త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jio Hotstar | జియో హాట్‌స్టార్‌లో ఇక నెల‌వారి ప్లాన్లు.. నెల‌కు కేవ‌లం రూ.79కే..

Jio Hotstar | వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ తన సబ్‌స్క్రిప్షన్ విధానంలో కీలక మార్పులు చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త విధానం జనవరి 28వ తేదీ నుంచి అమలులోకి రానుంది.

S

Technology | Published On Jan 20, 2026, 6.45 am IST

Jio Hotstar | జియో హాట్‌స్టార్‌లో ఇక నెల‌వారి ప్లాన్లు.. నెల‌కు కేవ‌లం రూ.79కే..
Advertisement

Jio Hotstar | వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ తన సబ్‌స్క్రిప్షన్ విధానంలో కీలక మార్పులు చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త విధానం జనవరి 28వ తేదీ నుంచి అమలులోకి రానుంది. అన్ని ప్లాన్లకు నెలవారి చెల్లింపు (మంత్లీ బిల్లింగ్) సదుపాయాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా, అంతర్జాతీయ కంటెంట్ అందుబాటులో కూడా మార్పులు చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. మొబైల్ వినియోగదారులు, పెద్ద స్క్రీన్‌లపై (స్మార్ట్ టీవీలు) వీక్షించే కుటుంబాలకు మరింత సౌలభ్యం కల్పించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టినట్లు తెలిపింది. ఇప్పటివరకు త్రైమాసికం, వార్షిక ప్యాకేజీలకే పరిమితమైన సబ్‌స్క్రిప్షన్ విధానానికి ఇప్పుడు నెలవారీ ప్లాన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇది మొబైల్, సూపర్, ప్రీమియం అనే మూడు విభాగాలకూ వర్తిస్తుంది.

పెద్ద స్క్రీన్ల వీక్ష‌కుల సంఖ్య పెర‌గ‌డ‌మే కార‌ణం..

ప్లాట్‌ఫామ్ ప్రారంభమైన తర్వాత గత 11 నెలల్లో పెద్ద స్క్రీన్‌లపై వీక్షకుల సంఖ్య గణనీయంగా పెరగడంతో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఈ మార్పులు తీసుకొచ్చినట్లు జియో హాట్‌స్టార్ పేర్కొంది. తక్కువ ఖర్చుతో సేవలను అనుభవించే అవకాశం కల్పించడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలిపింది. కొత్త విధానంలో అంతర్జాతీయ కంటెంట్, ముఖ్యంగా హాలీవుడ్ కంటెంట్ స్ట్రీమింగ్‌లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. సూపర్, ప్రీమియం ప్లాన్లను తీసుకునే కొత్త వినియోగదారులకు హాలీవుడ్ కంటెంట్ యథావిధిగా అందుబాటులో ఉంటుంది. అయితే మొబైల్ ప్లాన్ వినియోగదారులకు ఇకపై హాలీవుడ్ కంటెంట్ డిఫాల్ట్‌గా ఇవ్వబడదు. అవసరమైతే అదనపు చార్జీలతో యాడాన్ రూపంలో తీసుకోవచ్చు. దీని ద్వారా వినియోగదారులు తమ అవసరానికి అనుగుణంగా ఖర్చును నియంత్రించుకోవచ్చని సంస్థ వివరించింది.

మొబైల్ ప్లాన్ నెల‌కు రూ.79..

కొత్త ధరల ప్రకారం మొబైల్ ప్లాన్ నెలకు రూ.79 నుంచి ప్రారంభమవుతుంది. సూపర్ ప్లాన్ నెలకు రూ.149 కాగా, ప్రీమియం ప్లాన్ నెలకు రూ.299గా నిర్ణయించారు. మొబైల్ ప్లాన్ ధరలో మార్పు లేకపోయినా, సూపర్ , ప్రీమియం వార్షిక ప్యాకేజీల ధరలు వరుసగా రూ.200 మరియు రూ.700 పెరిగాయి. త్రైమాసిక ప్యాకేజీల ధరలు కూడా సూపర్ ప్లాన్‌కు రూ.50, ప్రీమియం ప్లాన్‌కు రూ.200 మేర పెరిగాయి. ఇప్పటికే సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వినియోగదారులకు ఈ మార్పులు వర్తించవని జియో హాట్‌స్టార్ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న కస్టమర్లు తమ ఆటో-రిన్యువల్ కొనసాగిస్తే పాత ధరలు, పాత కంటెంట్ విధానంతోనే సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. కొత్త ధరలు, కంటెంట్ ప్యాకేజింగ్ విధానం జనవరి 28వ తేదీ తర్వాత కొత్తగా చేరే వినియోగదారులకు మాత్రమే వర్తిస్తాయి.

3 ల‌క్ష‌ల గంట‌ల‌కు పైగా కంటెంట్‌..

కాగా గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్ ఇప్పటికే బిలియన్‌కు పైగా డౌన్‌లోడ్స్‌ను సాధించగా, నెలకు సగటున 45 కోట్ల మందికిపైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారని సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని పిన్‌కోడ్ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫామ్‌లో మూడు లక్షల గంటలకు పైగా కంటెంట్ అందుబాటులో ఉండగా, క్రీడా ప్రసారాలు, వందకు పైగా టీవీ చాన‌ల్స్ కార్యక్రమాలు, ప్రత్యేక అనిమే విభాగం, అలాగే స్పార్క్స్ పేరిట క్రియేటర్ ఆధారిత కంటెంట్ కూడా ఉంది. ఈ సందర్భంగా జియోస్టార్ సంస్థలో SVOD విభాగం అధిపతి, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సుశాంత్ శ్రీరామ్ మాట్లాడుతూ, భారతదేశంలో విస్తృతమైన, సమగ్రమైన ఎంటర్‌టైన్‌మెంట్ ఎకోసిస్టమ్‌ను నిర్మించడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రేక్షకులు ఎలా, ఎక్కడ కంటెంట్‌ను చూడాలనుకుంటున్నారో దానికి అనుగుణంగా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు ఉండాలని భావించి ఈ మార్పులు తీసుకొచ్చినట్లు చెప్పారు. ప్రీమియం కంటెంట్‌, ప్రత్యక్ష క్రీడా ప్రసారాలు, అత్యుత్తమ నాణ్యత గల స్ట్రీమింగ్ అనుభవం అందించేందుకు ఈ కొత్త విధానం దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement