త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Airtel | ఎయిర్‌టెల్ నుంచి ప్ర‌యారిటీ పోస్ట్‌పెయిడ్‌.. ఆ యూజ‌ర్ల‌కే మొద‌టి ప్రాధాన్య‌త‌..

Airtel | టెలికాం సంస్థ భార‌తి ఎయిర్‌టెల్ త‌న 5జి పోస్ట్‌పెయిడ్ మొబైల్ స‌ర్వీస్ యూజ‌ర్ల‌కు అద్భుత‌మైన స‌దుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్ పేరుతో కొత్త సేవను ప్రారంభించినట్లు ప్రకటించింది. 5జీ స్లైసింగ్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన ఈ సేవ ద్వారా పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు నెట్‌వర్క్ సామర్థ్యాన్ని డైనమిక్‌గా ప్రాధాన్య క్రమంలో కేటాయిస్తామని కంపెనీ తెలిపింది.

S

Business | Published On May 19, 2026, 5.39 pm IST

Airtel | ఎయిర్‌టెల్ నుంచి ప్ర‌యారిటీ పోస్ట్‌పెయిడ్‌.. ఆ యూజ‌ర్ల‌కే మొద‌టి ప్రాధాన్య‌త‌..
Advertisement

Airtel | టెలికాం సంస్థ భార‌తి ఎయిర్‌టెల్ త‌న 5జి పోస్ట్‌పెయిడ్ మొబైల్ స‌ర్వీస్ యూజ‌ర్ల‌కు అద్భుత‌మైన స‌దుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్ పేరుతో కొత్త సేవను ప్రారంభించినట్లు ప్రకటించింది. 5జీ స్లైసింగ్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన ఈ సేవ ద్వారా పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు నెట్‌వర్క్ సామర్థ్యాన్ని డైనమిక్‌గా ప్రాధాన్య క్రమంలో కేటాయిస్తామని కంపెనీ తెలిపింది. భారత్‌లో ఈ తరహా కమర్షియల్ రోల్ అవుట్ ఇదే మొద‌టి సారి అని ఎయిర్‌టెల్ వెల్లడించింది. కంపెనీ తెలిపిన ప్రకారం నిరంతరాయ కనెక్టివిటీపై ఆధారపడే బిజీ కస్టమర్ల కోసం ఈ సేవను ప్రత్యేకంగా రూపొందించారు. ముఖ్యంగా పని, ఎంటర్‌టైన్‌మెంట్ లేదా ఆన్‌లైన్ సహకార కార్యక్రమాల సమయంలో అంతరాయం లేకుండా నెట్‌వర్క్ అనుభవం అందించడమే లక్ష్యంగా ఈ సేవను తీసుకొచ్చినట్లు తెలిపింది.

5జీ స్లైసింగ్ టెక్నాలజీ అంటే..

ఈ సేవ కోసం ఎయిర్‌టెల్ తన 5జీ నెట్‌వర్క్‌ను స్లైసింగ్ టెక్నాలజీ ఆధునిక సామర్థ్యాలతో అప్‌గ్రేడ్ చేసింది. దీని వల్ల నెట్‌వర్క్ మరింత సమర్థవంతంగా మారడంతోపాటు అదనపు సామర్థ్యం కూడా లభిస్తుందని కంపెనీ పేర్కొంది. అలాగే అవసరమైన కస్టమర్లకు లక్ష్యితంగా మెరుగైన నెట్‌వర్క్ అనుభవాన్ని అందించే వీలుంటుందని తెలిపింది. నెట్‌వర్క్ సామర్థ్యాన్ని తెలివిగా విభజించి డైనమిక్‌గా నిర్వహించడం ద్వారా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో కూడా పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు స్థిరమైన, నమ్మకమైన కనెక్టివిటీ అందుతుందని ఎయిర్‌టెల్ వెల్లడించింది. గతేడాది కాలంలో అమెరికా, సింగపూర్, యునైటెడ్ కింగ్‌డమ్, మలేషియా వంటి దేశాల్లో స్లైసింగ్ ఆధారిత 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. భారత్‌లో ఈ సేవను ప్రారంభించిన తొలి టెలికాం సంస్థగా ఎయిర్‌టెల్ నిలిచింది. ఈ సేవ‌ ప్రారంభం ద్వారా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మరింత స్మార్ట్, బలమైన డిజిటల్ నెట్‌వర్క్ నిర్మాణంపై తమ పెట్టుబడులు కొనసాగుతున్నాయని కంపెనీ పేర్కొంది. ఆధునిక టెక్నాలజీని కస్టమర్ కేంద్రిత ఆవిష్కరణలతో కలపాలనే తమ నిబద్ధతకు ఇది నిదర్శనమని తెలిపింది.

ఎయిర్‌టెల్ ఎండీ, సీఈవో శాశ్వ‌త్ శ‌ర్మ మాట్లాడుతూ త‌మ‌ కస్టమర్ల అనుభవాన్ని మెరుగుపరిచే ఆవిష్కరణలను అందించడంపైనే త‌మ‌ దృష్టి ఉంద‌న్నారు. 5జీ స్లైసింగ్ టెక్నాలజీతో రూపొందించిన ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్ త‌మ తాజా ఆవిష్కరణ అని తెలిపారు. ట్రాఫిక్‌లో ఉండి క్లయింట్ కాల్‌లో పాల్గొన్నా, భారీ జనసమ్మర్థంలో కాన్సర్ట్ స్ట్రీమింగ్ చేసినా, రద్దీ మార్కెట్‌లో క్యాబ్ బుక్ చేసినా కస్టమర్లకు మరింత స్థిరమైన, నమ్మకమైన అనుభవాన్ని ఇది అందిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement