త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Google | స్టార్ట‌ప్ సంస్థ‌ల‌కు గూగుల్ ప్ర‌త్యేక ప్రోగ్రామ్‌.. ఎంపికైతే ఉచితంగా స‌పోర్ట్‌..

Google | దేశంలో ఉన్న స్టార్ట‌ప్‌ల‌కు మ‌ద్ద‌తు ఇచ్చేలా టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ ఈ ఏడాదికి గాను త‌న స్టార్టప్స్ యాక్సిల‌రేట‌ర్ ప్రోగ్రామ్‌కు ఆసక్తి, అర్హ‌త ఉన్న స్టార్ట‌ప్‌ల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ మేర‌కు గూగుల్ ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. ఏఐ ఆధారిత స్టార్టప్స్‌కు స‌హాయం అందించేలా ఈ కార్య‌క్ర‌మాన్ని రూపొందించారు.

S

Technology | Published On Mar 31, 2026, 2.34 pm IST

Google | స్టార్ట‌ప్ సంస్థ‌ల‌కు గూగుల్ ప్ర‌త్యేక ప్రోగ్రామ్‌.. ఎంపికైతే ఉచితంగా స‌పోర్ట్‌..
Advertisement

Google | దేశంలో ఉన్న స్టార్ట‌ప్‌ల‌కు మ‌ద్ద‌తు ఇచ్చేలా టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ ఈ ఏడాదికి గాను త‌న స్టార్టప్స్ యాక్సిల‌రేట‌ర్ ప్రోగ్రామ్‌కు ఆసక్తి, అర్హ‌త ఉన్న స్టార్ట‌ప్‌ల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ మేర‌కు గూగుల్ ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. ఏఐ ఆధారిత స్టార్టప్స్‌కు స‌హాయం అందించేలా ఈ కార్య‌క్ర‌మాన్ని రూపొందించారు. అడ్వాన్స్‌డ్ ఏఐ రంగాల్లో స్కేల‌బుల్ ప‌రిష్కారాల‌ను అభివృద్ధి చేస్తూ, వాటిని వాస్త‌వ ప్ర‌పంచంలో అమ‌లు చేసే దిశ‌గా స్టార్ట‌ప్‌ల‌ను రూపొందిస్తున్న సంస్థ‌ల‌కు ఈ కార్య‌క్ర‌మం ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ‌నుంది. ఈ యాక్సిల‌రేట‌ర్ ప్రోగ్రామ్‌ను 3 నెల‌ల పాటు నిర్వ‌హించ‌నున్నామ‌ని గూగుల్ తెలిపింది.

ఈసారి బ్యాచ్‌లో నాలుగు ఏఐ రంగాల‌పై ఫోక‌స్‌..

యాక్సిల‌రేట‌ర్ ప్రోగ్రామ్ ఈక్విటీ-ఫ్రీ అని, సీడ్ నుంచి సిరీస్ ఎ ద‌శ‌లో ఉన్న భార‌త స్టార్ట‌ప్స్ కోసం ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌వేశ‌పెట్టామని గూగుల్ తెలియ‌జేసింది. దేశానికి ప్ర‌త్యేక‌మైన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేలా లేదా ప‌రిశ్ర‌మ‌ల కోసం ప్ర‌త్యేక ఏఐ వ్య‌వ‌స్థ‌ల‌ను రూపొందించే సంస్థ‌ల‌పై ఈ కార్య‌క్ర‌మం దృష్టి సారించ‌నుంది. ఇందులో భాగంగా ఈసారి బ్యాచ్‌లో మొత్తం నాలుగు ప్ర‌ధాన ఏఐ రంగాల‌పై దృష్టి సారించ‌నున్నారు. ఏజెంటిక్ ఏఐ ద్వారా ఆలోచ‌నాత్మ‌క వ్య‌వ‌స్థ‌లు, ఆటోమేటెడ్ వర్క్ ఫ్లోల‌ను నిర్వ‌హించ‌డం, మ‌ల్టీమోడ‌ల్ ఏఐ ద్వారా ఆడియో, వీడియో, ఫొటోల ఆధారిత ఏఐ మోడ‌ల్స్‌ను తీర్చిదిద్దడం, ఫిజిక‌ల్ ఏఐ ద్వారా రోబోటిక్స్ త‌యారీ, హార్డ్ వేర్‌తో అనుసంధానించ‌డం, సావ‌రిన్ ఏఐ ద్వారా స్థానికుల కోసం ప్ర‌త్యేక ఏఐ మోడ‌ల్స్‌ను రూపొందించ‌డం వంటి రంగాల‌పై దృష్టి సారిస్తారు.

ఈక్విటీ ఇవ్వాల్సిన ప‌నిలేదు..

ఈ కార్య‌క్ర‌మానికి ఎంపికైన స్టార్ట‌ప్‌ల‌కు గూగుల్ అనేక విధాలుగా మ‌ద్ద‌తును అందించ‌నుంది. స్టార్ట‌ప్స్ ఈక్విటీ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేకుండా సాంకేతిక‌, ఆప‌రేష‌న‌ల్ స‌పోర్ట్‌ను అందించ‌నుంది. గూగుల్‌లో ఉన్న నిపుణులతో క‌లిసి స్టార్ట‌ప్ సంస్థ‌లు గూగుల్‌కు చెందిన ప‌లు ఏఐ మోడ‌ల్స్‌తో త‌మ ఉత్ప‌త్తుల‌ను మ‌రింత మెరుగుప‌రిచే విధంగా అభివృద్ధి చేయ‌వ‌చ్చు. గూగుల్‌కు చెందిన డీప్‌మైండ్‌, క్లౌడ్‌, హెల్త్‌, ఆండ్రాయిడ్ వంటి విభాగాల నిపుణుల నుంచి గైడెన్స్ పొంద‌వ‌చ్చు. ఎంపికైన స్టార్ట‌ప్‌ల‌కు ఉచితంగా గూగుల్ క్లౌడ్ క్రెడిట్స్ ఇస్తారు. అడ్వాన్స్‌డ్ ఏఐ డెవ‌ల‌ప్‌మెంట్ టూల్స్‌ను వాడుకునే వీలు క‌ల్పిస్తారు.

గ‌ణ‌నీయ‌మైన వృద్ధిని సాధించిన స్టార్ట‌ప్స్‌..

ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా స్టార్ట‌ప్‌ల ప‌నితీరు, ప్ర‌ద‌ర్శ‌న‌ను ఎప్ప‌టిక‌ప్పుడు గూగుల్ నిపుణులు స‌మీక్షిస్తారు. వారానికొక‌సారి ఈ స‌మీక్ష ఉంటుంది. ప్ర‌త్యేక స‌క్సెస్ మేనేజ‌ర్లు ఉత్పత్తి, టెక్నాల‌జీ, వృద్ధి సూచీల‌ను ప‌రిశీలిస్తారు. కాగా గ‌తంలో ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న స్టార్టప్స్ గ‌ణ‌నీయ‌మైన వృద్ధిని సాధించాయ‌ని గూగుల్ తెలిపింది. డీవ్యూ అనే సంస్థ ఆదాయం 4 రెట్లు పెరిగింద‌ని, సూపర్ జాయిన్ జెమిని మోడ‌ల్స్‌తో క‌చ్చిత‌త్వం, వేగం 50 శాతం మెరుగు ప‌డింద‌ని, ప‌ల్స్ భారీ డేటా విశ్లేష‌ణ ద్వారా ప్ర‌మాదంలో ప‌డిన 3 మిలియ‌న్ డాల‌ర్ల ఆదాయాన్ని గుర్తించింద‌ని తెలిపింది.

భిన్న రంగాల్లో సేవ‌లు..

ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న ప‌లు స్టార్ట‌ప్స్ ఇప్ప‌టికే ఏఐ ద్వారా భిన్న రంగాల్లో సేవ‌ల‌ను అందిస్తున్నాయ‌ని గూగుల్ వెల్లడించింది. ఏఐ స్టెత్ అనే సంస్థ ఇంట‌ర్నెట్ అవ‌స‌రం లేకుండానే 20కి పైగా రాష్ట్రాల్లో 75వేల మందికి పైగా రోగుల‌ను స్మార్ట్ స్టెత‌స్కోప్ ద్వారా ప‌రీక్షించింద‌ని, వాణి ఏఐ అనే సంస్థ నెల‌కు 10 ల‌క్ష‌ల నిమిషాల వాయిస్ ప్రాసెసింగ్‌ను నిర్వ‌హిస్తూ కాల్ వ‌ర్క్ లోడ్‌ను 75 శాతం మేర త‌గ్గించుకుంద‌ని తెలిపింది. అలాగే రీసైలెన్స్ ఏఐ అనే సంస్థ గెమ్మా 12బితో క‌చ్చితత్వాన్ని 35 శాతం పెంచింద‌ని, ర‌న్‌టైమ్‌ను 23 శాతం త‌గ్గించింద‌ని, వీడియో ఎస్‌డీకే అనే స్టార్ట‌ప్ జెమిని లైవ్ ఏపీఐతో వాయిస్ ఏఐ ఏజెంట్‌ను అభివృద్ధి చేసి ఖ‌ర్చుల‌ను 40 శాతం మేర త‌గ్గించుకుంద‌ని, ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంద‌ని వెల్ల‌డించింది. కాగా ఈ ఏడాది బ్యాచ్‌ను జూన్ చివ‌రి వారంలో బెంగ‌ళూరులో ప్రారంభించ‌నున్నారు. ఇందులో భాగంగా ముందుగా బూట్ క్యాంప్ నిర్వ‌హిస్తారు. అక్టోబ‌ర్‌లో డెమో డే ద్వారా ప్రోగ్రామ్ ముగుస్తుంది. అందులో స్టార్ట‌ప్స్ త‌మ‌ పురోగ‌తిని, ప‌రిష్కారాల‌ను ప్ర‌ద‌ర్శిస్తాయి. ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్ స్టార్ట‌ప్స్‌ను ప్రారంభ ద‌శ నుంచి పూర్తి స్థాయి అమ‌లు ద‌శ‌కు తీసుకెళ్లేలా రూపొందించిన‌ట్లు గూగుల్ తెలిపింది. మ‌రిన్ని వివ‌రాల‌కు ఆస‌క్తి ఉన్న స్టార్ట‌ప్ సంస్థ‌లు https://startup.google.com/programs/accelerator/india/ అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement