త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telecom Rules 2026 | కొత్త సిమ్‌ కార్డుకు బయోమెట్రిక్‌ తప్పనిసరి.. కొత్త నిబంధనలు ఇవే..

Telecom Rules 2026 | టెలికమ్యూనికేషన్‌ చట్టం 2023 కింద కొత్త మొబైల్‌ సిమ్‌ కార్డు కొనుగోలు, వినియోగదారుల వివరాల అప్‌డేట్‌ణ, కనెక్షన్‌, డిస్‌కనెక్షన్‌, తిరిగి ధ్రువీకరణ వంటి ప్రక్రియలకు బయోమెట్రిక్‌ గుర్తింపు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టెలికమ్యూనికేషన్స్‌ (యూజర్‌ ఐడెంటిఫికేషన్‌) రూల్స్‌ 2026గా పిలిచే కొత్త నిబంధనలను టెలికమ్యూనికేషన్స్‌ శాఖ జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా ప్రకటించింది.

S

Technology | Published On Aug 22, 2026, 3.48 pm IST

Telecom Rules 2026 | కొత్త సిమ్‌ కార్డుకు బయోమెట్రిక్‌ తప్పనిసరి.. కొత్త నిబంధనలు ఇవే..
Advertisement

Telecom Rules 2026 | టెలికమ్యూనికేషన్‌ చట్టం 2023 కింద కొత్త మొబైల్‌ సిమ్‌ కార్డు కొనుగోలు, వినియోగదారుల వివరాల అప్‌డేట్‌ణ, కనెక్షన్‌, డిస్‌కనెక్షన్‌, తిరిగి ధ్రువీకరణ వంటి ప్రక్రియలకు బయోమెట్రిక్‌ గుర్తింపు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టెలికమ్యూనికేషన్స్‌ (యూజర్‌ ఐడెంటిఫికేషన్‌) రూల్స్‌ 2026గా పిలిచే కొత్త నిబంధనలను టెలికమ్యూనికేషన్స్‌ శాఖ జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా ప్రకటించింది. నోటిఫికేషన్‌ ప్రకారం.. అధీకృత సంస్థల ద్వారా నోటిఫైడ్‌ టెలికమ్యూనికేషన్‌ సేవలను వినియోగించే వ్యక్తుల గుర్తింపును బయోమెట్రిక్‌ ఆధారంగా ధ్రువీకరించేందుకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. 2025 సెప్టెంబర్‌లో టెలికమ్యూనికేషన్స్‌ శాఖ ఈ ప్రతిపాదనపై ప్రభావితమయ్యే వ్యక్తుల నుంచి అభ్యంతరాలు, సూచనలు కోరిన విషయం తెలిసిందే.

బ‌యోమెట్రిక్‌ను ధ్రువీక‌రించాల్సిందే..

డిజిటల్‌ అరెస్ట్‌ మోసాలు, ఆన్‌లైన్‌ మోసాలు దేశవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆధార్‌తో అనుసంధానమైన బయోమెట్రిక్‌ ధ్రువీకరణను డిజిటల్‌ లేదా ఎలక్ట్రానిక్‌ కేవైసీ ప్రక్రియలో తప్పనిసరి చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుకు తెచ్చింది. ఇందులో భాగంగానే దేశంలోని అంద‌రు టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లు తమ అధీకృత ఛానళ్ల ద్వారా సిమ్‌ కార్డుల జారీకి బయోమెట్రిక్‌ ఐడెంటిటీ వెరిఫికేషన్‌ సిస్టమ్‌ను అమలు చేయాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం బయోమెట్రిక్‌ ఆధారిత గుర్తింపు సమయంలో వినియోగదారులు తమ గుర్తింపును నిర్ధారించేందుకు సరైన సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి అధీకృత సంస్థ వినియోగదారులకు స్పష్టంగా తెలియజేయాలి. టెలికమ్యూనికేషన్‌ చట్టానికి అనుగుణంగా వ్యవహరించడంతో పాటు తప్పుడు, తప్పుదారి పట్టించే లేదా నకిలీ సమాచారం, పత్రాలను సమర్పించకూడదు. అలాగే ముఖ్యమైన సమాచారాన్ని దాచడం లేదా మరొక వ్యక్తిగా నటించి గుర్తింపు పొందడం కూడా నిషేధం.

ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డితే చ‌ర్య‌లు..

అలాగే వినియోగదారులు తమ టెలికమ్యూనికేషన్‌ కనెక్షన్‌ను లేదా సబ్‌స్క్రైబర్‌ ఐడెంటిటీ మాడ్యూల్‌ను మరొక వ్యక్తికి తిరిగి విక్రయించడం, బదిలీ చేయడం లేదా లీజుకు ఇవ్వడం చేయకూడదు. ఈ నిబంధనలను ఉల్లంఘించినా, తప్పుడు వివరాలు సమర్పించినా టెలికమ్యూనికేషన్‌ చట్టం కింద సంబంధిత వినియోగదారుపై చర్యలు, జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది. బయోమెట్రిక్‌ ఆధారిత గుర్తింపు ప్రక్రియను నిర్వహించే ప్రతి అధీకృత సంస్థ వినియోగదారుడికి ఒక అలర్ట్‌ పంపాలి. అందులో సంబంధిత టెలికమ్యూనికేషన్‌ కనెక్షన్‌ లేదా సిమ్‌ కార్డుకు సంబంధించిన వివరాలు ఉండాలి. వినియోగదారుడి వద్ద ఇప్పటికే ఉన్న ప్రతి టెలికమ్యూనికేషన్‌ కనెక్షన్‌ లేదా సిమ్‌ కార్డు ద్వారా ఈ అలర్ట్‌ పంపి, సంబంధిత కనెక్షన్‌ లేదా సిమ్‌ కోసం తానే అభ్యర్థన చేసిన వినియోగదారుడని ధ్రువీకరించాల్సి ఉంటుంది.

3 నెల‌ల్లో అమ‌లు చేయాలి..

వినియోగదారు ఆ అలర్ట్‌కు ప్రతికూలంగా స్పందిస్తే, సంబంధిత అధీకృత సంస్థ వెంటనే తదుపరి చర్యలు తీసుకోవాలి. వాస్తవ పరిస్థితులను నిర్ధారించి తగిన చర్యలు పూర్తయ్యే వరకు సంబంధిత టెలికమ్యూనికేషన్‌ కనెక్షన్‌ను నిలిపివేయాలి. బయోమెట్రిక్‌ వివరాలు సరిపోలినట్లు, ధ్రువీకరించినట్లు నిర్ధారణ అయిన తర్వాతే సేవలను కొనసాగించే అవకాశం ఉంటుంది. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తేదీ నుంచి మూడు నెలల్లోపు అన్ని అధీకృత సంస్థలు అవసరమైన సాంకేతిక, సంస్థాగత చర్యలను పూర్తి చేయాలి. నిబంధనలను సమర్థంగా అమలు చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేయాలి. అయితే అధీకృత సంస్థలు సిద్ధంగా లేకపోతే, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఈ గడువును మరో మూడు నెలలకు మించకుండా పొడిగించే అవకాశం కూడా ఉంటుంద‌ని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

Advertisement
Advertisement