త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

100G Internet | ఇక 4జీ, 5జీని మ‌ర‌చిపోయండి..! 100జీ వ‌స్తోంది..!

100G Internet | ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల వినియోగం భారీగా పెరిగింది. ఇంటర్నెట్‌ ప్రతి ఒక్కరికీ సులభంగా అందుబాటులోకి వచ్చింది. గ‌తంలో ఇంట‌ర్నెట్ స‌దుపాయానికి భారీగా డ‌బ్బులు చెల్లించాల్సి వ‌చ్చేది. అదే స‌మ‌యంలో వినియోగ‌దారులు ఇబ్బందులు సైతం ఎదుర్కోవాల్సిన ప‌రిస్థితి ఉండేది. ప్ర‌స్తుతం వేగవంతమైన సేవలను అందుబాటులోకి వ‌చ్చాయి.

P

Technology | Published On Feb 8, 2026, 5.06 pm IST

100G Internet | ఇక 4జీ, 5జీని మ‌ర‌చిపోయండి..! 100జీ వ‌స్తోంది..!
Advertisement
  • భార‌త్‌లో శ‌క్తివంత‌మైన నెట్‌వ‌ర్క్ ల్యాబ్ ఏర్పాటు
  • చెన్నైలో నోకియా భారీ రీసెర్చ్ సెంట‌ర్‌
  • కొత్త టెక్నాల‌జీపై ప‌రిశోధ‌న‌లు

100G Internet | ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల వినియోగం భారీగా పెరిగింది. ఇంటర్నెట్‌ ప్రతి ఒక్కరికీ సులభంగా అందుబాటులోకి వచ్చింది. గ‌తంలో ఇంట‌ర్నెట్ స‌దుపాయానికి భారీగా డ‌బ్బులు చెల్లించాల్సి వ‌చ్చేది. అదే స‌మ‌యంలో వినియోగ‌దారులు ఇబ్బందులు సైతం ఎదుర్కోవాల్సిన ప‌రిస్థితి ఉండేది. ప్ర‌స్తుతం వేగవంతమైన సేవలను అందుబాటులోకి వ‌చ్చాయి. 4జీ వచ్చిన తర్వాత టెలికాం కంపెనీలు తక్కువ ఖర్చుతోనే ఇంటర్నెట్‌ను అందిస్తున్నాయి. తాజాగా 5జీ టెక్నాలజీ కూడా అందుబాటులోకి రావడంతో కంపెనీల మధ్య పోటీ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు ఇంకా వేగవంతమైన ఇంటర్నెట్ అందించేందుకు ప‌లు సంస్థలు పరిశోధనలపై దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో ఫిన్‌లాండ్‌కు చెందిన నోకియా సంస్థ, తమిళనాడు రాజధాని చెన్నైలో భారీ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ కేంద్రంలో ఫిక్స్‌డ్‌ ఇంటర్నెట్‌ వేగాన్ని పెంచే టెక్నాలజీలపై పరిశోధనలు జరుగుతున్నాయి. అలాగే భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా 100G ఇంటర్నెట్‌పై కూడా ఇక్కడ పని చేస్తున్నారు.

అసలు ఏంటీ ఈ 100జీ ఇంటర్నెట్?

మనం ప్రస్తుతం వాడుతున్న ఇంటర్నెట్‌తో పోలిస్తే 100G ఎలా భిన్నంగా ఉంటుందో అర్థం చేసుకోవాలంటే.. ముందుగా డేటా ప్రయాణ విధానాన్ని తెలుసుకోవాలి. డేటా కాంతి వేగంతో ప్రయాణిస్తుంది. సరళంగా చెప్పాలంటే, 100జీ అంటే సెకనుకు 100 గిగాబిట్ల వేగం (100 Gbps). ఇది ప్రస్తుతం మనం వాడుతున్న సాధారణ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ కంటే వందల రెట్లు శక్తివంతమైనది. ఇప్పటి వరకు 100 ఎంబీపీఎస్ (Mbps), ఒక జీపీపీఎస్ (1 Gbps) వేగాన్ని చాలా ఎక్కువగా భావిస్తున్నాం. కానీ, 100G టెక్నాలజీ డేటా ట్రాన్స్‌ఫ‌ర్ సామర్థ్యాన్ని పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్తుంది. ఈ టెక్నాలజీ ప్రధానంగా పెద్ద డేటా సెంటర్లు, టెలికాం టవర్లు, క్లౌడ్‌ కంప్యూటింగ్ అవసరాల కోసం ఉపయోగించనున్నారు. దీని వల్ల ఇంటర్నెట్ ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం లేకుండా సాఫీగా కొనసాగుతుంది.

100జీ నెట్‌వర్క్ ఎలా పనిచేస్తుంది?

100జీ ఇంటర్నెట్‌కు అవసరమైన మొత్తం వ్యవస్థ ఫైబర్‌ ఆప్టిక్‌ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ఇందులో డేటా విద్యుత్‌ సంకేతాలుగా కాకుండా కాంతి కిరణాల రూపంలో ప్రయాణిస్తుంది. దీనికోసం ‘కోహిరెంట్‌ ఆప్టిక్స్‌’ అనే ప్రత్యేక టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఈ విధానంలో డేటాను కాంతి తరంగాల్లో కోడ్‌ చేసి, ఒకే ఫైబర్‌ కేబుల్‌ ద్వారా ఒకేసారి భారీ మొత్తంలో డేటాను పంపే అవకాశం ఉంటుంది. చెన్నైలోని నోకియా రీసెర్చ్ సెంటర్‌లో ఈ టెక్నాలజీని మరింత సమర్థవంతంగా మార్చే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

DWDM టెక్నాలజీ కీలక పాత్ర

ఇంత అధిక వేగాన్ని సాధించేందుకు ‘డెన్స్‌ వేవ్‌లెంగ్త్‌ డివిజన్‌ మల్టీప్లెక్సింగ్‌’ (DWDM) టెక్నాలజీని ఉపయోగిస్తారు. దీన్ని ఒక రహదారితో పోలిస్తే.. ఒకే రోడ్డుపై వేర్వేరు లైన్లు ఉన్నట్లుగానే ఇందులో ఒకే ఫైబర్‌పై వేర్వేరు రంగుల కాంతి ద్వారా డేటాను పంపిస్తారు. దాంతో కేబుల్స్ ఖర్చు తగ్గడమే కాకుండా, డేటా ట్రాన్స్‌ఫ‌ర్ సామర్థ్యం భారీగా పెరుగుతుంది. చెన్నైలో ఏర్పాటు చేసిన ఈ కొత్త ల్యాబ్‌లో 10G నుంచి 100G వరకు నెట్‌వర్క్‌లను పరీక్షించనున్నారు.

బలం బ్యాండ్‌విడ్త్‌

100జీ టెక్నాలజీ ప్రధాన బలం దాని బ్యాండ్‌విడ్త్‌. ఇది సెకనుకు బిలియన్ల బిట్ల డేటాను నిర్వహించగల సామర్థ్యం కలిగి ఉంటుంది. డేటా బదిలీలో ఆలస్యం చాలా తక్కువగా ఉంటుంది. దీంతో వీడియో కాల్స్‌, ఆన్‌లైన్ గేమింగ్‌, లైవ్ స్ట్రీమింగ్ వంటి సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా సాగుతాయి. అలాగే, సుదూర ప్రాంతాలకు డేటా పంపినప్పటికీ నాణ్యత తగ్గకుండా ఉండేందుకు ఇందులో ప్రత్యేకంగా లోపాలను సరిచేసే వ్యవస్థను ఉపయోగిస్తున్నారు.

సాధార‌ణ వినియోగదారులకు ఉపయోగం ఏంటి?

100జీ ఇంటర్నెట్ ఇప్పట్లో నేరుగా ఇళ్లకు అందుబాటులోకి రాకపోయినా, దీని ప్రభావం మాత్రం ప్రతి ఒక్క‌రిపై ఉంటుంది. ఈ టెక్నాలజీతో ప్రస్తుతం ఉన్న 5జీ సేవలు మరింత బలోపేతం అవుతాయి. అలాగే భవిష్యత్తులో వచ్చే 6జీ సేవలకు ఇది బలమైన పునాది కానుంది. నెట్‌వర్క్ బ్యాక్‌ఎండ్ బలంగా ఉన్నప్పుడు వీడియోలు ఎలాంటి అంత‌రాయం లేకుండా చూడ‌డం, క్లౌడ్ సేవల్లో వేగం, ఆన్‌లైన్ గేమింగ్ సేవ‌లు మెరుగ‌వ‌నున్నాయి. అలాగే, డిజిటల్ సేవల్లో విశ్వ‌స‌నీయ‌త‌, మ‌రింత సౌక‌ర్య‌వంతంగా ఉంటాయ‌ని నిపుణులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement