త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju Sravan | రేవంత్ షెడ్యూల్‌లో ఏం తప్పులున్నాయో చెప్పాలి

Dasoju Sravan | సీఎం రేవంత్‌రెడ్డిని కేంద్ర విదేశాంగ శాఖ అవమానించిందని ఎమ్మెల్సీ డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. లండన్‌కు పర్మిషన్‌ ఇచ్చి.. అమెరికాకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రికి ఈ విధంగా జరగలేదని పేర్కొన్నారు. ఇది రేవంత్‌రెడ్డికి చెంపపెట్టు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు అవమానమని వ్యాఖ్యానించారు. శనివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

P

Telangana | Published On Aug 22, 2026, 3.43 pm IST

Dasoju Sravan | రేవంత్ షెడ్యూల్‌లో ఏం తప్పులున్నాయో చెప్పాలి
Advertisement
  • ముఖ్య‌మంత్రిని విదేశాంగ శాఖ అవ‌మానించింది
  • ఎలాంటి త‌ప్పుడు నిర్ణ‌యం తీసుకున్నారో బ‌య‌ట‌పెట్టాలి
  • కేంద్రం, రేవంత్ ఇద్ద‌రూ ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాల్సిందే
  • ఎమ్మెల్సీ దాసోజు శ్రావ‌ణ్ కుమార్‌

Dasoju Sravan | సీఎం రేవంత్‌రెడ్డిని కేంద్ర విదేశాంగ శాఖ అవమానించిందని ఎమ్మెల్సీ డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. లండన్‌కు పర్మిషన్‌ ఇచ్చి.. అమెరికాకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రికి ఈ విధంగా జరగలేదని పేర్కొన్నారు. ఇది రేవంత్‌రెడ్డికి చెంపపెట్టు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు అవమానమని వ్యాఖ్యానించారు. శనివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డి కేంద్ర విదేశాంగ శాఖ పర్మిషన్‌ ఇవ్వని విధంగా తప్పుడు నిర్ణయాలు ఏం తీసుకున్నారో బయటపెట్టాలని దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు. రేవంత్‌రెడ్డి ఏం తప్పు చేస్తారని కేంద్ర విదేశాంగ శాఖకు తెలిసిందో చెప్పాలన్నారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రం ఇద్దరూ సమాధానం చెప్పాలని అన్నారు. రేవంత్‌రెడ్డి షెడ్యూల్‌లో ఏం తప్పులున్నాయో తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఏ కార‌ణాల‌తో ఆపారో చెప్పాలి

రేవంత్‌రెడ్డిపై కేంద్రం ఆరోపణలు చేసి అమెరికా పర్యటనను రద్దు చేసిందని దాసోజు శ్రవణ్‌ అన్నారు. సందర్భం కాని పనులు సీఎం ఏం చేద్దామని అనుకున్నారని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యాలకు వ్యతిరేకంగా షెడ్యూల్‌ ఉందా? అని నిలదీశారు. రేవంత్‌రెడ్డి తన సీఎం పదవికి తగని విధంగా పనులు చేస్తున్నారని కేంద్రం చెప్పకనే చెప్పిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మనకు తెలియని విషయాన్ని అమెరికాలో చేస్తున్నారని, ఆ విషయాన్ని సీఎం, కేంద్రం ఇద్దరూ దాస్తున్నారని ఆరోపించారు. ఏ కారణాలతో రేవంత్‌రెడ్డిని ఆపారో మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారిందని దాసోజు శ్రవణ్‌ వ్యాఖ్యానించారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా ఉన్న న్యూయార్క్‌ మేయర్‌ మందానీని కలవడానికి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్తే ఆపారని అంటున్నారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి వ్యక్తిగతంగా అదానీ కోసం పోవాలనుకున్నారా? లేక న్యూయార్క్‌ మేయర్‌ మందానీ కోసం పోవాలనుకున్నారా? అని ప్రశ్నించారు. ఆగస్టు 27, 28 తేదీల్లో రేవంత్‌రెడ్డి షెడ్యూల్‌లో ఎవరిని కలుస్తున్నారో వారి పేర్లు లేవన్నారు. రేవంత్‌రెడ్డి విదేశాల్లో హవాలా చేస్తున్నారని బీజేపీ నేతలు అంటున్నారని తెలిపారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు బిట్‌కాయిన్స్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడుతున్నారని ప్రచారం జరుగుతోందన్నారు.

ఏ పాల‌సీలు స్ట‌డీ చేసేందుకు యూనివ‌ర్సిటీల‌కు..?

రేవంత్‌రెడ్డి ఏం పాలసీలు స్టడీ చేయడానికి యూనివర్సిటీలకు వెళ్తున్నారని దాసోజు శ్రవణ్‌ ప్రశ్నించారు. సీఎం తన పర్యటనలో ఏదో సమాచారాన్ని దాస్తున్నారని ఆరోపించారు. దీనిపై రేవంత్‌రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రేవంత్‌రెడ్డిని అమెరికాకు ఎవరు ఆహ్వానించారని, బోస్టన్‌, న్యూయార్క్‌లో సీఎం ఎవరిని కలవాలని అనుకున్నారో వెల్లడించాలని కోరారు. న్యూయార్క్‌ మేయర్‌ మందానీ సంఘ విద్రోహ శక్తి కాదని, ఆయన్ను కలిస్తే తమకు అభ్యంతరం లేదని దాసోజు శ్రవణ్‌ అన్నారు. మందానీని కలవాలని అనుకుంటే సీఎం రేవంత్‌రెడ్డి షెడ్యూల్‌లో ఎందుకు లేదని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి పర్మిషన్‌ ఎందుకు రద్దు చేశారో కేంద్ర విదేశాంగ శాఖ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ఇద్దరూ కలిసి డ్రామాలు ఆడుతున్నట్లు భావిస్తామని అన్నారు. 2024లో రేవంత్‌రెడ్డి పర్యటనకు పర్మిషన్‌ ఇచ్చి.. 2026లో ఎందుకు పర్మిషన్‌ ఇవ్వలేదో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని దాసోజు శ్రవణ్‌ కోరారు. రేవంత్‌రెడ్డి సొంత పెట్టుబడులు పెట్టడానికి వెళ్లారా? లేక రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికి వెళ్లారా? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి నిజాయితీపరుడు అయితే తన పర్యటన రద్దు వెనుక ఏం జరిగిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ట్రంప్‌తో మోదీ ప్ర‌భుత్వాన్ని కూల్చుతార‌ని భావించారా?

రేవంత్‌రెడ్డి నోట్ల కట్టలతో తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చాలని చూశారని దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ట్రంప్‌ పేరును హైదరాబాద్‌లో రోడ్డుకు పెట్టారని గుర్తుచేశారు. అమెరికా వెళ్లి ట్రంప్‌తో కలిసి మోదీ ప్రభుత్వాన్ని కూల్చుతారని భావించారా? అని ప్రశ్నించారు. హరీశ్‌రావు దేవుళ్ల గుళ్లకు వెళ్తే వివరాలు ఎందుకు చెప్పలేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారని దాసోజు శ్రవణ్‌ గుర్తుచేశారు. తాను విదేశాలకు వెళ్లినప్పుడు ఎవరెవరిని కలుస్తారన్నది రేవంత్‌రెడ్డి ఎందుకు చెప్పరని ప్రశ్నించారు. గురివింద సామెతలా ఎందుకు రేవంత్‌ ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. రేవంత్‌రెడ్డి పర్యటన రద్దుపై కేంద్ర విదేశాంగ శాఖకు లేఖ రాస్తామని దాసోజు శ్రవణ్‌ తెలిపారు. రేవంత్‌రెడ్డికి బీజేపీ ఎంపీల వకాల్తా ఎందుకని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ఎక్కడికి వెళ్తున్నారో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ విలేక‌రుల స‌మావేశంలో బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు ఉపేంద్రచారి, కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement