త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IBM CEO Arvind Krishna | ఏఐ వ‌ల్ల ఈ ఉద్యోగాల‌కు తీవ్ర‌మైన ముప్పు: ఐబీఎం సీఈవో అర‌వింద్ కృష్ణ‌

IBM CEO Arvind Krishna | కృత్రిమ మేథ‌ (ఏఐ) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఏయే ఉద్యోగాలు ఎక్కువ ప్రమాదంలో ఉన్నాయో, ఈ మారుతున్న ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగులు తమ ప్రాధాన్యతను ఎలా నిలబెట్టుకోవాలో ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ స్పష్టంగా చెప్పారు. బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ప‌లు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

S

Technology | Published On Feb 15, 2026, 9.58 am IST

IBM CEO Arvind Krishna | ఏఐ వ‌ల్ల ఈ ఉద్యోగాల‌కు తీవ్ర‌మైన ముప్పు: ఐబీఎం సీఈవో అర‌వింద్ కృష్ణ‌
Advertisement

IBM CEO Arvind Krishna | కృత్రిమ మేథ‌ (ఏఐ) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఏయే ఉద్యోగాలు ఎక్కువ ప్రమాదంలో ఉన్నాయో, ఈ మారుతున్న ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగులు తమ ప్రాధాన్యతను ఎలా నిలబెట్టుకోవాలో ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ స్పష్టంగా చెప్పారు. బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ప‌లు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కృష్ణ అభిప్రాయం ప్రకారం కాల్ సెంటర్ ఉద్యోగాలు ఏఐ ఆటోమేషన్‌కు అత్యంత సులభంగా గురయ్యే విభాగాల్లో ఒకటిగా మార‌నున్నాయ‌ని అన్నారు. రొటీన్ కస్టమర్ ఇంటరాక్షన్‌లను ఏఐ సిస్టమ్‌లు మరింత సమర్థంగా నిర్వహించగలగడం వల్ల, కాలక్రమంలో ఈ రంగంలో సుమారు 50 శాతం ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

ఈ విభాగాల్లో ఉద్యోగాలు స‌గం మేర త‌గ్గే చాన్స్‌..

కాల్ సెంటర్ ఉద్యోగాల్లో సగం వరకు కాలక్రమంలో తగ్గిపోతాయని తాను సులభంగా ఊహించగలన‌ని అర‌వింద్ కృష్ణ‌ స్పష్టం చేశారు. కాల్ సెంటర్లతో పాటు ఐటీ, హెచ్‌ఆర్ హెల్ప్‌డెస్క్‌ల వంటి అంతర్గత సపోర్ట్ విభాగాలు కూడా ప్రమాదంలో ఉన్నాయని ఆయన అన్నారు. ఇవి సాధారణంగా పునరావృత పనులు, ముందే అంచనా వేయగల వర్క్‌ఫ్లోలపై ఆధారపడి ఉంటాయి. అలాంటి పనుల్లో ఆధునిక ఏఐ అద్భుతంగా పనిచేస్తుందని ఆయన అన్నారు. అలాగే అకౌంట్స్ పేయబుల్, రిసీవబుల్ విభాగాల్లో రికార్డులను మ్యాచింగ్ చేయడం వంటి పునరావృత డాక్యుమెంట్ ప్రాసెసింగ్ పనులు కూడా రాబోయే నెలలు, సంవత్సరాల్లో పూర్తిగా ఆటోమేట్ అయ్యే అవకాశముందని అరవింద్ కృష్ణ తెలిపారు.

స్కిల్స్ మెరుగు ప‌డాలి..

అయితే ఈ మార్పు కేవలం సాంకేతిక పరమైనదే కాదని, ఇది సామాజిక మార్పు కూడా అని ఆయన స్పష్టం చేశారు. ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయే వారికి కొత్త అవకాశాలు కల్పించేలా అప్‌స్కిల్లింగ్, రీ-స్కిల్లింగ్‌పై కార్పొరేట్లు, ప్రభుత్వాలు పెట్టుబడి పెట్టాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు. ఇదే సమయంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) వంటి రంగాలను ఆయన వృద్ధి కేంద్రాలుగా పేర్కొన్నారు. రొటీన్ ఉద్యోగాలు తగ్గుతున్నప్పటికీ అధునాతన రంగాల్లో ఐబీఎం నియామకాలను పెంచిందని తెలిపారు. ఉత్పాదకత ఎక్కువగా ఉన్న రంగాల్లో, ముఖ్యంగా ఆర్ అండ్ డీలో మరిన్ని నియామకాలు జరుగుతాయ‌ని చెప్పారు. ఉద్యోగాల తగ్గుదల ఉన్నా, మొత్తం మీద కొత్త ఉద్యోగాల పెరుగుదల వాటిని మించి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇలాంటి ఉద్యోగాల‌ను ఎంచుకుంటే మేలు..

కాగా అరవింద్ కృష్ణ వ్యాఖ్యలు ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఏఐ కొన్ని పనులను భర్తీ చేసినప్పటికీ సృజనాత్మకత, క్లిష్ట సమస్యల పరిష్కారం, వ్యూహాత్మక ఆలోచన అవసరమైన ఉద్యోగాలకు కొత్త డిమాండ్‌ను సృష్టిస్తున్న‌ట్లు స్ప‌ష్ట‌మవుతోంది. కృత్రిమ మేథ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా కీల‌క విష‌యాల్లో అంతిమంగా మ‌నుషుల నిర్ణ‌య‌మే ఫైన‌ల్ అవుతుంది. ఒక విష‌యాన్ని స‌రైందా కాదా అని నిర్ణ‌యించ‌డంలో చివ‌ర‌క మ‌నుషులదే పైచేయి అవుతుంది. ఆ స్థానాన్ని ఎప్ప‌టికీ ఏఐ భ‌ర్తీ చేయ‌లేదు. క‌నుక అలాంటి రంగాల్లో ఉద్యోగాలకు ఏఐ వ‌ల్ల అస‌లు ముప్పు ఉండ‌ద‌ని అర‌వింద్ కృష్ణ వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి స్ప‌ష్ట‌మవుతోంది. కానీ రొటీన్ గా చేసే అనేక ప‌నుల‌కు సంబంధించి, అంటే మ‌నిషి మెద‌డు అవ‌స‌రం లేకుండా యాంత్రికంగా జ‌రిగే అనేక ప‌నుల‌కు మాత్రం ఏఐ నుంచి ముప్పు పొంచి ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. క‌నుక ఉద్యోగులు కూడా ఈ విధంగా మారాల్సి ఉంటుంది. త‌మ‌ నైపుణ్యాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మెరుగు ప‌రుచుకుంటూ, మ‌నిషి ప్ర‌మేయం క‌చ్చితంగా అవ‌స‌రం అయ్యే రంగాల‌ను ఎంచుకుని ఆ రంగాల్లో ముందుకు సాగితే ఎంత కాలం అయినా స‌రే అస‌లు ఏఐ నుంచి ముప్పు పొంచి ఉండ‌దనే చెప్ప‌వ‌చ్చు. అందువ‌ల్ల ఈ విష‌యంలో ఉద్యోగులు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు.

Advertisement
Advertisement