త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SBI YONO 2.0 | యోనో 2.0 యాప్‌ను లాంచ్ చేసిన ఎస్‌బీఐ.. అనేక ఫీచ‌ర్ల‌తో అప్ గ్రేడ్‌..

S

Technology | Published On Dec 17, 2025, 7.08 am IST

SBI YONO 2.0 | యోనో 2.0 యాప్‌ను లాంచ్ చేసిన ఎస్‌బీఐ.. అనేక ఫీచ‌ర్ల‌తో అప్ గ్రేడ్‌..
Advertisement

SBI YONO 2.0 | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) త‌న మొబైల్ బ్యాంకింగ్ యాప్ యోనో (YONO)కు గాను మ‌రిన్ని మెరుగులు దిద్ది కొత్త‌గా యోనో 2.0 పేరిట యాప్‌ను లాంచ్ చేసింది. ముంబైలో నిర్వ‌హించిన ఓ ఈవెంట్‌లో ఈ యాప్‌ను లాంచ్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఎస్‌బీఐకి చెందిన సీనియ‌ర్ అధికారి ఒకరు మాట్లాడుతూ రానున్న రోజుల్లో కొత్త‌గా 6వేల మంది ఉద్యోగుల‌ను నియ‌మించుకోనున్న‌ట్లు వెల్ల‌డించారు. దీని వ‌ల్ల వినియోగ‌దారుల‌కు డిజిట‌ల్ స‌ర్వీసుల‌ను అందించ‌డం మ‌రింత సుల‌భ‌త‌రం అవుతుంద‌న్నారు. కాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8 ఏళ్ల కింద‌ట యోనో యాప్‌ను లాంచ్ చేయ‌గా, ఇప్పుడు ఈ యాప్‌కు గాను అధునాత‌న 2.0 వెర్ష‌న్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఈ కొత్త వెర్ష‌న్ చాలా సింపుల్‌గా, లైట్‌గా ఉంటుంద‌ని తెలియ‌జేసింది.

ఇంట‌ర్నెట్ క‌నెక్టివిటీ స్పీడ్ చాలా త‌క్కువ‌గా ఉన్నా, సిగ్న‌ల్ స‌రిగ్గా లేక‌పోయినా, త‌క్కువ హార్డ్ వేర్ కాన్ఫిగ‌రేష‌న్ ఉన్న స్మార్ట్ ఫోన్ అయినా ఈ యాప్ ఎంతో మెరుగ్గా ప‌నిచేస్తుంద‌ని ఎస్‌బీఐ అధికారులు వెల్ల‌డించారు. ఈ యాప్ స‌హాయంతో ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు అనేక స‌దుపాయాల‌ను పొంద‌వ‌చ్చ‌ని అన్నారు. అకౌంట్ బ్యాలెన్స్ చెకింగ్‌, న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్‌, బిల్లు చెల్లింపులు, యూపీఐ లావాదేవీలు నిర్వ‌హించ‌డం వంటి ప‌నులను ఈ యాప్ ద్వారా నిర్వ‌హించుకోవ‌చ్చ‌ని అన్నారు. కాగా గూగుల్ పే, ఫోన్ పే వంటి ఇత‌ర యూపీఐ పేమెంట్స్ యాప్‌ల‌కు పోటీగా యోనో 2.0 ను తీర్చిదిద్దామ‌ని, వినియోగ‌దారులు మ‌రింత సుల‌భంగా, వేగంగా యూపీఐ సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చ‌ని తెలిపారు.

యోనో 2.0 యాప్ లో ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు సింపుల్ కేవైసీ, రీకేవైసీ వంటి సేవ‌ల‌ను కూడా పొంద‌వ‌చ్చ‌ని అన్నారు. దీని వ‌ల్ల క‌స్ట‌మ‌ర్లు కేవైసీ కోసం బ్యాంకుకు రావాల్సిన అవ‌స‌రం లేద‌ని, దీంతో ఎంతో స‌మ‌యం ఆదా అవుతుంద‌ని అన్నారు. అయితే ఈ సేవ‌ల‌ను అతి త్వ‌ర‌లో ఇందులో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు తెలిపారు. యోనో 2.0 యాప్ సెక్యూరిటీ ప‌రంగా కూడా క‌స్ట‌మ‌ర్ల అకౌంట్ల‌కు ఎంతో ర‌క్ష‌ణ ఇస్తుంద‌ని, ఓటీపీల‌ను వేగంగా పొంద‌వ‌చ్చ‌ని అన్నారు. కాగా యోనో 2.0 యాప్‌ను లాంచ్ చేయ‌డం ద్వారా కొత్త‌గా 20 కోట్ల మంది యూజ‌ర్ల‌ను ఈ ప్లాట్ ఫామ్ వైపు మ‌ళ్లించేందుకు కృషి చేస్తున్నామ‌ని ఎస్‌బీఐ చైర్మ‌న్ సీఎస్ శెట్టి తెలిపారు. డిజిట‌ల్ బ్యాంకింగ్‌ను ప్రోత్స‌హించేందుకే తాము ఈ యాప్‌కు మెరుగులు దిద్ది 2.0 వెర్ష‌న్‌ను ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు తెలిపారు. వ‌చ్చే ఏడాది మార్చి 31వ తేదీ వ‌ర‌కు 6500 మంది కొత్త ఉద్యోగుల‌ను నియ‌మించుకోనున్నామ‌ని, ఇప్ప‌టికే ఈ ఉద్యోగాల్లో 3500 మందిని భ‌ర్తీ చేస్తున్నామని తెలిపారు. కాగా ఇప్ప‌టికే అందుబాటులో ఉన్న యోనో యాప్‌కు అప్‌గ్రేడ్‌గా ఈ యాప్‌ను అందించ‌నున్నారు. ఈ యాప్ మ‌రికొద్ది రోజుల్లో ముందుగా ఆండ్రాయిడ్ వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి రానుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement