త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ola Electric | చ‌వ‌క ధ‌ర‌ల‌కే ఓలా కంపెనీ కొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు.. 301 కిలోమీట‌ర్ల రేంజ్‌..

Ola Electric | భారత్‌లో ఎలక్ట్రిక్‌ స్కూటర్ల విభాగంలో ఓలా ఎలక్ట్రిక్‌ కొత్త ఉత్పత్తిని తీసుకొచ్చింది. సరికొత్త ఎస్1జ‌డ్‌ స్కూటర్‌ శ్రేణిని కంపెనీ విడుదల చేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన భారత్‌ సెల్‌ ఎల్‌ఎఫ్‌పీ సాంకేతికతను భారీ మార్కెట్‌కు తీసుకొచ్చిన తొలి స్కూటర్‌ శ్రేణి ఇదేనని ఓలా ఎలక్ట్రిక్‌ తెలిపింది.

S

Automobiles | Published On Aug 28, 2026, 3.00 pm IST

Ola Electric | చ‌వ‌క ధ‌ర‌ల‌కే ఓలా కంపెనీ కొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు.. 301 కిలోమీట‌ర్ల రేంజ్‌..
Advertisement

Ola Electric | భారత్‌లో ఎలక్ట్రిక్‌ స్కూటర్ల విభాగంలో ఓలా ఎలక్ట్రిక్‌ కొత్త ఉత్పత్తిని తీసుకొచ్చింది. సరికొత్త ఎస్1జ‌డ్‌ స్కూటర్‌ శ్రేణిని కంపెనీ విడుదల చేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన భారత్‌ సెల్‌ ఎల్‌ఎఫ్‌పీ సాంకేతికతను భారీ మార్కెట్‌కు తీసుకొచ్చిన తొలి స్కూటర్‌ శ్రేణి ఇదేనని ఓలా ఎలక్ట్రిక్‌ తెలిపింది. ఎస్1జ‌డ్‌లో ఉపయోగించిన 46-సిరీస్‌ ఎల్‌ఎఫ్‌పీ సెల్‌ ప్లాట్‌ఫామ్‌ సాంకేతికతను ఓలా ఎలక్ట్రిక్‌ బ్యాటరీ ఇన్నోవేషన్‌ సెంటర్‌లో అభివృద్ధి చేసింది. ఈ సెల్స్‌ను కంపెనీకి చెందిన ఓలా గిగాఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు. దేశంలో అత్యధికంగా ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనుగోలు చేసే విలువ ఆధారిత విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ స్కూటర్‌ను రూపొందించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. విలువ ఆధారిత విభాగంలో కొనుగోలు చేసే వినియోగదారులు సాంకేతికత, భద్రత లేదా పనితీరులో రాజీ పడాల్సిన అవసరం లేకుండా ఎస్1జ‌డ్‌ను రూపొందించినట్లు ఓలా ఎలక్ట్రిక్‌ తెలిపింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా చ‌వ‌కైన ఎలక్ట్రిక్‌ స్కూటర్లపై ఉన్న అంచనాలను మార్చాలని కంపెనీ భావిస్తోంది.

ఏ వేరియెంట్ ధ‌ర ఎంత‌..

ఎస్1జ‌డ్‌ రెండు బ్యాటరీ సామర్థ్యాల్లో లభిస్తోంది. 3.1 కిలోవాట్‌ అవర్‌ వేరియంట్‌ ప్రారంభ ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ.79,999గా ఉండగా, 5.1 కిలోవాట్‌ అవర్‌ వేరియంట్ ధరను రూ.99,999గా నిర్ణయించారు. 3.1 కిలోవాట్‌ అవర్‌ వేరియంట్‌ ఇండియన్‌ డ్రైవింగ్‌ సైకిల్‌ ప్రకారం ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే గరిష్ఠంగా 179 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది. 5.1 కిలోవాట్‌ అవర్‌ వేరియంట్‌ గరిష్ఠంగా 301 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని తెలిపింది. ఎలక్ట్రిక్‌ వాహనంలో బ్యాటరీ అత్యంత ఖరీదైన భాగాల్లో ఒకటి. దేశీయంగా ఎల్‌ఎఫ్‌పీ సెల్‌ సాంకేతికతను అభివృద్ధి చేసి, తయారు చేయడం ద్వారా బ్యాటరీ ఖర్చులను గణనీయంగా తగ్గించగలిగామని ఓలా ఎలక్ట్రిక్‌ తెలిపింది. దీంతో ఆధునిక బ్యాటరీ సాంకేతికతను భారీ మార్కెట్‌కు అందుబాటులో ఉండే ధరల్లో అందించగలుగుతున్నామని పేర్కొంది. దేశీయంగా తయారు చేసిన ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ సాంకేతికతకు ఎస్1జ‌డ్‌ తొలి పెద్ద స్థాయి ఉదాహరణగా నిలుస్తుందని కంపెనీ తెలిపింది. ఎక్కువ భద్రత, ఎక్కువ జీవితకాలం కలిగిన ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ సాంకేతికతను అందుబాటు ధరలో భారతీయ వినియోగదారులకు అందించడమే లక్ష్యమని పేర్కొంది.

ఎల్ఎఫ్‌పీ క‌లిగిన తొలి స్కూట‌ర్ శ్రేణి..

ఓలా ఎలక్ట్రిక్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ భావిష్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ.. దేశీయంగా అభివృద్ధి చేసిన భారత్‌ సెల్‌ ఎల్‌ఎఫ్‌పీ సాంకేతికత ఎంత వేగంగా సాధారణ భారతీయ వినియోగదారులకు చేరుతుందన్నదే దాని ఆవిష్కరణకు అసలైన కొలమానం అని అన్నారు. లక్షలాది మంది వినియోగదారులు తమ ప్రయాణ అవసరాల కోసం నిర్ణయాలు తీసుకునే మార్కెట్‌లోకి భారత్‌లో తయారు చేసిన ఎల్‌ఎఫ్‌పీ సాంకేతికతను తీసుకొస్తున్న తొలి స్కూటర్‌ శ్రేణి ఎస్1జ‌డ్‌ అని తెలిపారు. అందుబాటు ధర అంటే తక్కువ సౌకర్యాలతో సరిపెట్టుకోవడం కాదని భావిస్తున్నామని ఆయన అన్నారు. సెల్‌ నుంచి వాహనం వరకు భారత ఎలక్ట్రిక్‌ వాహనాల వ్యవస్థను నిర్మించే దిశగా తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నామని, ప్రతి భారతీయ కుటుంబానికి ఎలక్ట్రిక్‌ వాహనాలను చేరువ చేయడంలో ఎస్1జ‌డ్‌ వంటి ఉత్పత్తులు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఎస్1జ‌డ్‌ పేరులోని జ‌డ్‌ అంటే జ్యాదా లేదా ఎక్కువ అని ఓలా ఎలక్ట్రిక్‌ వివరించింది. అంటే ఎక్కువ భద్రత, ఎక్కువ రేంజ్‌, ఎక్కువ సాంకేతికత, ఎక్కువ విలువ అనే భావనతో ఈ స్కూటర్‌ను రూపొందించినట్లు తెలిపింది. స్కూటర్‌లోని బ్యాటరీ సాంకేతికత నుంచే ఈ మార్పు ప్రారంభమవుతుందని కంపెనీ పేర్కొంది.

డెలివ‌రీలు ఎప్పుడు..

ఎస్1జ‌డ్‌ నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంది. వైట్‌, ఆంత్రాసైట్‌, స్కై స్ప్లాష్‌ బ్లూ, మ్యాచ్‌ గ్రీన్‌ రంగులను కంపెనీ ప్రకటించింది. అన్ని వేరియంట్లలో 12 ఇంచుల వీల్స్‌ను అందిస్తున్నారు. 3.1 కిలోవాట్‌ అవర్‌ వేరియంట్‌ డెలివరీలు ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభం కానున్నాయి. 5.1 కిలోవాట్‌ అవర్‌ వేరియంట్‌ డెలివరీలు 2027 మార్చిలో ప్రారంభమవుతాయని ఓలా ఎలక్ట్రిక్‌ తెలిపింది. ఎస్1జ‌డ్‌కు మూవ్‌ఓఎస్‌ 5 సాఫ్ట్‌వేర్‌ అందిస్తున్నారు. ఇందులో క్రూయిజ్‌ కంట్రోల్‌, అధునాతన రీజెనరేటివ్‌ బ్రేకింగ్‌, రివర్స్‌ మోడ్‌, జీపీఎస్‌, ఓవర్‌-ది-ఎయిర్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌, జియో ఫెన్సింగ్‌, టైమ్‌ ఫెన్సింగ్‌, మోడ్‌ ఫెన్సింగ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే రైడ్‌ గణాంకాలు, ఎనర్జీ వినియోగానికి సంబంధించిన వివరాలను ఓలా ఎలక్ట్రిక్‌ యాప్‌ ద్వారా తెలుసుకునే సదుపాయం ఉంది. దీంతో వినియోగదారులకు మరింత స్మార్ట్‌, కనెక్టెడ్‌, వ్యక్తిగతీకరించిన వాహన అనుభవాన్ని అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.

ఈజీ పార్క్ ఫీచ‌ర్‌..

ఎస్1జ‌డ్‌ శ్రేణిలో ఈజీ పార్క్‌ ఫీచర్‌ను కూడా అందిస్తున్నారు. ఇరుకైన పార్కింగ్‌ ప్రదేశాల్లో స్కూటర్‌ను ముందుకు, వెనక్కి సులభంగా తీసుకెళ్లేందుకు కేవలం రిస్ట్‌ను తిప్పడం ద్వారా వాహనాన్ని నియంత్రించే విధంగా ఈ ఫీచర్‌ను రూపొందించారు. రిటైల్‌ విస్తరణలో ఓలా ఎలక్ట్రిక్‌ చేపట్టనున్న తదుపరి దశలో ఎస్1జ‌డ్‌ కీలక ఉత్పత్తిగా ఉండనుంది. కంపెనీ సొంత రిటైల్‌ నెట్‌వర్క్‌తోపాటు తొలిసారిగా డీలర్ల ద్వారా నిర్వహించే స్టోర్లను కూడా ప్రారంభించనుంది. దీంతో దేశవ్యాప్తంగా ఓలా ఉత్పత్తులు మరింత ఎక్కువ మంది వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయని కంపెనీ తెలిపింది.

Advertisement
Advertisement