Neuralink Blindsight | మెదడుతోనే ప్రపంచాన్ని చూడొచ్చు.. ఎలాన్ మస్క్ న్యూరాలింక్ సంచలనం!
Neuralink Blindsight | ఊహించుకోండి.. కళ్లు కనిపించకపోయినా ప్రపంచాన్ని చూడగలిగితే? చేతులు కదలకపోయినా కేవలం ఆలోచనలతోనే కంప్యూటర్‌ను ఆపరేట్ చేయగలిగితే? వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలా ఉన్నా.. ఈ ఆలోచనలను నిజం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.
Technology | Published On Oct 31, 2026, 3.52 pm IST
- అంధులకు చూపునిచ్చేలా ‘బ్లైండ్‌సైట్’..
- ఆలోచనలతోనే కంప్యూటర్ ఆపరేట్ చేసేలా ‘టెలిపతి’
Neuralink Blindsight | ఊహించుకోండి.. కళ్లు కనిపించకపోయినా ప్రపంచాన్ని చూడగలిగితే? చేతులు కదలకపోయినా కేవలం ఆలోచనలతోనే కంప్యూటర్‌ను ఆపరేట్ చేయగలిగితే? వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలా ఉన్నా.. ఈ ఆలోచనలను నిజం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ సంస్థ మెదడు-కంప్యూటర్ అనుసంధాన సాంకేతికత (బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్)పై పరిశోధనలు చేస్తోంది. ఇందులో భాగంగా ‘బ్లైండ్‌సైట్’, ‘టెలిపతి’ టెక్నాలజీలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. చూపు కోల్పోయిన వారికి దృష్టిని అందించాలన్నది బ్లైండ్‌సైట్ లక్ష్యమైతే.. పక్షవాతం వంటి సమస్యలతో చేతులు కదపలేని వారు ఆలోచనలతోనే డిజిటల్ పరికరాలను నియంత్రించేలా చేయడం టెలిపతి ఉద్దేశం.
బ్లైండ్‌సైట్.. మెదడుతోనే చూపు!
బ్లైండ్‌సైట్ అనేది న్యూరాలింక్ అభివృద్ధి చేస్తున్న ప్రయోగాత్మక బ్రెయిన్ ఇంప్లాంట్ టెక్నాలజీ. కళ్లు లేదా ఆప్టిక్ నర్వ్ (దృష్టి నాడి) దెబ్బతినడం వల్ల చూపు కోల్పోయిన వారికి దృశ్య సమాచారాన్ని నేరుగా మెదడుకు చేరవేయడం దీని ప్రధాన ఉద్దేశం. సాధారణంగా మనం ఏదైనా వస్తువును చూసినప్పుడు కళ్లలోని రెటీనా కాంతిని నాడీ సంకేతాలుగా మారుస్తుంది. ఈ సంకేతాలు ఆప్టిక్ నర్వ్ ద్వారా మెదడుకు చేరతాయి. అక్కడి మెదడులోని విజువల్ కార్టెక్స్ వాటిని విశ్లేషించి మనకు దృశ్య అనుభూతిని కలిగిస్తుంది. అయితే కళ్లు లేదా దృష్టి నాడి దెబ్బతింటే ఈ ప్రక్రియకు అంతరాయం ఏర్పడి చూపు కోల్పోయే పరిస్థితి వస్తుంది.
కెమెరా నుంచి మెదడుకు.. ఎలా పనిచేస్తుంది?
ఈ సమస్యకు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించాలన్నదే న్యూరాలింక్ ప్రయత్నం. ఇందులో కెమెరా, మెదడులో అమర్చే ప్రత్యేక ఇంప్లాంట్ కీలక పాత్ర పోషిస్తాయి. కెమెరా ద్వారా సేకరించిన దృశ్య సమాచారాన్ని డిజిటల్ సంకేతాలుగా మార్చి వైర్‌లెస్ విధానంలో మెదడులోని ఇంప్లాంట్‌కు చేరవేయాలన్నది ఈ టెక్నాలజీ ప్రణాళిక. ఆ ఇంప్లాంట్ మెదడులోని దృష్టికి సంబంధించిన భాగాన్ని విద్యుత్ సంకేతాలతో ఉత్తేజితం చేస్తుంది. తద్వారా కళ్ల నుంచి ఆప్టిక్ నర్వ్ మీదుగా వెళ్లే సాధారణ మార్గాన్ని పక్కనపెట్టి మెదడుకు దృశ్య సమాచారాన్ని అందించవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
పుట్టుకతో అంధులకూ ఉపయోగపడుతుందా?
బ్లైండ్‌సైట్‌తో కళ్లకు లేదంటే దృష్టి నాడికి నష్టం కలగడంతో చూపు కోల్పోయిన వారితోపాటు.. పుట్టుకతోనే అంధులైన వారికి కూడా ప్రయోజనం కలిగే అవకాశం ఉందని ఎలాన్ మస్క్ గతంలో పేర్కొన్నారు. అయితే మెదడులోని విజువల్ కార్టెక్స్ సక్రమంగా పనిచేయడం కీలకం. అంతేకాదు.. ఈ టెక్నాలజీ ద్వారా మనుషులకు ఎంతవరకు స్పష్టమైన దృశ్య అనుభూతి కలుగుతుంది? వారు వస్తువులను గుర్తించగలరా? సాధారణ చూపుతో సమానమైన అనుభవం సాధ్యమవుతుందా? వంటి ప్రశ్నలకు సమాధానాలు ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం మనుషుల్లో బ్లైండ్‌సైట్ ద్వారా చూపు పునరుద్ధరించినట్లు నిరూపితమైన ఫలితాలు లేవు. అందువల్ల దీన్ని ప్రస్తుతానికి ప్రయోగాత్మక టెక్నాలజీగానే చూడాలి.
