త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vivek Venkataswamy | కాంగ్రెస్ అనుకూల ఓట్ల‌ను తొల‌గించే కుట్ర జ‌రుగుతోంది

Vivek Venkataswamy | కాంగ్రెస్ అనుకూల ఓట్ల‌ను తొల‌గించేందుకు బీజేపీ కుట్ర‌లు చేస్తోంద‌ని మంత్రి గ‌డ్డం వివేక్ వెంక‌ట‌స్వామి ఆరోపించారు. బూత్ లెవల్ ఏజెంట్లు ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితాలను పకడ్బందీగా పరిశీలించాలని సూచించారు.

S

Telangana | Published On Jun 11, 2026, 3.50 pm IST

Vivek Venkataswamy | కాంగ్రెస్ అనుకూల ఓట్ల‌ను తొల‌గించే కుట్ర జ‌రుగుతోంది
Advertisement
  • ‘స‌ర్’ ముసుగులో ఓటర్ల తొలగింపును తిప్పికొడ‌దాం
  • ఇంటింటికీ వెళ్లి జాబితాను ప‌రిశీలించాలి
  • మంచిర్యాల ‘స‌ర్’ కార్య‌క్ర‌మంలో మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ

Vivek Venkataswamy | త్రినేత్ర‌.న్యూస్‌: కాంగ్రెస్ అనుకూల ఓట్ల‌ను తొల‌గించేందుకు బీజేపీ కుట్ర‌లు చేస్తోంద‌ని మంత్రి గ‌డ్డం వివేక్ వెంక‌ట‌స్వామి ఆరోపించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని గద్దెరాగడిలో గురువారం నిర్వహించిన ఓటర్ల ప్రత్యేక సవరణ జాబితా (SIR)పై బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) అవగాహన శిక్షణ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ తో క‌లిసి ఆయ‌న మాట్లాడారు. బూత్ లెవల్ ఏజెంట్లు ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితాలను పకడ్బందీగా పరిశీలించాలని సూచించారు.

‘స‌ర్’ ముసుగు వేసుకుంది..

బీజేపీ SIR ముసుగు వేసుకొంది. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓటర్లను తొలగించేందుకు కుట్రలు చేస్తోంది. దేశంలో ఓటు చోరీ అంశంపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో గళం విప్పారు. బూత్ లెవల్ ఏజెంట్లు ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితాలను పరిశీలించాలి. చనిపోయిన ఓటర్ల వివరాలను గుర్తించి సంబంధిత అధికారులకు తెలియజేయాలి అని సూచించారు.

క‌మీష‌న్ల రాజ‌కీయాలు చేశారు..

గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం మెగా ప్రాజెక్టుల పేరుతో భారీ అప్పులు చేసి, కమీషన్ల రాజకీయాలకు పాల్పడింది. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పారదర్శకంగా అమలు చేస్తోంది. అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందించడమే లక్ష్యం. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు పౌష్టికాహార భోజనం అందిస్తున్నాం. BLAలు ఇంటింటికి వెళ్లినప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకోలి అని మంత్రి వివేక్‌ సూచించారు.

చెన్నూరు నియోజకవర్గంలో త్వరలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తాం. కాకా ఫౌండేషన్ ద్వారా 2,500 బోర్‌వెల్లు ఏర్పాటు చేయడంతో పాటు తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నీటి ఎద్దడి ప్రాంతాల్లో 400 బోర్‌వెల్లు వేయించాం అని వివేక్ వెంక‌టస్వామి తెలిపారు.

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ.. దేశంలో సిట్టింగ్ స్థానాల్లో ప్రతిపక్ష పార్టీలను బలహీనపరిచే ఉద్దేశంతోనే బీజేపీ ప్రభుత్వం SIR ముసుగులో ఓటర్ల పేర్లను తొలగించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. రాజ్యాంగబద్ధంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్‌ను ఎంపిక చేసినప్పటికీ, ఆమె నామినేషన్‌ను తిరస్కరించడం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే చర్యగా ఆయ‌న విమర్శించారు. నీట్ పరీక్ష అవకతవకలు, పేపర్ లీకేజీల వల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం యువత ఉపాధి కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 120 ATC సెంటర్ల ద్వారా 25 వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. టామ్‌కామ్ (TOMCOM) ద్వారా మరో 10 వేల మంది యువతకు జర్మనీలో ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తీసుకువస్తున్నామని వివరించారు.

చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి విశేషంగా కృషి చేస్తున్నారని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement