త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Priya Bhavani Shankar | ‘ఇరుముడి’తో ప్రియా భవానీ శంకర్‌కు తెలుగులో బ్రేక్‌ వచ్చేనా?

Priya Bhavani Shankar | తమిళ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక ప్రియా భవానీ శంకర్‌.. తెలుగులో మాత్రం ఇప్పటివరకు సరైన విజయాన్ని అందుకోలేకపోయింది. కార్తి నటించిన ‘కడైకుట్టి సింగం’, కమల్‌హాసన్‌ ‘ఇండియన్‌ 2’ వంటి చిత్రాలతో తమిళ ప్రేక్షకులకు చేరువైన ఆమె.. టాలీవుడ్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది.

P

Entertainment | Published On Aug 19, 2026, 4.05 pm IST

Priya Bhavani Shankar | ‘ఇరుముడి’తో ప్రియా భవానీ శంకర్‌కు తెలుగులో బ్రేక్‌ వచ్చేనా?
Advertisement

Priya Bhavani Shankar | తమిళ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక ప్రియా భవానీ శంకర్‌.. తెలుగులో మాత్రం ఇప్పటివరకు సరైన విజయాన్ని అందుకోలేకపోయింది. కార్తి నటించిన ‘కడైకుట్టి సింగం’, కమల్‌హాసన్‌ ‘ఇండియన్‌ 2’ వంటి చిత్రాలతో తమిళ ప్రేక్షకులకు చేరువైన ఆమె.. టాలీవుడ్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది.. ‘కళ్యాణం కమనీయం’తో 2023లో తెలుగు తెరకు పరిచయమైన ప్రియా.. ఆ తర్వాత గోపీచంద్‌ సరసన ‘భీమా’లో నటించింది. అయితే, ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద నిరాశపరచడంతో ఆమెకు తెలుగులో బ్రేక్‌ రాలేదు. ఇప్పుడు రవితేజ కథానాయకుడిగా నటించిన ‘ఇరుముడి’పై ప్రియా భవానీ శంకర్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్నది. ఈ చిత్రంలో ఆమె మాస్‌ మహారాజా భార్య ‘కావేరి’ పాత్రలో కనిపించనున్నది. ఇప్పటివరకు చేసిన పాత్రలతో పోలిస్తే ఈ సినిమాలో కుటుంబ నేపథ్యంతో కూడిన పాత్రలో ఆమె కనిపించనుండటం ఆసక్తిని పెంచుతోంది.

ఈ సినిమాతో ఎలాగైనా తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ స్థిరమైన గుర్తింపు తెచ్చుకోవాలని ప్రియా భావిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత జీవితం, ప్రేమ వ్యవహారాల గురించి బహిరంగంగా మాట్లాడే ప్రియా భవానీ శంకర్‌.. సినిమాల విషయానికి వస్తే మాత్రం కథ, పాత్రల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారనే టాక్‌ ఉంది. ముఖ్యంగా కుటుంబ కథాంశాల్లో భార్య పాత్రలకు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ‘ఇరుముడి’లోని కావేరి పాత్ర ఆమెకు ఎంతవరకు కలిసొస్తుందన్న ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తే తెలుగులో మరిన్ని అవకాశాలు తలుపుతట్టే అవకాశం ఉందని ఆమె అభిమానులు భావిస్తున్నారు. ముఖ్యంగా సీనియర్‌ హీరోల సరసన నటించే అవకాశాలు రావాలంటే ముందుగా టాలీవుడ్‌లో ఓ విజయాన్ని నమోదు చేయడం అవసరమని ప్రియా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘ఇరుముడి’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొనడంతో.. ఈ సినిమా తన తెలుగు కెరీర్‌కు కీలక మలుపుగా మారుతుందని ఆమె నమ్మకంగా ఉన్నారట.

ఇరుమడి స్టోరీ ఇదేనా..?

రవితేజ, ప్రియా భవానీ శంకర్‌ జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. చిత్రానికి సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ ‘యు/ఏ’ సర్టిఫికెట్‌ జారీ చేసింది. దీంతో ఆగస్టు 21న థియేటర్లలో విడుదలకు మార్గం సుగమమైంది. సినిమా నిడివిని 2 గంటల 25 నిమిషాలుగా ఖరారు చేశారు. తండ్రి–కూతురి అనుబంధం నేపథ్యంలో సాగే ఎమోషనల్‌ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా ‘ఇరుముడి’ని రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో రవితేజ మద్యానికి బానిసైన తండ్రి పాత్రలో కనిపించనున్నారు. తన కూతురి కోసం అయ్యప్ప మాల ధరించిన తర్వాత ఆయన జీవితంలో చోటుచేసుకునే మార్పులు కథలో కీలకంగా ఉంటాయని సమాచారం. బేబీ నక్షత్ర కూతురి పాత్రలో నటించి కథలో కీలకంగా మారనుంది. సెన్సార్‌ వర్గాల నుంచి సినిమాకు సానుకూల స్పందన వచ్చినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రవితేజ నటన, తండ్రి–కూతురి మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయని తెలుస్తోంది.

ఇంటర్వెల్‌ తర్వాత కథ మరింత వేగం పుంజుకుంటుందని, ప్రీ-క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయని టాక్‌ వినిపిస్తోంది. ముఖ్యంగా చివరి 40 నిమిషాలు ఉత్కంఠభరితంగా సాగుతూ ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టేలా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. కథకు తగ్గట్టుగా జీవీ ప్రకాష్‌ కుమార్‌ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం కూడా సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ‘ఇరుముడి’పై అంచనాలు పెరుగుతున్న వేళ.. ఈ సినిమా రవితేజకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుంది? ప్రియా భవానీ శంకర్‌కు తెలుగులో ఎదురుచూస్తున్న విజయాన్ని అందించి ఆమె కెరీర్‌కు కొత్త దారిని చూపిస్తుందా? అన్నది ఆగస్టు 21న తేలనుంది.

Advertisement
Advertisement