త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | తెలంగాణ భవన్‌కు పోటెత్తిన 22A బాధితులు.. స‌మ‌స్య‌లు విని బాధితుల‌కు భ‌రోసా ఇచ్చిన‌ హ‌రీశ్‌రావు

Harish Rao | తెలంగాణ భ‌వ‌న్ మ‌రో జ‌న‌తా గ్యారేజ్‌గా మారిపోయింది. ఇక్క‌డికి వ‌స్తే త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతాయ‌న్న న‌మ్మ‌కంతో రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న‌ 22A నిషేధిత భూముల బాధితులు బుధ‌వారం భారీగా త‌ర‌లొచ్చారు. హరీశ్ రావు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాధితుల సమస్యలను ఓపికగా విని, వారికి భరోసానిచ్చారు.

S

Telangana | Published On Aug 19, 2026, 3.23 pm IST

Harish Rao | తెలంగాణ భవన్‌కు పోటెత్తిన 22A బాధితులు.. స‌మ‌స్య‌లు విని బాధితుల‌కు భ‌రోసా ఇచ్చిన‌ హ‌రీశ్‌రావు
Advertisement
  • బీఆర్ఎస్ నేత‌ల ముందు గోడు వెల్ల‌బోసుకున్న బాధితులు
  • మ‌రో జ‌న‌తా గ్యారేజ్‌ను త‌ల‌పించిన భ‌వ‌న్‌
  • పార్టీ అండ‌గా ఉంటుంద‌ని నాయ‌కుల భ‌రోసా

త్రినేత్ర‌.న్యూస్: తెలంగాణ భ‌వ‌న్ మ‌రో జ‌న‌తా గ్యారేజ్‌గా మారిపోయింది. ఇక్క‌డికి వ‌స్తే త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతాయ‌న్న న‌మ్మ‌కంతో రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న‌ 22A నిషేధిత భూముల బాధితులు బుధ‌వారం భారీగా త‌ర‌లొచ్చారు. ఈ సంద‌ర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు బాధితులను అడిగి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. ప్రభుత్వం అడ్డగోలుగా తమ ఆస్తులను 22A జాబితాలో పెట్టడం వల్ల తీవ్రంగా నష్టపోయామంటూ హరీశ్ రావు ముందు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి 30% కమీషన్లు, 50-50 సెటిల్మెంట్ల కోసమే 22A దందా చేస్తున్నార‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. హరీశ్ రావు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాధితుల సమస్యలను ఓపికగా విని, వారికి భరోసానిచ్చారు.

బాధితుల గోడు ఇలా..

లాస్ట్‌కు 22ఎ జాబితాలో ఉంద‌ని చెప్పారు: మోహన్ రెడ్డి (బాధితుడు)
రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకుని, స్టాంప్ డ్యూటీ చార్జీలు మొత్తం చెల్లించిన తర్వాత.. తీరా రిజిస్ట్రేషన్ రోజున మీ ఆస్తి 22A నిషేధిత జాబితాలో ఉంది అని చెప్పారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నిలబెట్టి ఇలా హ్యాండ్ ఇస్తే మేం ఎక్కడికి వెళ్లాలి? ప్రభుత్వమే మమ్మల్ని అనాథలను చేస్తే మా ఆవేదన ఎవరు వింటారు.

కాల‌నీ మ‌ధ్య‌లో ఉన్న ఇల్లు 22ఎ లోకి ఎలా పోతుంది?: రాజేష్ (బాధితుడు)
2017లో బ్యాంకు లోన్ తీసుకుని కాలనీ మధ్యలో ఇల్లు కొనుక్కున్నాను. ఇటీవల ఉద్యోగం పోవడంతో ఇల్లు అమ్ముకుని వ్యాపారం చేసుకుందామని జూలై 1న రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు వెళ్తే.. మా ఆస్తి 22A లో ఉందని చెప్పారు. ఎమ్మార్వో ఆఫీసులో దరఖాస్తు పెట్టుకుని రెండు నెలలైనా దిక్కులేదు. ఇల్లు కొనే వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని అగ్రిమెంట్ చేశాను, ఆయన లోన్ ఈఎంఐ కూడా కడుతున్నాడు. కానీ రిజిస్ట్రేషన్ కావడం లేదు. కాలనీ మధ్యలో ఉన్న ఇల్లు ఉన్నట్టుండి 22A లోకి ఎలా పోతుంది.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పరిస్థితికి ఏం సమాధానం చెబుతారు.

ఆత్మ‌హ‌త్యలు చేసుకునే దుస్థితి ఉంది: దేవేందర్ రావు (హెచ్‌ఎమ్‌టీ హౌసింగ్ కాలనీ సొసైటీ సెక్రటరీ)
1995లోనే లేఅవుట్ అనుమతులు పొంది వందలాది ఇళ్లు నిర్మించుకున్నాం. కానీ సర్వే నంబరు 330ని ఒక్కసారిగా 22A లో పెట్టారు. గత జూలైలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చినా దాన్ని చెత్తబుట్టలో వేశారు. ప్లాట్లు కొనుక్కున్న మధ్యతరగతి ప్రజలు ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం, 50-50 సెటిల్మెంట్ల కోసం లేదా 30% కమీషన్ డిమాండ్ల కోసమే ఈ లేఅవుట్లను అడ్డం పెట్టుకుని ప్రజలను ఆగం చేస్తోంది.

పొంగులేటికి విన్న‌వించినా ఫ‌లితం లేదు: బి.ఎన్. నగర్, ఉప్పల్ బాధితులు
మా కాలనీలో 1500 ఇళ్లు ఉన్నాయి. గతంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగిన భూములను ఇప్పుడు ULC పేరుతో ఆపేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి విన్నవించినా ఎలాంటి పరిష్కారం చూపలేదు.

బీఆర్ఎస్ పార్టీయే కాపాడాలి: శ్రీనివాస్ (అమీన్‌పూర్ బాధితుడు)
10 ఏళ్ల క్రితం క్లియర్ డాక్యుమెంట్లతో, బ్యాంకు లోన్ ద్వారా ప్రాపర్టీ కొన్నాను. అవసరం ఉండి అమ్ముకుందామని స్టాంప్ డ్యూటీ కట్టిన తర్వాత ప్రొహిబిషన్ లిస్టులో ఉందన్నారు. రెండు సర్వే నంబర్ల సాకుతో కాలనీ మొత్తం 22A లో పెడితే సామాన్య కుటుంబాల పరిస్థితి ఏంటి? 22A అని ముద్ర వేస్తే మా భూమిని ఎవరు కొంటారు? బీఆర్ఎస్ పార్టీయే మమ్మల్ని ఈ రాబందుల ప్రభుత్వం నుంచి కాపాడాలి.

బాధితుల ఆవేదనను విన్న అనంత‌రం మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తుగ్లక్ నిర్ణయాల వల్ల, కమీషన్ల దాహం వల్ల లక్షలాది మంది సామాన్యుల జీవితాలు రోడ్డున పడ్డాయని మండిపడ్డారు. బాధితుల తరఫున బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ లోపల, బయట పోరాడుతుందని, 22A నిషేధిత జాబితా పేరుతో జరుగుతున్న దందాను అరికట్టి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement