త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mobile Data Usage | భార‌త్‌లో పెరిగిన మొబైల్ డేటా వినియోగం.. వేగంగా విస్త‌రిస్తున్న 5జి..

Mobile Data Usage | టెలికాం రంగంలో రిల‌య‌న్స్ జియో డేటా విప్ల‌వం కార‌ణంగా భార‌తీయుల నెల‌వారి మొబైల్ డేటా వినియోగం అప్ప‌టి నుంచే గ‌ణ‌నీయంగా పెరిగింది. జియో రాక ముందు 1జీబీ మొబైల్ డేటా పొందాలంటే నెల‌కు రూ.250 వ‌ర‌కు చెల్లించాల్సి వ‌చ్చేది. కానీ జియో రాక‌తో మొబైల్ డేటా ధ‌ర‌లు భారీగా త‌గ్గాయి.

S

Technology | Published On Apr 5, 2026, 10.30 am IST

Mobile Data Usage | భార‌త్‌లో పెరిగిన మొబైల్ డేటా వినియోగం.. వేగంగా విస్త‌రిస్తున్న 5జి..
Advertisement

Mobile Data Usage | టెలికాం రంగంలో రిల‌య‌న్స్ జియో డేటా విప్ల‌వం కార‌ణంగా భార‌తీయుల నెల‌వారి మొబైల్ డేటా వినియోగం అప్ప‌టి నుంచే గ‌ణ‌నీయంగా పెరిగింది. జియో రాక ముందు 1జీబీ మొబైల్ డేటా పొందాలంటే నెల‌కు రూ.250 వ‌ర‌కు చెల్లించాల్సి వ‌చ్చేది. కానీ జియో రాక‌తో మొబైల్ డేటా ధ‌ర‌లు భారీగా త‌గ్గాయి. కేవ‌లం రూ.10 లోపే ప్ర‌స్తుతం 1జీబీ డేటా అందుబాటులో ఉంది. జియోతోపాటు ఎయిర్ టెల్‌, ఇత‌ర టెలికాం కంపెనీలు 5జి ఉన్న చోట అన్ లిమిటెడ్ డేటాను కూడా అందిస్తున్నాయి. ఇదంతా జియో పుణ్య‌మే అని చెప్ప‌వ‌చ్చు. చాలా వ‌ర‌కు ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల‌లో మొబైల్ డేటా భారీగా ల‌భిస్తోంది. దీంతో వినియోగ‌దారులు పెద్ద ఎత్తున డేటాను వాడుతున్నారు. ఇక ప్ర‌స్తుతం భార‌త్‌లో మొబైల్ వినియోగ‌దారుల నెల‌వారీ మొబైల్ డేటా వినియోగం రికార్డు స్థాయిలో పెరిగింద‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. గ‌తేడాది భార‌త్‌లో మొబైల్ వినియోగ‌దారుల స‌గ‌టు నెల‌వారీ మొబైల్ డేటా వినియోగం 31 జీబీకి పైగా న‌మోదైంద‌ని నోకియా త‌న 13వ వార్షిక మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇండెక్స్ (ఎంబీఐటీ)లో తెలియ‌జేసింది.

నెల‌కు స‌గ‌టున 31జీబీకి పైగా మొబైల్ డేటా వినియోగం..

