త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

WhatsApp Plus Price | వాట్సప్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్ ఇక ఫ్రీ కాదు.. జుకర్‌బర్గ్ మాస్టర్ ప్లాన్ ఇదే!

వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇకపై పూర్తిగా ఉచితం కాదు. మెటా కొత్తగా పెయిడ్ సబ్‌స్క్రిప్షన్స్ ఎందుకు తెచ్చింది? దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి?

J

Technology | Published On Jun 17, 2026, 4.42 pm IST

WhatsApp Plus Price | వాట్సప్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్ ఇక ఫ్రీ కాదు.. జుకర్‌బర్గ్ మాస్టర్ ప్లాన్ ఇదే!

సంక్షిప్త సారాంశం

వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ యూజర్ల కోసం మెటా కొత్తగా పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను లాంచ్ చేసింది. భారత్‌లో వాట్సప్ ప్లస్, ఇన్‌స్టా ప్లస్ ధరను నెలకు రూ. 99 గా నిర్ణయించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోసం చేస్తున్న వేల కోట్ల ఖర్చును బ్యాలెన్స్ చేయడానికే మెటా ఈ నిర్ణయం తీసుకుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కేవలం యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయంపైనే ఆధారపడకుండా, కొత్త మార్గాల్లో లాభాలు గడించాలని జుకర్‌బర్గ్ ఈ పెయిడ్ ప్లాన్స్ తీసుకొచ్చారు.

Advertisement

WhatsApp Plus Price | త్రినేత్ర.న్యూస్ : ఇన్నేళ్లుగా ఫ్రీగా సేవలు అందించిన ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram), వాట్సప్ (WhatsApp) ఇకపై పూర్తిగా ఉచితం కాదు. ఈ యాప్స్ మాతృసంస్థ అయిన మెటా (Meta) తాజాగా పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. అసలు మెటా సడెన్‌గా యూజర్ల దగ్గర డబ్బులు ఎందుకు వసూలు చేయాలనుకుంటోంది? దీని వెనుక మార్క్ జుకర్‌బర్గ్ భారీ 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) ప్లాన్ ఉందనే విషయం మీకు తెలుసా?

సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్, ధరలు ఇవే..

క్రియేటర్లు, బిజినెస్ అకౌంట్స్, పవర్ యూజర్ల కోసం మెటా ప్రత్యేకంగా 'ప్లస్' (Plus) సబ్‌స్క్రిప్షన్లను గ్లోబల్ స్థాయిలో లాంచ్ చేసింది. ఇండియాలో ఇన్‌స్టాగ్రామ్ ప్లస్, ఫేస్‌బుక్ ప్లస్ ధర నెలకు రూ.99 గా ఉంది. అలాగే వాట్సప్ ప్లస్ కూడా నెలకు రూ.99 కే అందుబాటులో ఉంది. (ప్రస్తుతం ఇండియాలో యూజర్లను ఆకర్షించేందుకు ఆరు నెలల పాటు 50% డిస్కౌంట్ ఇస్తున్నారు).

వీటితో పాటు అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్స్ కావాలనుకునే వారి కోసం మెటా వన్ ప్లస్ (Meta One Plus) నెలకు రూ.775, మెటా వన్ ప్రీమియం (Meta One Premium) రూ.1,939 చొప్పున ప్లాన్లను కూడా సంస్థ టెస్ట్ చేస్తోంది. ఈ పెయిడ్ వెర్షన్లలో ప్రొఫైల్ కస్టమైజేషన్, స్టోరీ రీవాచ్ కౌంట్స్, సీక్రెట్ స్టోరీ వ్యూయింగ్ వంటి ఎక్స్‌ట్రా ఫీచర్స్ ఉంటాయి.

జుకర్‌బర్గ్ సడెన్ డిసిషన్‌కు కారణం ఏంటి?

ఏఐ (AI) రేసులో ఇతర టెక్ దిగ్గజాల కంటే కాస్త వెనుకబడిన మెటా.. ఇప్పుడు ఏఐపై కోట్లాది రూపాయలు కుమ్మరిస్తోంది. కేవలం ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్ల కోసమే 2026 నాటికి ఏకంగా $125 బిలియన్ల నుంచి $145 బిలియన్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే స్కేల్ ఏఐ ఫౌండర్ అలెగ్జాండర్ వాంగ్‌ను భారీ ప్యాకేజీతో తమ సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ కోసం తీసుకుంది. ఇక ఇండియాలో సైతం రిలయన్స్ (Reliance) సంస్థతో కలిసి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో భారీ ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది.

ఈ భారీ ఏఐ ఖర్చులను బ్యాలెన్స్ చేయడానికే మెటా ఈ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్స్ ప్లాన్ చేసిందని మార్కెట్ అనలిస్టులు స్పష్టం చేస్తున్నారు.

ఒకే ఆదాయ మార్గంపై ఆధారపడటం వల్లే..

గతేడాది మెటా ఆదాయంలో 97.6% కేవలం యాడ్స్ (ప్రకటనల) ద్వారానే వచ్చింది. గూగుల్ (Google) లాంటి సంస్థలు యాడ్స్ కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా ఎంతో కొంత ఆదాయం సంపాదిస్తుంటే, మెటా మాత్రం రెండు దశాబ్దాలుగా కేవలం యాడ్స్‌పైనే ఆధారపడటం ఆ సంస్థకు పెద్ద మైనస్. అందుకే కొత్త ఆదాయ మార్గాల కోసం జుకర్‌బర్గ్ ఈ పెయిడ్ ప్లాన్లను తెరపైకి తెచ్చారు.

అయితే, మైక్రోసాఫ్ట్ లేదా గూగుల్ తరహాలో మెటాకు ఎంటర్‌ప్రైజ్ సంస్థల నమ్మకం లేకపోవడం ఒక ప్రతికూల అంశం అని టెక్‌ఆర్క్ (Techarc) చీఫ్ అనలిస్ట్ ఫైసల్ కవూసా అభిప్రాయపడ్డారు. "ఇన్ని రోజులు ఫ్రీగా వాడిన యాప్‌లకు డబ్బులు కట్టాలంటే సాధారణ యూజర్లు అంత సులభంగా ఒప్పుకోరు. వాళ్లను ఒప్పించాలంటే డబ్బులు కట్టడానికి బలమైన కారణం, ఫీచర్లు ఉండాలి" అని ఆయన అన్నారు. ఇది ఏఐ ఖర్చులను కవర్ చేసుకోవడానికి మెటా వేసిన తాత్కాలిక ప్లాన్ (స్టాప్‌గ్యాప్) లాగా కనిపిస్తోందని ఏఐ నిపుణుడు శ్రీనివాస్ పద్మనాభుని అభిప్రాయపడ్డారు.

ఏదేమైనా, ఈ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్స్ ద్వారా 2030 నాటికి ఏటా $20 బిలియన్ల హై-మార్జిన్ ఆదాయం వస్తుందని ట్రూయిస్ట్ సెక్యూరిటీస్ లాంటి సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ వ్యూహం వర్కౌట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి.

Advertisement

తాజావార్తలు

Advertisement