ఎఫ్‌డీఏ నుంచి గుర్తింపు
న్యూరాలింక్ బ్లైండ్‌సైట్ టెక్నాలజీకి 2024 సెప్టెంబర్‌లో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ‘బ్రేక్‌త్రూ డివైజ్’ హోదా కల్పించింది. తీవ్రమైన వ్యాధులు, వైకల్యాలకు చికిత్సలో ఉపయోగపడే వినూత్న వైద్య పరికరాల అభివృద్ధి, సమీక్ష ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ గుర్తింపు దోహదపడుతుంది. అయితే ఈ హోదా లభించినంత మాత్రాన ఆ పరికరానికి ప్రజల వినియోగానికి అనుమతి వచ్చినట్లు కాదు. భద్రత, పనితీరుకు సంబంధించిన పరీక్షలు, అవసరమైన నియంత్రణ అనుమతులు ఇంకా కీలకమే.
టెలిపతి.. ఆలోచిస్తే చాలు.. కంప్యూటర్ కంట్రోల్!
బ్లైండ్‌సైట్‌తోపాటు న్యూరాలింక్ అభివృద్ధి చేస్తున్న మరో కీలక సాంకేతికత టెలిపతి. ఇది ముఖ్యంగా పక్షవాతం లేదా ఇతర నాడీ సంబంధిత సమస్యలతో చేతులు, కాళ్లు కదపలేని వారికి ఉపయోగపడేలా రూపొందుతోంది. ఈ టెక్నాలజీలో మెదడులో అమర్చిన చిప్ చేతుల కదలికలను నియంత్రించే మెదడు ప్రాంతంలోని నాడీ సంకేతాలను గుర్తిస్తుంది. ఒక వ్యక్తి తన చేతిని కదుపుతున్నట్లు ఊహించుకున్నప్పుడు మెదడులో ఉత్పత్తి అయ్యే సంకేతాలను విశ్లేషించి వాటిని కంప్యూటర్ ఆదేశాలుగా మారుస్తుంది. దీంతో చేతులతో మౌస్‌ను పట్టుకోవాల్సిన అవసరం లేకుండానే కర్సర్‌ను కదపడం, క్లిక్ చేయడం వంటి పనులు చేయవచ్చు.
ఇప్పటికే ప్రయోగాల్లో ముందడుగు
టెలిపతి విషయంలో న్యూరాలింక్ ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. తొలి వ్యక్తికి 2024 జనవరిలోనే బ్రెయిన్ ఇంప్లాంట్ అమర్చారు. ఆ తర్వాత మరికొందరు కూడా ఈ ప్రయోగాల్లో పాల్గొన్నారు. 2026 జనవరి 28న విడుదల చేసిన అప్‌డేట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 21 మంది ట్రయల్స్‌లో పాల్గొంటున్నారు. వీరిలో కొందరు కంప్యూటర్ కర్సర్‌ను కదపడం, క్లిక్ చేయడం, సందేశాలు పంపడం, గేమ్స్ ఆడటం వంటి పనులను ఆలోచనల సాయంతో చేస్తున్నారు. అయితే ఈ ఫలితాలు క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించినవే తప్ప.. టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందరికీ అందుబాటులోకి వచ్చిందని అర్థం కాదు.
భవిష్యత్తులో విప్లవాత్మక మార్పులు..
ఒకవైపు చూపు కోల్పోయిన వారికి దృశ్య అనుభూతిని అందించాలన్న బ్లైండ్‌సైట్ ప్రయత్నం.. మరోవైపు శారీరక వైకల్యాలున్న వారు ఆలోచనలతోనే డిజిటల్ ప్రపంచంతో అనుసంధానం అయ్యేలా చేస్తున్న టెలిపతి ప్రయోగాలు.. వైద్య, సాంకేతిక రంగాల్లో కొత్త అవకాశాలకు తెరతీస్తున్నాయి. అయితే ఈ టెక్నాలజీల భద్రత, పనితీరు, దీర్ఘకాలిక ప్రభావాలపై మరిన్ని పరిశోధనలు అవసరం. ప్రయోగాలు విజయవంతమై అవసరమైన అనుమతులు లభిస్తే.. భవిష్యత్తులో వైకల్యాలున్న వారి జీవితాల్లో ఇవి గణనీయమైన మార్పులు తీసుకువచ్చేందుకు అవకాశం ఉన్నది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Lucknow Ravana Hoardings | దసరా వేళ లక్నోలో పోస్టర్లు: రావణుడి 10 తలలుగా రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, ఎలాన్ మస్క్!
అక్టోబర్ 18, 2026

Starlink | భారత్‌లో హైస్పీడ్ ఇంటర్నెట్కు స్టార్‌లింక్ సిద్ధం.. రిలయన్స్ కామెంట్లకు మస్క్ రియాక్షన్..
అక్టోబర్ 17, 2026

Tesla Roadster | ఇక గాల్లో ఎగరనున్న కార్లు.. ఎలాన్ మస్క్ సంచలనం..
అక్టోబర్ 16, 2026
తాజావార్తలు
- ●MLA Sanjay | అబద్దాలు చెప్పడంలో నిజంగా నువే గొప్ప
- ●WhatsApp | డిలీట్ చేసిన వాట్సాప్ చాట్స్‌ను తిరిగి పొందడం ఎలా? ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు సింపుల్ టిప్స్!
- ●Janani Ashok Kumar | తమిళనాడులో 634 కోట్ల స్కామ్ - నటిపై ఆరోపణలు - తనకు ఏ పార్టీతో సంబంధం లేదంటూ క్లారిటీ
- ●YIPS | యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు రూ.42.5 లక్షల సీఎస్ఆర్ నిధులు
- ●KP Vivekananda | మియాపూర్ భూములకు అడ్వాన్స్ తీసుకున్నడేమో
- ●Minister Seethakka | తాగునీటి అవసరాలకు రూ. 120 కోట్లు మంజూరు

MLA Sanjay | అబద్దాలు చెప్పడంలో నిజంగా నువే గొప్ప

WhatsApp | డిలీట్ చేసిన వాట్సాప్ చాట్స్‌ను తిరిగి పొందడం ఎలా? ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు సింపుల్ టిప్స్!

Janani Ashok Kumar | తమిళనాడులో 634 కోట్ల స్కామ్ - నటిపై ఆరోపణలు - తనకు ఏ పార్టీతో సంబంధం లేదంటూ క్లారిటీ

YIPS | యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు రూ.42.5 లక్షల సీఎస్ఆర్ నిధులు