ఎంబీఐటీలో అంత‌కు ముందు ఏడాది.. అంటే 2024లో న‌మోదైన స‌గ‌టు నెల‌వారీ మొబైల్ డేటా వినియోగం 27.5 జీబీ ఉండ‌గా ఇప్పుడ‌ది 31జీబీకి పైగా న‌మోదైంది. భార‌త్‌లో మొబైల్ వినియోగ‌దారులు డేటాను గ‌ణ‌నీయంగా వాడుతున్నార‌ని ఈ నివేదిక తెలియ‌జేస్తోంది. ఈ నివేదిక ప్ర‌కారం గ‌తేడాదిలో నెల‌వారీ 5జీ డేటా ట్రాఫిక్ 70 శాతం మేర పెర‌గ్గా మొత్తం డేటా వినియోగం 12.9 ఎగ్జాబైట్స్ (ఈబీ)కు చేరుకుంది. దీంతో దేశంలో మొత్తం మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ట్రాఫిక్‌లో 5జి వాటా 47 శాతానికి చేరుకుంది. ఒక్కో మొబైల్ వినియోగ‌దారు 2025లో నెల‌కు స‌గ‌టున 31జీబీ కి పైగా డేటాను వాడుతున్న‌ట్లు స్ప‌ష్ట‌మైంది. 5 ఏళ్ల‌లో ఇది 18 శాతం వార్షిక వృద్ధి రేటును క‌లిగి ఉంది. మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ (ఈఎంబీబీ) వేగంగా విస్త‌రిస్తోంద‌న‌డానికి ఇది నిద‌ర్శ‌న‌మ‌ని టెక్ నిపుణులు చెబుతున్నారు.

5జి వినియోగంలో రెండో స్థానంలో..

భార‌త్‌లో 2025లో మొబైల్ డేటా ట్రాఫిక్ నెల‌కు 27 ఈబీని అధిగ‌మించ‌గా, అంత‌కు ముందు వార్షిక వృద్ధి రేటు 21.7 శాతంగా న‌మోదైంది. ఇక ప్ర‌పంచంలోనే 5జి మొబైల్ యూజ‌ర్లు అత్య‌ధికంగా ఉన్న దేశాల్లో భార‌త్ రెండో స్థానంలో నిలిచింది. అలాగే 5జి డేటా వినియోగం, 5జి ఫిక్స్‌డ్ వైర్ లెస్ యాక్సెస్ (ఎఫ్‌డ‌బ్ల్యూఏ)లోనూ భారత్ రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. మొబైల్ డేటా ట్రాఫిక్‌లో ఎఫ్‌డ‌బ్ల్యూఏ కీల‌కంగా మారింది. మొత్తం 5జి డేటాలో దీని వాటా 25 శాతానికి మించింది. 5జి ఎఫ్‌డ‌బ్ల్యూఏ వినియోగదారుల సంఖ్య‌లో ఏటా రెట్టింపు వృద్ధి క‌నిపిస్తోంద‌ని నివేదిక స్ప‌ష్టం చేసింది.

మెట్రో న‌గ‌రాల్లోనే ఎక్కువ‌..

దేశంలోని మెట్రో న‌గ‌రాల్లో 5జి సేవ‌ల‌ను ఎక్కువ శాతం మంది ఉప‌యోగిస్తున్నార‌ని నివేదిక వెల్ల‌డించింది. 5జి యూజ‌ర్ల సంఖ్య కూడా మెట్రో న‌గ‌రాల్లో గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. మొత్తం మొబైల్ డేటా ట్రాఫిక్‌లో 58 శాతం ఈ ప్రాంతాల్లోనే న‌మోదవుతోంది. దేఠ‌శంలో గ‌తేడాది 4జి మొబైల్స్ సంఖ్య 89.2 కోట్లు ఉండ‌గా, అందులో 38.3 కోట్లు 5జి సేవ‌ల‌ను అందిస్తున్నాయి. అలాగే చ‌వ‌క ధ‌ర‌ల‌కు ల‌భించే 5జి ఫోన్ల అమ్మ‌కాలు అంత‌కు ముందు ఏడాదితో పోలిస్తే గ‌తేడాదిలో 10 రెట్ల వృద్ధిని న‌మోదు చేశాయి. గ‌తేడాది రిలీజ్ అయిన అన్ని స్మార్ట్ ఫోన్ల‌లో 90 శాతానికి పైగా ఫోన్లు 5జి ఉన్న‌వే కావ‌డం విశేషం. కాగా 2031 వ‌ర‌కు దేశంలో 5జి మొబైల్ వినియోగ‌దారుల సంఖ్య 100 కోట్ల‌ను దాటుతుంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

Advertisement
Advertisement