త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samsung Galaxy Forever | గెలాక్సీ ఫ‌రెవ‌ర్ ప్రోగ్రామ్‌ను ప్ర‌వేశ‌పెట్టిన శాంసంగ్‌.. ఎస్‌26 ఫోన్ల‌ను స‌గం ధ‌ర‌కే కొన‌వ‌చ్చు..

Samsung Galaxy Forever | శామ్‌సంగ్ ఇండియా తన ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుదారుల కోసం గెలాక్సీ ఫ‌రెవర్ పేరిట ఓ నూత‌న ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా వినియోగదారులు ఫోన్ ధరలో 50 శాతం మొత్తాన్ని 12 నెలల వడ్డీ లేని ఈఎంఐల రూపంలో చెల్లించవచ్చు.

S

Technology | Published On Mar 16, 2026, 5.39 pm IST

Samsung Galaxy Forever | గెలాక్సీ ఫ‌రెవ‌ర్ ప్రోగ్రామ్‌ను ప్ర‌వేశ‌పెట్టిన శాంసంగ్‌.. ఎస్‌26 ఫోన్ల‌ను స‌గం ధ‌ర‌కే కొన‌వ‌చ్చు..
Advertisement

Samsung Galaxy Forever | శామ్‌సంగ్ ఇండియా తన ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుదారుల కోసం గెలాక్సీ ఫ‌రెవర్ పేరిట ఓ నూత‌న ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా వినియోగదారులు ఫోన్ ధరలో 50 శాతం మొత్తాన్ని 12 నెలల వడ్డీ లేని ఈఎంఐల రూపంలో చెల్లించవచ్చు. అలాగే ఇందులో రూ.13,999 విలువైన శామ్‌సంగ్ కేర్+ సెక్యూరిటీ స్కీమ్ కూడా ఇస్తారు. ఈ స్కీమ్‌ ద్వారా ప్రమాదవశాత్తూ జరిగే నష్టం లేదా నీటి కారణంగా ఫోన్ దెబ్బతినే సమస్యల నుంచి ప్రొటెక్ష‌న్ ల‌భిస్తుంది. ఒక సంవత్సరం పూర్తైన తర్వాత వినియోగదారులు మూడు ఆప్ష‌న్‌ల‌లో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. వారు కొత్త గెలాక్సీ ఎస్ సిరీస్ ఫోన్‌కు అప్‌గ్రేడ్ కావచ్చు, ప్రస్తుత ఫోన్‌ను మిగిలిన ఈఎంఐలు చెల్లించి కొనసాగించవచ్చు లేదా శామ్‌సంగ్ వెబ్‌సైట్ ద్వారా ఫోన్‌ను తిరిగి ఇవ్వవచ్చు.

12 నెల‌ల పాటు వ‌డ్డీ లేని ఈఎంఐ..

ఈ ప్రోగ్రామ్ లో భాగంగా వినియోగదారులు ఫోన్ ధరలో సగం మొత్తాన్ని 12 నెలల పాటు వడ్డీ లేకుండా ఈఎంఐల రూపంలో చెల్లిస్తారు. ఈ కాలంలో ఫోన్‌కు శామ్‌సంగ్ కేర్+ రక్షణ వర్తిస్తుంది. ఇది ప్రమాదవశాత్తూ జరిగే నష్టం, నీటి కారణంగా జరిగే నష్టాలను కవర్ చేస్తుంది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా వినియోగ‌దారులు శాంసంగ్‌కు చెందిన గెలాక్సీ ఎస్‌26 అల్ట్రా ఫోన్ 256జీబీ, 12జీబీ ర్యామ్ మోడ‌ల్‌ను కొనుగోలు చేస్తే ఉదాహ‌ర‌ణ‌గా నెల‌కు ఎంత చెల్లించాలో ఇప్పుడు చూద్దాం.

ఉదాహ‌రణ చూస్తే..

శాంసంగ్ గెలాక్సీ ఎస్‌26 అల్ట్రా 256జీబీ, 12జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.1,39,999 ఉంది. దీనికి రూ.69,999.50 బైబ్యాక్ విలువ‌ను ఇస్తున్నారు. దీంతో డివైస్ ధ‌ర రూ.69,999.50 అవుతుంది. 12 నెల‌ల వ‌డ్డీ లేని ఈఎంఐ అయితే నెల‌కు రూ.5833.29 అవుతుంది. గెలాక్సీ ఫ‌రెవ‌ర్ ప్రోగ్రామ్‌కు గాను రూ.749.92 ఫీజు చెల్లించాలి. దీంతో 12 నెల‌ల పాటు నెల‌కు చెల్లించాల్సిన మొత్తం రూ.6583.21 అవుతుంది. మొదటి సంవత్సరం పూర్తైన తర్వాత వినియోగదారులు తమ ఫోన్‌ను ఎలా కొనసాగించాలనుకుంటున్నారు అన్న విష‌యాన్ని అనుసరించి మూడు ఆప్ష‌న్‌ల‌ను అందిస్తున్నారు. వాటిల్లో దేన్న‌యినా వారు ఎంచుకోవ‌చ్చు.

ఫోన్ అప్‌గ్రేడ్ అయితే..

ఫోన్ కొనుగోలు చేసిన తర్వాత 10వ నెల నుంచి 13వ నెల మధ్యలో శామ్‌సంగ్ వెబ్ సైట్‌ ద్వారా తదుపరి గెలాక్సీ ఎస్ సిరీస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌కు అప్‌గ్రేడ్ కావడానికి వినియోగదారులు రిక్వెస్ట్‌ చేయవచ్చు. అభ్యర్థనను ఆమోదిస్తే, అన్ని బకాయిలు చెల్లిస్తే ప్రస్తుత రుణాన్ని ముగించి కొత్త డివైస్ కోసం కొత్త రుణం జారీ చేస్తారు. త‌రువాత ప్ర‌స్తుత డివైస్‌ను తీసుకుని కొత్త డివైస్‌ను ఇస్తారు. దీంతో కొత్త డివైస్‌కు తిరిగి య‌థావిధిగా రుణం ప్ర‌కారం నెల నెలా ఈఎంఐ చెల్లించాలి. దానికి కూడా అలాగే వ‌డ్డీ లేని రుణం ఇస్తారు. ఆ త‌రువాత మ‌ళ్లీ 10 నుంచి 13వ నెల మ‌ధ్య ఆ డివైస్‌ను ఇచ్చి ఇంకో కొత్త గెలాక్సీ ఎస్ సిరీస్ డివైస్‌కు అప్‌గ్రేడ్ కావ‌చ్చు. ఇలా ఒక నిరంత‌ర సైకిల్‌గా గెలాక్సీ ఎస్ సిరీస్ ఫోన్ల‌ను వాడ‌వ‌చ్చు. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త మోడ‌ల్స్‌ను వాడిన ఎక్స్‌పీరియెన్స్ వ‌స్తుంది.

మిగిలిన రెండు ఆప్ష‌న్లు..

ఇక రెండో ఆప్ష‌న్‌గా వినియోగదారులు చెల్లింపు షెడ్యూల్ ప్రకారం మిగిలిన రుణాన్ని చెల్లించి ప్రస్తుత ఫోన్‌ను తమ వద్ద ఉంచుకోవ‌చ్చు. నెల నెలా ఈఎంఐల‌ను య‌థావిధిగా కాల‌వ్య‌వ‌ధి అయిపోయే వ‌ర‌కు చెల్లించాలి. ఇక మూడో ఆప్ష‌న్‌గా ఫోన్‌ను తిరిగి ఇవ్వ‌వ‌చ్చు. ఫోన్‌ను తిరిగి ఇవ్వాలనుకుంటే 12వ నెల నుంచి 13వ నెల మధ్యలో శామ్‌సంగ్ వెబ్ సైట్ ద్వారా రిటర్న్ రిక్వెస్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఈ గెలాక్సీ ఫ‌రెవర్ ప్రోగ్రామ్‌లో మొదటి సంవత్సరానికి శామ్‌సంగ్ కేర్+ ప్రొటెక్ష‌న్ కూడా ఉంటుంది. దీనివల్ల వినియోగదారులు వేరుగా ప్రొటెక్ష‌న్ ప్లాన్ ను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండ‌దు.

ఎలా చేరాలి..

శామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అర్హత కలిగిన ఫోన్‌ను కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు ఈ ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకోవ‌చ్చు. ముందుగా శాంసంగ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అక్క‌డ కావ‌ల్సిన గెలాక్సీ ఎస్26 సిరీస్ ఫోన్ ప్రొడ‌క్ట్ పేజ్‌ను ఓపెన్ చేయాలి. అందులో గెలాక్సీ ఫ‌రెవ‌ర్ అనే సెక్ష‌న్‌ వ‌ద్ద జాయిన్ నౌ అనే ఆప్ష‌న్‌ను ఎంచుకుని చెక్ అవుట్ ప్ర‌క్రియ కొన‌సాగించాలి. ఫోన్‌ను ఒక సంవ‌త్స‌రం పాటు ఉప‌యోగించాలి. త‌రువాత కావాల‌నుకుంటే అప్‌గ్రేడ్ అవ‌చ్చు, ఫోన్‌ను రిటెయిన్ చేసుకోవ‌చ్చు, తిరిగి ఇచ్చేయ‌వ‌చ్చు.

నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రి..

ఫోన్‌ను అప్‌గ్రేడ్ లేదా రిట‌ర్న్ చేయాలంటే ప‌లు నిబంధ‌న‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. ఫోన్ ఆన్ అవ్వాల్సి ఉంటుంది. ఫోన్ సాఫ్ట్‌వేర్ లేదా హార్డ్ వేర్ పరంగా ఎలాంటి మార్పులకు గురి కాకూడ‌దు. ఐఎంఈఐ నంబ‌ర్‌ను ధ్రువీక‌రించాల్సి ఉంటుంది. స్టైల‌స్ వంటి యాక్స‌సరీలు ఉంటే వాటిని కూడా ఇవ్వాలి. పిక‌ప్ స‌మ‌యంలో ధ్రువీక‌ర‌ణ కోసం ఫోన్ చార్జింగ్ అయి ఉండాలి. ఇక ఫోన్‌ను ఇవ్వ‌డానికి ముందు వినియోగదారులు ఫోన్‌లోని డేటాను బ్యాక‌ప్ తీసుకుని దాన్ని పూర్తిగా ఎరేజ్ చేయాల్సి ఉంటుంది. శాంసంగ్ అందిస్తున్న ఈ గెలాక్సీ ఫ‌రెవ‌ర్ ప్రోగ్రామ్ ప్ర‌స్తుతం కేవ‌లం భార‌తీయ యూజ‌ర్ల‌కు మాత్ర‌మే శాంసంగ్ వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంది. ఈ ప్రోగ్రామ్ కింద గెలాక్సీ ఎస్‌26 సిరీస్ ఫోన్ల‌ను యూజ‌ర్లు తీసుకుని వాడ‌వ‌చ్చు.

Advertisement
Advertisement