త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM E-DRIVE | పీఎం ఈ-డ్రైవ్‌లో ఈవీలకు భారీ ప్రోత్సాహం.. ఏ వాహ‌నాల‌కు ఎంత స‌బ్సిడీ..?

PM E-DRIVE | ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగంగా పెంచడంతోపాటు కాలుష్యాన్ని తగ్గించడం, దేశీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ-డ్రైవ్ పథకాన్ని అమలు చేస్తోంది. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.10,900 కోట్లను ఇటీవ‌లే కేటాయించింది.

S

Automobiles | Published On Aug 26, 2026, 5.45 pm IST

PM E-DRIVE | పీఎం ఈ-డ్రైవ్‌లో ఈవీలకు భారీ ప్రోత్సాహం.. ఏ వాహ‌నాల‌కు ఎంత స‌బ్సిడీ..?
Advertisement

PM E-DRIVE | ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగంగా పెంచడంతోపాటు కాలుష్యాన్ని తగ్గించడం, దేశీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ-డ్రైవ్ పథకాన్ని అమలు చేస్తోంది. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.10,900 కోట్లను ఇటీవ‌లే కేటాయించింది. ఈ ప‌థ‌కానికి గాను గ‌డువును కూడా ఇటీవ‌లే కేంద్రం 2028 మార్చి వ‌ర‌కు పొడిగించింది. ఈ ప‌థ‌కానికి వ‌స్తున్న స్పంద‌న కార‌ణంగా, దేశంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వినియోగాన్ని ప్రోత్స‌హించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ ప‌థ‌కాన్ని మ‌రికొంత కాలం వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు కేంద్రం ఇటీవ‌లే ప్ర‌క‌టించింది. ఇంతకుముందు అమలు చేసిన ఫేమ్-2, ఈఎంపీఎస్ పథకాల తర్వాత పీఎం ఈ-డ్రైవ్ కీలక పథకంగా ముందుకొచ్చింది. ఈ పథకం కింద ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, అంబులెన్సులు, ట్రక్కులు, ఛార్జింగ్ మౌలిక వసతులు, వాహన పరీక్షా సంస్థల ఆధునీకరణకు భారీగా నిధులు కేటాయించారు.

ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌కు రూ.4,391 కోట్లు..

ఎలక్ట్రిక్ బస్సుల కోసం రూ.4,391 కోట్లను కేటాయించారు. తొమ్మిది ప్రధాన మెట్రో నగరాల్లో మొత్తం 14,028 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రజా రవాణా వ్యవస్థలో ఎలక్ట్రిక్ బస్సుల వాటాను పెంచేందుకు రాష్ట్ర రవాణా సంస్థల ద్వారా వీటిని కొనుగోలు చేస్తున్నారు. డిమాండ్ సమీకరణ ప్రక్రియను కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు రూ.3,679 కోట్లను కేటాయించారు. సుమారు 24.79 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 3.16 లక్షల ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలకు ఈ పథకం ద్వారా మద్దతు అందించాలనే లక్ష్యం ఉంది. ప్రజలకు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు వ్యయాన్ని తగ్గించేందుకు కొనుగోలు సమయంలోనే సబ్సిడీని రాయితీ రూపంలో అందిస్తున్నారు.

ఎల‌క్ట్రిక్ ఆంబులెన్స్‌లు, చార్జింగ్ పాయింట్ల‌కు..

దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ వ్యవస్థను విస్తరించేందుకు రూ.2వేల కోట్లను కేటాయించారు. 72,300 పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడం ఈ కేటాయింపులో ప్రధాన లక్ష్యం. నాలుగు చక్రాల వాహనాల ఫాస్ట్ ఛార్జర్లు, బస్సులు, ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు అవసరమైన ఛార్జింగ్ సదుపాయాలను ఇందులో భాగంగా అభివృద్ధి చేయనున్నారు. ఎలక్ట్రిక్ అంబులెన్సుల కోసం రూ.500 కోట్లను కేటాయించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా రోగుల రవాణాకు ఉపయోగించే ఎలక్ట్రిక్ అంబులెన్సులను ప్రోత్సహించడం ఈ కేటాయింపు ఉద్దేశం. అలాగే సరకు రవాణా రంగంలో ఎలక్ట్రిక్ ట్రక్కుల వినియోగాన్ని పెంచేందుకు మరో రూ.500 కోట్లను కేటాయించారు. వాహన స్క్రాపింగ్ సర్టిఫికెట్లతో వీటి ప్రోత్సాహకాలను అనుసంధానించారు.

ద్విచ‌క్ర వాహ‌నాల‌కు రూ.780 కోట్లు..

ఎలక్ట్రిక్ వాహనాల పరీక్ష, ధ్రువీకరణ వ్యవస్థలను ఆధునీకరించేందుకు రూ.780 కోట్లను కేటాయించారు. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీతోపాటు ఇతర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన పరీక్షా ప్రయోగశాలలను ఆధునీకరించనున్నారు. పీఎం ఈ-డ్రైవ్ పథకంలో కొనుగోలుదారులకు నేరుగా నగదు చెల్లింపు కాకుండా కొనుగోలు సమయంలోనే ధరలో రాయితీ లభించే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఆ తర్వాత సంబంధిత తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఆ సబ్సిడీ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తుంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో కిలోవాట్ అవర్‌కు రూ.5వేల చొప్పున ప్రోత్సాహకం అందించారు. ఒక్కో వాహనానికి గరిష్ఠంగా రూ.10వేలు లేదా ఫ్యాక్టరీ నుంచి బయలుదేరే ధరలో 15 శాతం వరకు రాయితీ వర్తించింది.

గ‌రిష్టంగా రూ.5వేల వ‌ర‌కు స‌బ్సిడీ..

2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ప్రోత్సాహకాన్ని కిలోవాట్ అవర్‌కు రూ.2,500గా నిర్ణయించారు. ఒక్కో వాహనానికి గరిష్ఠంగా రూ.5వేల వరకు ఈ ప్రయోజనం లభిస్తుంది. ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలకు కూడా ఇదే విధంగా బ్యాటరీ సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకుని సబ్సిడీ అందిస్తున్నారు. వాణిజ్యపరంగా నమోదైన ఎలక్ట్రిక్ రిక్షాలు, ఎలక్ట్రిక్ కార్ట్లు, ఎల్5 ప్రయాణికుల, సరకు రవాణా వాహనాలు ఈ ప్రోత్సాహకాల పరిధిలోకి వస్తాయి. పీఎం ఈ-డ్రైవ్ సబ్సిడీ పొందేందుకు ప్రత్యేక ఈ-వోచర్ వ్యవస్థను అమలు చేస్తున్నారు. కొనుగోలుదారు ముందుగా అధికారిక డీలర్ వద్ద అర్హత ఉన్న ఎలక్ట్రిక్ వాహనాన్ని ఎంపిక చేసుకోవాలి. అనంతరం డీలర్ పీఎం ఈ-డ్రైవ్ అధికారిక పోర్టల్ లేదా యాప్ ద్వారా ఆధార్ ఆధారిత ముఖ ధ్రువీకరణతో కొనుగోలుదారుడి ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తారు.ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొనుగోలుదారుడి నమోదిత మొబైల్ నంబర్‌కు ప్రత్యేక డిజిటల్ ఈ-వోచర్ పంపిస్తారు. కొనుగోలుదారు ఆ వోచర్‌పై డిజిటల్‌గా సంతకం చేసిన తర్వాత డీలర్ వాహన రిటైల్ ఇన్వాయిస్‌లో సబ్సిడీ మొత్తాన్ని ముందుగానే తగ్గిస్తారు. అనంతరం సంబంధిత వాహన తయారీ సంస్థ ఆ సంతకం చేసిన ఈ-వోచర్‌ను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి సబ్సిడీ మొత్తాన్ని తిరిగి పొందుతుంది.

22 ల‌క్ష‌ల‌కు పైగా వాహ‌నాల‌కు..

ఇప్పటివరకు ఈ విస్తృత ఎలక్ట్రిక్ వాహన ప్రోత్సాహక వ్యవస్థ కింద 22 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలకు మద్దతు లభించింది. ఇందులో 19 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, సుమారు 3 లక్షల ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలు ఉన్నాయి. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగంగా పెంచడంలో ఈ ప్రోత్సాహకాలు కీలకంగా మారుతున్నాయి. ప్రజా రవాణా విభాగంలోనూ పీఎం ఈ-డ్రైవ్ ద్వారా భారీ స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నారు. మొదటి దశలో 10,900 ఎలక్ట్రిక్ బస్సుల కోసం టెండర్ ప్రక్రియ పూర్తయింది. రెండో దశలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, పుణె, సూరత్ వంటి నగరాలకు కేటాయించిన మిగిలిన బస్సుల కోసం టెండర్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో దేశీయంగా విలువను పెంచేందుకు పీఎం ఈ-డ్రైవ్‌లో దశలవారీ తయారీ కార్యక్రమాన్ని తప్పనిసరి చేశారు. దీని ద్వారా దేశీయంగా విడిభాగాల అసెంబ్లీ, బ్యాటరీ ప్యాక్ తయారీ, ఇతర కీలక భాగాల ఉత్పత్తిని పెంచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. తద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ పరిశ్రమను మరింత బలోపేతం చేయాలని కేంద్రం లక్ష్యంగా నిర్ణ‌యించుకుంది.

ఏయే వాహ‌నాల‌కు ఎంత‌..

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో గ‌రిష్టంగా రూ.5వేల వ‌ర‌కు స‌బ్సిడీ ఇస్తున్నారు. అయితే వాహ‌న గ‌రిష్ట ధ‌ర రూ.1.50 ల‌క్ష‌ల లోపు ఉండాలి. అలాగే ఎల‌క్ట్రిక్ రిక్షాలు, కార్ట్‌ల‌కు రూ.12,500 వ‌ర‌కు గ‌రిష్టంగా స‌బ్సిడీ ఇస్తారు. వాహ‌న ఫ్యాక్ట‌రీ ధ‌ర గ‌రిష్టంగా రూ.2.50 ల‌క్ష‌లు ఉండాలి. ఎల్‌5 కేట‌గిరికి చెందిన ప్ర‌యాణికుల‌, స‌ర‌కు ర‌వాణా ఎల‌క్ట్రిక్ త్రిచ‌క్ర వాహ‌నాల‌కు గ‌రిష్టంగా రూ.25వేల వ‌ర‌కు ప్రోత్సాహ‌కం ఇస్తున్నారు. వాహ‌న గ‌రిష్ట ధ‌ర రూ.5 ల‌క్ష‌లు ఉండాలి. ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు లభించే ప్రోత్సాహకం వాహనం ఫ్యాక్టరీ ధరలో 15 శాతానికి మించకూడదు. ఎలక్ట్రిక్ ట్రక్కులకు కిలోవాట్ గంటకు రూ.5వేల చొప్పున ప్రోత్సాహకం లభిస్తుంది. అయితే ఈ మొత్తం వాహనం ఫ్యాక్టరీ ధరలో 10 శాతానికి మించకూడదు. ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్నే ప్రోత్సాహకంగా పరిగణిస్తారు. అలాగే పాత వాణిజ్య వాహనాన్ని స్క్రాప్ చేసినట్లు ధ్రువీకరించే చెల్లుబాటు అయ్యే సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ (సీడీ) తప్పనిసరిగా ఉండాలి.

భారీ వాహ‌నాలు అయితే..

3.5 టన్నుల నుంచి 7.5 టన్నుల వరకు స్థూల వాహన బరువు ఉన్న ఎన్2 మధ్యస్థాయి వాహనాలకు గరిష్ఠంగా రూ.2.70 లక్షల ప్రోత్సాహకం లభిస్తుంది. 7.5 టన్నుల కంటే ఎక్కువ నుంచి 12 టన్నుల వరకు బరువు ఉన్న ఎన్2 మధ్యస్థాయి వాహనాలకు గరిష్ఠంగా రూ.3.60 లక్షల ప్రోత్సాహకం ఉంటుంది. 12 టన్నుల కంటే ఎక్కువ నుంచి 18.5 టన్నుల వరకు బరువు ఉన్న ఎన్3 భారీ వాహనాలకు గరిష్ఠంగా రూ.7.80 లక్షలు, 18.5 టన్నుల కంటే ఎక్కువ నుంచి 35 టన్నుల వరకు బరువు ఉన్న ఎన్3 భారీ వాహనాలకు గరిష్ఠంగా రూ.9.60 లక్షల ప్రోత్సాహకం లభిస్తుంది. 35 టన్నుల కంటే ఎక్కువ నుంచి 55 టన్నుల వరకు బరువు ఉన్న ఎన్3 భారీ వాహనాలకు గరిష్ఠంగా రూ.9.30 లక్షల ప్రోత్సాహకం అందుతుంది.

ఆంబులెన్స్‌ల‌కు ప్ర‌త్యేక నిధి..

ఎలక్ట్రిక్ బస్సులకు కిలోవాట్ గంటకు గరిష్ఠంగా రూ.10వేల వరకు సబ్సిడీ అందుతుంది. బస్సు పొడవు, సీటింగ్ సామర్థ్యాన్ని బట్టి ఒక్కో బస్సుకు రూ.35 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు గరిష్ఠ పరిమితి ఉంటుంది. ఫ్యాక్టరీ ధర రూ.2 కోట్లకు మించని ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే ఈ ప్రోత్సాహకానికి అర్హత పొందుతాయి. వీటిని రాష్ట్ర రవాణా సంస్థలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎలక్ట్రిక్ అంబులెన్సులకు రూ.500 కోట్ల ప్రత్యేక నిధి నుంచి సబ్సిడీలు కేటాయిస్తారు. ఈ వాహనాలు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్దేశించిన ప్రమాణాలతోపాటు ఏఐఎస్-125 వైద్య ప్రమాణాల స్పెసిఫికేషన్లకు పూర్తిగా అనుగుణంగా ఉండాలి.

Advertisement

తాజావార్తలు

Advertisement