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు బలరాం నాయక్, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement