త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

New Online Gaming Rules 2026 | కొత్త ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్ అమ‌ల్లోకి.. ఉల్లంఘిస్తే రూ.1 కోటి ఫైన్‌, 3 ఏళ్ల జైలు శిక్ష‌..

New Online Gaming Rules 2026 | భారత‌ ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. శుక్ర‌వారం నుంచి అమల్లోకి వ‌చ్చిన‌ ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్, 2026 ద్వారా ఈ రంగానికి సమగ్ర నియంత్రణ వ్యవస్థ తీసుకువ‌చ్చారు. ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్, ప్ర‌మోష‌న్ అండ్ రెగ్యులేష‌న్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ యాక్ట్ 2025 (ప్రోగ్ యాక్ట్) అమలుకు మార్గం సుగమం చేసింది.

S

Technology | Published On May 1, 2026, 4.46 pm IST

New Online Gaming Rules 2026 |  కొత్త ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్ అమ‌ల్లోకి.. ఉల్లంఘిస్తే రూ.1 కోటి ఫైన్‌, 3 ఏళ్ల జైలు శిక్ష‌..
Advertisement

New Online Gaming Rules 2026 | భారత‌ ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. శుక్ర‌వారం నుంచి అమల్లోకి వ‌చ్చిన‌ ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్, 2026 ద్వారా ఈ రంగానికి సమగ్ర నియంత్రణ వ్యవస్థ తీసుకువ‌చ్చారు. ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్, ప్ర‌మోష‌న్ అండ్ రెగ్యులేష‌న్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ యాక్ట్ 2025 (ప్రోగ్ యాక్ట్) అమలుకు మార్గం సుగమం చేసింది. పాలసీ స్థాయి నుంచి కఠిన నియంత్రణ దశకు మార్పును సూచిస్తోంది. ఈ కొత్త విధానంలో ప్రధానంగా స్పష్టమైన విభజనను తీసుకొచ్చారు. ఈ-స్పోర్ట్స్, ఆన్‌లైన్ సోషల్ గేమ్స్‌ను ప్రోత్సహించగా, ఆన్‌లైన్ మనీ గేమ్స్‌ను పూర్తిగా నిషేధించారు. వ్యసనం, ఆర్థిక నష్టాలు, అక్రమ కార్యకలాపాలపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

మ‌నీ గేమ్స్‌తో రూ.20వేల కోట్ల న‌ష్టాలు..

భారత్‌లో ఆన్‌లైన్ గేమింగ్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2024లో రూ.23,200 కోట్ల ఆదాయం నమోదు కాగా, 2027 నాటికి ఇది రూ.31,600 కోట్లకు చేరే అవకాశమున్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. అయితే ఈ వృద్ధితోపాటు సుమారు 45 కోట్ల మంది యూజర్లు ఆన్‌లైన్ మనీ గేమింగ్ ప్రభావానికి గురయ్యారని అంచనా. దీని వల్ల రూ.20వేల కోట్లకు పైగా నష్టాలు సంభవించినట్లు నివేదికలు వెల్ల‌డిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రెండు ర‌కాలుగా చర్యలు తీసుకుంది. సుర‌క్షిత‌మైన గేమింగ్ ఫార్మాట్లను ప్రోత్సహించడం, ప్రమాదకరమైన‌ విభాగాలపై కఠిన నియంత్రణలు అమలు చేయడం వంటి చ‌ర్య‌లు చేప‌ట్టింది. అందులో భాగంగానే ఈ కొత్త చ‌ట్టాన్ని అమ‌లు చేస్తోంది.

మే 1 నుంచి అమల్లోకి వచ్చిన‌ ప్రధాన మార్పులు..

ఆన్‌లైన్ మనీ గేమ్స్‌పై పూర్తి నిషేధం కొన‌సాగుతుంది. చాన్స్, స్కిల్ లేదా మిక్స్ అయిన గేమ్స్ అన్నీ ఈ నిషేధంలోకి వస్తాయి. ప్రకటనలు, ప్రోత్సాహకాలు కూడా నిషేధం. ఫైనాన్షియల్ కట్టడి కొన‌సాగుతుంది. బ్యాంకులు, పేమెంట్ సిస్టమ్స్ ఇలాంటి గేమ్స్‌కు సంబంధించిన లావాదేవీలను ప్రాసెస్ చేయలేవు, చేయ‌కూడ‌దు. నిబంధనల‌ను ఉల్లంఘిస్తే 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.1 కోటి వరకు జరిమానా విధిస్తారు. పునరావృతం అయితే మరింత కఠిన శిక్షలు ఉంటాయి. ఈ వ్యవస్థలో ప్రధాన భాగంగా ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు. ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ డిజిటల్ రెగ్యులేటర్ ప‌లు చ‌ర్య‌లు చేప‌డుతుంది. గేమ్స్‌ను అనుమతించినవి, నిషేధితంగా వర్గీకరిస్తుంది. బ్యాన్ చేసిన ప్లాట్‌ఫామ్‌ల జాబితాను నిర్వహిస్తుంది. నియంత్రణ అమలు, అప్పీళ్లను పర్యవేక్షిస్తుంది. గేమ్స్‌ను స్టేక్స్, విన్నింగ్స్, మానెటైజేషన్ మోడల్ ఆధారంగా 90 రోజుల్లో నిర్ణయిస్తారు.

రిజిస్ట్రేష‌న్ త‌ప్ప‌నిస‌రి..

ఈ-స్పోర్ట్స్, ఆన్‌లైన్ సోషల్ గేమ్స్‌కు తప్పనిసరి రిజిస్ట్రేషన్ అవ‌స‌రం ఉంటుంది. ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే 10 సంవత్సరాల వరకు డిజిటల్ సర్టిఫికేషన్ చెల్లుతుంది. ఇక సర్వీస్ ప్రొవైడర్లు రిజిస్ట్రేషన్ వివరాల‌ను విధిగా ప్రదర్శించాలి. కాంటాక్ట్ పాయింట్ ను నియమించాలి. డేటా, పేమెంట్ నిబంధనలు పాటించాలి. ఇక మ‌నీ గేమ్స్‌పై పూర్తి నిషేధం అమ‌లులో ఉంటుంది క‌నుక వీటికి ఈ-స్పోర్ట్స్‌గా గుర్తింపు ఇవ్వ‌రు. ఈ క్ర‌మంలోనే కొత్త విధానంలో యూజర్ భద్రతను కీలక అంశంగా తీసుకున్నారు. వయస్సు ధ్రువీకరణ, పేరెంటల్ కంట్రోల్స్, టైమ్ లిమిట్స్, ప్రవర్తన‌ మానిటరింగ్, రిపోర్టింగ్ టూల్స్, కౌన్సెలింగ్ సపోర్ట్ వంటివి అందుబాటులో ఉంటాయి. అలాగే రెండు లెవ‌ల్స్‌లో ఫిర్యాదు పరిష్కార వ్యవస్థను ప్రవేశపెట్టారు. మొదట ప్లాట్‌ఫామ్ స్థాయిలో, తరువాత రెగ్యులేటర్ వద్ద సమస్యకు పరిష్కారం ల‌భిస్తుంది.

పూర్తిగా డిజిట‌ల్ విధానంలోనే..

ఈ కొత్త చ‌ట్టం అమలు ప్రధానంగా డిజిటల్ విధానంలో జరుగుతుంది. కేసుల‌ను 90 రోజుల్లో పరిష్కరించేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. శిక్షల‌ను యూజర్ నష్టం, లాభాలు, పునరావృతం వంటి అంశాలపై ఆధారపడి నిర్ణయిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను ఇన్నోవేషన్, భద్రత మధ్య సమతుల్యంగా చూస్తోంది. ఇది డిజిటల్ ఎకానమీని బలోపేతం చేయడంతోపాటు ఈ-స్పోర్ట్స్ రంగంలో ఉద్యోగ అవకాశాలను పెంచడం, కుటుంబాలను రిస్కీ గేమింగ్ నుంచి రక్షించడం లక్ష్యంగా ప‌నిచేస్తుంది. స్పష్టమైన నిబంధనలు, వర్గీకరణలు, కేంద్ర రెగ్యులేటర్‌తో భారత‌ గేమింగ్ రంగం మరింత నియంత్రిత, స్థిరమైన దశలోకి ప్రవేశిస్తోంద‌ని నిపుణులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement