త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Standard Chartered CEO Bill Winters | ఏఐ దెబ్బకు బ్యాంకు ఉద్యోగాలు ఔట్? స్టాండర్డ్ చార్టర్డ్ సీఈవో సంచలనం..

Standard Chartered CEO Bill Winters | ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో ఏఐ కారణంగా ఉద్యోగాలు తగ్గిపోతాయనే భయాలు పెరుగుతున్న వేళ, ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ స్టాండ‌ర్డ్ చార్ట‌ర్డ్ సీఈవో బిల్ వింట‌ర్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరగడంతో బ్యాంకులో వేలాది ఉద్యోగ పాత్రలు తగ్గనున్నాయని ఆయన హెచ్చరించారు.

S

Business | Published On May 19, 2026, 12.41 pm IST

Standard Chartered CEO Bill Winters | ఏఐ దెబ్బకు బ్యాంకు ఉద్యోగాలు ఔట్? స్టాండర్డ్ చార్టర్డ్ సీఈవో సంచలనం..
Advertisement

Standard Chartered CEO Bill Winters | ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో ఏఐ కారణంగా ఉద్యోగాలు తగ్గిపోతాయనే భయాలు పెరుగుతున్న వేళ, ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ స్టాండ‌ర్డ్ చార్ట‌ర్డ్ సీఈవో బిల్ వింట‌ర్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరగడంతో బ్యాంకులో వేలాది ఉద్యోగ పాత్రలు తగ్గనున్నాయని ఆయన హెచ్చరించారు. తక్కువ విలువ కలిగిన మానవ వనరులను టెక్నాలజీతో భర్తీ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. 2030 నాటికి తమ సపోర్ట్ స్టాఫ్‌లో 15 శాతానికి పైగా కోత విధించే ప్రణాళికను బ్యాంక్ ప్రకటించింది. కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఏఐ వినియోగాన్ని భారీగా పెంచనున్నట్లు వెల్లడించింది. గతేడాది చివరి నాటికి భారత్, చైనా, పోలాండ్, సింగపూర్, హాంకాంగ్‌లలో కలిపి సుమారు 52 వేల మంది ఈ విభాగాల్లో పనిచేస్తున్నారు. హాంకాంగ్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడిన బిల్ వింట‌ర్స్ ఇది ఖర్చు తగ్గింపు కాద‌న‌, కొన్ని సందర్భాల్లో తక్కువ విలువ కలిగిన హ్యూమన్ క్యాపిటల్‌ను టెక్నాలజీ, ఇన్వెస్ట్‌మెంట్ క్యాపిటల్‌తో భర్తీ చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఉద్యోగాలపై ప్రభావం పడే సిబ్బందికి ముందుగానే స్పష్టమైన సమాచారం ఇస్తామని కూడా తెలిపారు.

ఉద్యోగాల‌ను ఏఐ భ‌ర్తీ చేస్తోందా..?

అలాగే తాము నేరుగా ఉద్యోగాల తొలగింపులు చేయడం లేద‌ని, కానీ ఉద్యోగ పాత్రలను యంత్రాల వైపు మళ్లిస్తున్నామ‌ని బిల్ స్ప‌ష్టం చేశారు. ఏఐ అభివృద్ధితో ఇది ఇంకా వేగంగా జరుగుతుంద‌ని ఆయన అన్నారు. కాగా ఇప్ప‌టి వరకు ఏఐని మానవ పనిని సులభతరం చేసే సాధనంగా మాత్రమే ప్రపంచ సంస్థలు చూపించగా, ఇప్పుడు అది నేరుగా ఉద్యోగాలను భర్తీ చేసే స్థాయికి చేరుతోందనే అభిప్రాయాలు పెరుగుతున్నాయి. గతంలో జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో. సీఈవో జేమీ డైమ‌న్ కూడా ఏఐ ప్రభావాన్ని స్టీమ్ ఇంజిన్ ఆవిష్కరణతో పోల్చారు. బ్యాంక్ ఏఐపై చేసే వార్షిక ఖర్చులకు సమానంగా ఆదా వస్తోందని చెప్పారు. అలాగే గోల్డ్‌మ‌న్ సాక్స్ ప్రెసిడెంట్, సీఏఓఓ జాన్ వాల్డ్ర‌న్ బ్యాంక్‌లోని కొన్ని సంప్రదాయ కార్యకలాపాలను హ్యూమన్ అసెంబ్లీ లైన్ గా అభివర్ణిస్తూ, అవి ఆటోమేషన్‌కు అనువుగా ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికాలో సగం మంది పెద్దలు ఏఐ విస్తరణపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం వెల్లడించింది. భారీ విద్యుత్ వినియోగం చేసే డేటా సెంటర్ల నిర్మాణంపై కూడా స్థానిక స్థాయిలో వ్యతిరేకత పెరుగుతోంది.

పెరుగుతున్న ఆందోళ‌న‌..

ఇక బ్యాంకింగ్ రంగంలో ఏఐ వేగవంతమైన వినియోగంపై ప్రపంచ నియంత్రణ సంస్థలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వాల్ స్ట్రీట్ సంస్థలు ప్రస్తుతం ఆంథ్రోపిక్ రూపొందించిన మైథోస్ మోడల్‌ను అంతర్గతంగా పరీక్షిస్తున్నాయి. డిజిటల్ భద్రతా లోపాలను గుర్తించేందుకు దీనిని ఉపయోగించాలని అమెరికా అధికారులు ప్రోత్సహిస్తున్నారు. అయితే ఏఐ విస్తృత వినియోగం వల్ల సైబర్ నేరగాళ్లకు కూడా అధునాతన సాధనాలు అందుబాటులోకి వచ్చాయని, దీని కారణంగా గ్లోబల్ ఫైనాన్షియల్ రంగంపై కొత్త తరహా సైబర్ దాడులు పెరుగుతున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Advertisement
Advertisement